త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | కాళేశ్వ‌రం మోటార్లు ఆన్ చేయండి.. రైతుల ఇబ్బందుల‌ను పట్టించుకోండి: హ‌రీశ్ రావు

Harish Rao | సాగు నీరు లేక రైతులు ఇబ్బంది ప‌డుతున్నార‌ని, త‌క్ష‌ణ‌మే కాళేశ్వ‌రం (Kaleshwaram) మోటార్లు ఆన్‌చేయాల‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. రైతు ప్ర‌యోనాల కోసం రాజ‌కీయాల‌కు అతీతంగా వెంట‌నే నీటి పంపింగ్ చేయాల‌న్నారు.

G

Telangana | Published On Aug 10, 2026, 12.29 pm IST

Harish Rao | కాళేశ్వ‌రం మోటార్లు ఆన్ చేయండి.. రైతుల ఇబ్బందుల‌ను పట్టించుకోండి: హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: సాగు నీరు లేక రైతులు ఇబ్బంది ప‌డుతున్నార‌ని, త‌క్ష‌ణ‌మే కాళేశ్వ‌రం (Kaleshwaram) మోటార్లు ఆన్‌చేయాల‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. రైతు ప్ర‌యోనాల కోసం రాజ‌కీయాల‌కు అతీతంగా వెంట‌నే నీటి పంపింగ్ చేయాల‌న్నారు. రిజ‌ర్వాయ‌ర్ల‌లో స‌కాలంలో నీటిని నింప‌క‌పోవ‌డంతో సాగు ముందుకు సాగక రైతులు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నార‌ని చెప్పారు. ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే కాళేశ్వ‌రం మోటార్ల‌ను ఆన్‌చేసి రిజ‌ర్వాయ‌ర్లు నింపాలంటూ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) లేఖ రాశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో వివిధ జిల్లాల్లోని రిజ‌ర్వాయ‌ర్లు అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్‌లను నింపి సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలోని రైతుల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మోటార్లను ఆన్ చేసి వెంటనే నీటి పంపింగ్ చేయాలన్నారు. ప్రస్తుత వానాకాలం పంట సీజన్‌లో ఇటు ఎలినినో (El Nino) వల్ల తక్కువ వర్షాభావం, అటు ప్రాజెక్టుల్లో రిజర్వాయర్ లలో నీటిని సకాలం లో నింపక పోవడం తద్వారా పంటల సాగు ముందుకు సాగక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నార‌ని పేర్కొన్నారు. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వలన వచ్చే వరదను ఒడిసి పట్టి సకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌లను ఆన్‌చేసి రైతుల ప్రయోజనాల దృష్ట్యా నీటి పంపింగ్ ప్రారంభించాలని రైతుల పక్షాన డిమాండ్ చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleshwaram Project) అంతర్భాగం అయిన మిడ్ మానేరు (Mid Manair) రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 27 టీఎంసీలు. ప్రస్తుతం సుమారు 22 టీఎంసీల‌ నీటి లభ్యత ఉంది. అదేవిధంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వలన గోదావరిలోని (Godavari) వరద నీటి లభ్యత కూడా ఏర్పడింది. దీనిని దృష్టిలో ఉంచుకొని మిడ్ మానేరు నుంచి మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ ప్రారంభించాలి. తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ తదితర రిజర్వాయర్‌లను, వాటి పరిధిలోని చెరువులను, చెక్ డ్యామ్‌లు అన్నింటిని నింపి సుమారు 4లక్షల ఎకరాలకు నీరందించేలా చర్యలు తీసుకోండి. రైతు సాగు ప్రయోజనాలు తీర్చడానికి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నీటి పంపింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు.

అదేవిదంగా లోయర్ మానేరు డ్యామ్ (LMD) పూర్తి నీటి సామర్థ్యం 24 టీఎంసీల‌కుగాను ప్రస్తుతం 6.9 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అందువ‌ల్ల మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరుకు నీటిని నింపి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 (SRSP) లో అవసరమైన ఆయకట్టుకు నీరు అందించి రైతులను అదుకోవాలన్నారు. గ‌త యాసంగి సీజ‌న్‌లో కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్ల ఆయకట్టు పరిధిలో 4 లక్షల ఎకరాలు సాగైన విషయం గుర్తించి ఈ వానాకాలం పంటకి, అదేవిధంగా వచ్చే యాసంగి పంటకు కూడా సాగు నీరు అందించేలా అన్ని రిజర్వాయర్ల‌ను నింపాల‌న్నారు. రైతుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించి రైతు ప్రయోజనాల దృష్ట్యా రాజకీయలకు అతీతంగా వెంటనే నీటి పంపింగ్ ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని లేఖ‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement