త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nitin Gadkari Flying Bus | గాల్లో ఎగిరే బస్సు.. నితిన్ గడ్కరీ సరికొత్త ప్లాన్!

ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు గాల్లో ఎగిరే బస్సులను నడపాలని ఉందంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

J

National | Published On Sep 30, 2026, 5.38 pm IST

Nitin Gadkari Flying Bus | గాల్లో ఎగిరే బస్సు.. నితిన్ గడ్కరీ సరికొత్త ప్లాన్!

సంక్షిప్త సారాంశం

దేశంలో గాల్లో ఎగిరే బస్సులను ప్రవేశపెట్టాలన్నది తన ఆలోచన అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. భవనాల పైనుంచి టేకాఫ్ అవుతూ దాదాపు 250 మంది ప్రయాణించే ఎయిర్ బస్సులపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ఇది వినడానికి వింతగా అనిపించినా, టెక్నాలజీ, రీసెర్చ్‌తో ఏదైనా సాధ్యమేనని స్పష్టం చేశారు. మార్పు అనేది సృష్టిలో సహజమని, భవిష్యత్ రవాణా వ్యవస్థలో వినూత్న మార్పులు రాబోతున్నాయని వ్యాఖ్యానించారు.

Advertisement
  • గాల్లో ఎగిరే బస్సు నడపడమే నా లక్ష్యం
  • కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన కామెంట్స్

Nitin Gadkari Flying Bus | త్రినేత్ర న్యూస్ : రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు భవిష్యత్తులో "గాల్లో ఎగిరే బస్సులను" (Flying Buses) నడపాలని తాను భావిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ప్రజారవాణాలో ఆధునిక సాంకేతికత ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

నవ్వుకోవద్దు.. టెక్నాలజీతో ఏదైనా సాధ్యమే

ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. "నేను గాల్లో ఎగిరే బస్సును నడపాలని అనుకుంటున్నాను. ఇది వినగానే మీరంతా ఆశ్చర్యంతో నవ్వుకోవచ్చు. ఇది ఎలా సాధ్యమని అనిపించవచ్చు. ఒక భవనం పైనుంచి నలుగురు ఎక్కి గాల్లో ఎగురుతూ నా ఇంటికి చేరుకోవడం, అక్కడి నుంచి నేను నేరుగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిపోవడం.. ఇలాంటి ఒక రవాణా వ్యవస్థ నా మదిలో మెదులుతోంది" అని వివరించారు.

250 మంది ప్రయాణించేలా ప్లాన్

భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏకంగా 250 మంది ఒకేసారి గాల్లో ప్రయాణించే అధునాతన ఎయిర్ బస్సుల రూపకల్పన సాధ్యమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునిక యుగంలో టెక్నాలజీ, ఇన్నోవేషన్, రీసెర్చ్ బలంతో అసాధ్యమనుకున్నవి కూడా సుసాధ్యమవుతున్నాయని గడ్కరీ గుర్తుచేశారు.

"మార్పు అనేది సృష్టి అలిఖిత నిబంధన. సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ సరికొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. రవాణా రంగంలో కూడా రాబోయే రోజుల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయి" అని నితిన్ గడ్కరీ తన విజన్‌ను పంచుకున్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

Advertisement
Advertisement