త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NTR-Trivikram Movie | ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’ కాదు.. ఎన్టీఆర్‌ మూవీ టైటిల్‌పై క్లారిటీ!

NTR-Trivikram Movie | యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మరోసారి కలిసి పనిచేయనున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఈ జోడీ నుంచి వస్తున్న కొత్త ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది.

P

Entertainment | Published On Sep 30, 2026, 4.55 pm IST

NTR-Trivikram Movie | ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’ కాదు.. ఎన్టీఆర్‌ మూవీ టైటిల్‌పై క్లారిటీ!
Advertisement

NTR-Trivikram Movie | యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మరోసారి కలిసి పనిచేయనున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఈ జోడీ నుంచి వస్తున్న కొత్త ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. తాజాగా ఓ ఆసక్తికరమైన పోస్టర్‌తో సినిమాను అధికారికంగా ప్రకటించడంతో ఈ బజ్‌ మరింత పెరిగింది. త్రిశూలం, కాలిపోయి ధ్వంసమైన ప్రపంచాన్ని తలపించే విజువల్స్‌తో విడుదలైన పోస్టర్‌ సినిమాకు సంబంధించి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘వన్‌ స్పియర్‌, వన్‌ పర్పస్‌.. వన్‌ డివైన్‌ రీకనింగ్‌’ అనే ట్యాగ్‌లైన్‌ కూడా సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. పోస్టర్‌ను బట్టి చూస్తే ఈసారి త్రివిక్రమ్‌ సరికొత్త కథా ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నారనే చర్చ మొదలైంది. ఈ సినిమా కార్తికేయ స్వామి (మురుగన్‌) నేపథ్యంలో సాగే పౌరాణిక డ్రామా అని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటివరకు కమర్షియల్‌, యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అంశాలతో సినిమాలు చేసిన ఎన్టీఆర్‌ను ఈ తరహా జానర్‌లో చూడటం ఇదే తొలిసారి కానుంది. దీంతో కథ ఎలా ఉండబోతోంది? ఎన్టీఆర్‌ పాత్ర స్వరూపం ఏంటి? అనే విషయాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి దర్శకుడు త్రివిక్రమ్‌ తాజాగా కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. ‘ఆదర్శ కుటుంబం’ ప్రమోషన్స్‌లో భాగంగా యాంకర్‌ సుమ కనకాలతో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఎన్టీఆర్‌తో చేయనున్న సినిమాకు పూర్తి స్క్రిప్ట్‌ సిద్ధంగా ఉందని వెల్లడించారు. అయితే, సినిమాకు సంబంధించిన టైటిల్‌ను మాత్రం ఇంకా ఖరారు చేయలేదని స్పష్టం చేశారు. కొంతకాలంగా ఈ చిత్రానికి ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. అభిమానులు కూడా ఇదే టైటిల్‌ ఖరారైందని భావించారు. అయితే, త్రివిక్రమ్‌ తాజా వ్యాఖ్యలతో ఆ టైటిల్‌ కేవలం ప్రచారంలో ఉన్నదేనని స్పష్టమైంది. అధికారికంగా ఏ టైటిల్‌ను ఫైనల్‌ చేయలేదన్న విషయంపై క్లారిటీ వచ్చింది. స్క్రిప్ట్‌ ఇప్పటికే పూర్తవడంతో త్వరలోనే సినిమా ప్రీ-ప్రొడక్షన్‌ పనులు ప్రారంభం కానున్నాయి. పౌరాణిక నేపథ్యం కావడంతో భారీ సెట్స్‌, విభిన్నమైన విజువల్స్‌, గ్రాండ్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌కు ప్రాధాన్యం ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.

అయితే కథ, పాత్రలు, నటీనటులు, షూటింగ్‌ తదితర వివరాలపై మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ గత కాంబినేషన్‌ ‘అరవింద సమేత వీర రాఘవ’లో భావోద్వేగాలు, యాక్షన్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన పౌరాణిక నేపథ్యాన్ని ఎంచుకోవడం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరగడానికి మరో కారణంగా మారింది. అందులోనూ ‘దేవుడి’ నేపథ్య కథలో ఎన్టీఆర్‌ను ఎలా చూపించబోతున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ప్రాజెక్ట్‌ ప్రకటనతోనే మంచి బజ్‌ క్రియేట్‌ కావడంతో.. ఇక టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌, నటీనటులు, షూటింగ్‌ తదితర అప్‌డేట్స్‌పై అభిమానుల దృష్టి నెలకొంది. మొత్తానికి ఎన్టీఆర్‌–త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఈసారి రాబోతున్న పౌరాణిక కథ ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి.

Advertisement
Advertisement