త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

B.Tech student suicide | టూర్‌కు వెళ్తున్నాన‌ని చెప్పాడు.. ఒంగోలులో శ‌వ‌మై తేలాడు

B.Tech student suicide | టూర్‌కు వెళ్తున్నాన‌ని చెప్పి కాచిగూడా రైల్వే స్టేష‌న్ నుంచి వెళ్లిన బీటెక్ విద్యార్థి రాహుల్ అదృశ్య‌మైన‌ కేసు విషాదాంత‌మైంది. ఒంగోలు స‌మీపంలోని సింగ‌రాయ‌కొండ ప్రాంతంలో ఓ బావిలో దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

S

Telangana | Published On Jun 8, 2026, 2.03 pm IST

B.Tech student suicide | టూర్‌కు వెళ్తున్నాన‌ని చెప్పాడు.. ఒంగోలులో శ‌వ‌మై తేలాడు
Advertisement
  • బీటెక్ విద్యార్థి రాహెల్ కేసులో తీవ్ర‌ విషాదాంతం
  • శోకసంద్రంలో కుటుంబ స‌భ్య‌లు

B.Tech student suicide | త్రినేత్ర‌.న్యూస్‌: టూర్‌కు వెళ్తున్నాన‌ని చెప్పి కాచిగూడా రైల్వే స్టేష‌న్ నుంచి వెళ్లిన బీటెక్ విద్యార్థి రాహుల్ అదృశ్య‌మైన‌ కేసు విషాదాంత‌మైంది. ప్ర‌కాశం జిల్లా ఒంగోలు స‌మీపంలోని సింగ‌రాయ‌కొండ ప్రాంతంలో ఓ బావిలో దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ విష‌యాన్ని పోలీసులు ధృవీక‌రించారు. త‌మ చేతికందిన కొడుకు చ‌నిపోయాడ‌న్న వార్త తెలుసుకొన్న‌ అత‌ని కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు.

కాచిగూడా పోలీసుల ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన అంకం రాహుల్ హైద‌రాబాద్‌లోని సైదాబాద్ మాతృశ్రీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవ‌త్స‌రం చదువుతున్నాడు. సైదాబాద్‌లోనే లక్ష్మికళ బాయ్స్ హాస్టల్‌లో ఉంటున్నాడు. గత నెల 27న టూర్‌కు వెళ్తున్నానని చెప్పి కాచిగూడలో ఎంఎంటీఎస్ రైలు ఎక్కి అదృశ్య‌మయ్యాడు. అప్ప‌టి నుంచి క‌నిపించ‌కపోవ‌డంతో తండ్రి అంకం రాజేశ్వ‌ర్ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేపట్టాం.

సికింద్రాబాద్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్‌లో ఒంగోలు పరిధిలోని సింగరాయకొండ చేరుకున్నాడు. రైలు దిగిన‌ అనంత‌రం అక్కడ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సింగరాయకొండ పోలీసులు 30వ తేదీన మృత‌దేహాన్ని వెలికి తీసి గుర్తు తెలియ‌ని వ్య‌క్తిగా కేసు నమోదు చేశారు. మృతుడి వ‌ద్ద‌ లభించిన వస్తువులు, ఆధారాలను పరిశీలించి రాహుల్‌గా గుర్తించారు. మృత‌దేహం రాహుల్‌దేన‌ని క‌చ్చితంగా ధృవీకరించడానికి డీఎన్‌ఏ (DNA) పరీక్ష నిర్వహించాల్సి ఉంది. కేసును మ‌రింత లోతుగా దర్యాప్తు చేస్తున్నాం అని కాచిగూడ పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా కొద్ది రోజుల క్రితమే తన కొడుకు కనిపించడం లేదని, ఆచూకీ తెలిస్తే చెప్పండి అంటూ రాహెల్ త‌ల్లి ఓ వీడియో విడుదల చేశారు. ఈ నేప‌థ్యంలో మ‌ర‌ణ‌వార్త విన్న కుటుంబ స‌భ్యులు, బంధువులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

Advertisement
Advertisement