త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gutha Sukender Reddy | మహబూబ్‌నగర్ నల్లగొండ మధ్య జల వివాదాలు సృష్టిస్తున్నారు..: గుత్తా సుఖేందర్ రెడ్డి

Gutha Sukender Reddy | మహబూబ్‌నగర్, నల్ల‌గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించే విధంగా కొందరు ప్రవర్తిస్తున్నార‌ని, వివాదాలు సృష్టించడం సరికాద‌ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు.

G

Telangana | Published On Oct 14, 2026, 1.48 pm IST

Gutha Sukender Reddy | మహబూబ్‌నగర్ నల్లగొండ మధ్య జల వివాదాలు సృష్టిస్తున్నారు..: గుత్తా సుఖేందర్ రెడ్డి
Advertisement

Gutha Sukender Reddy | త్రినేత్ర న్యూస్‌: మహబూబ్‌నగర్, నల్ల‌గొండ జిల్లాల మధ్య జల వివాదాలు సృష్టించే విధంగా కొందరు ప్రవర్తిస్తున్నార‌ని, వివాదాలు సృష్టించడం సరికాద‌ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూడాల‌ని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి (Palamuru Rangareddy), డిండి ఎత్తిపోతల పథకాల పనులను త్వరితగతిన పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. ఎదుళ్ల రిజర్వాయర్ (Yedulla Reservior) నుంచి రెండు జిల్లాలకు నీటి కేటాయింపులపై సామరస్యపూర్వకంగా వ్యవహరించాల‌న్నారు. రెండు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేల‌తో ముఖ్య‌మంత్రి స‌మావేశం నిర్వ‌హించాల‌ని సూచించారు. న‌ల్ల‌గొండ‌లోని త‌న క్యాంపు కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. `నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఆనాడు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఎంతోమంది త్యాగాలు, పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో (Telangana) నేడు జిల్లాల మధ్య చిచ్చుపెట్టే విధంగా కొందరు వ్యవహరించడం బాధాకరం. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలుగుతుంద‌ని` చెప్పారు.

మహబూబ్‌నగర్, నల్ల‌గొండ (Nalgonda) జిల్లాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రెండు జిల్లాల రైతాంగానికి సాగునీరు అందించాలన్నదే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంద‌ని చెప్పారు. ఎదుళ్ల రిజర్వాయర్ నుంచి రోజుకు 1.5 టీఎంసీల నీటిని పాలమూరు ప్రాంతానికి, 0.5 టీఎంసీల నీటిని డిండి ఎత్తిపోతల పథకానికి కేటాయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు.

రెచ్చగొట్టే విధంగా..

అయితే ఈ నిర్ణయాన్ని వివాదాస్పదం చేస్తూ కొందరు మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం సరికాదని చెప్పారు. అనవసరమైన వివాదాలు సృష్టించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని వెల్ల‌డించారు. నార్లాపూర్ నుంచి నీటిని తరలించాలంటే అదనపు ఖర్చుతో పాటు ఎక్కువ సమయం అవసరమవుతుందని, అనుమతుల సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల నిర్మాణంలో సాంకేతిక అంశాలు, ఆర్థిక భారం, సమయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంద‌ని వెల్ల‌డించారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రతను, ప్రాంతాల మధ్య సోదరభావాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు.

నల్ల‌గొండ జిల్లా దశాబ్దాలుగా ఫ్లోరైడ్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతమని గుర్తుచేశారు. ఫ్లోరైడ్ సమస్య నుంచి ప్రజలను శాశ్వతంగా కాపాడాలంటే సురక్షితమైన తాగునీటితో పాటు సాగునీటి వసతులు కూడా అందుబాటులో ఉండాలని చెప్పారు. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇంజినీర్లు రాజకీయ, ప్రాంతీయ వివాదాలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు. రెండు జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా సాంకేతిక సలహాలు, సూచనలు అందించి ప్రాజెక్టుల పనులను ముందుకు తీసుకెళ్లాలని కోరారు.

ఏ జిల్లాకు ఎంత నీరు అవసరమో..

మహబూబ్‌నగర్, నల్ల‌గొండ జిల్లాల ప్రజాప్రతినిధులు పరస్పరం చర్చించుకుని, ఎదుళ్ల రిజర్వాయర్ నుంచి ఏ జిల్లాకు ఎంత నీరు అవసరమో సామరస్యపూర్వకంగా నిర్ణయించుకోవాలని సూచించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ముఖ్యమంత్రి (Revanth Reddy) చొరవ తీసుకోవాలన్నారు. రెండు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుల విషయంలో అనవసరమైన జాప్యం జరగకుండా పెండింగ్ పనులను వేగవంతం చేసి రైతులకు వీలైనంత త్వరగా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎల్‌నినో ప్రభావం..

ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో (El Nino) ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఈ నేపథ్యంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో జలవిద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గిందని, దీనివల్ల విద్యుత్ సరఫరాపై ఒత్తిడి పెరుగుతున్న‌ద‌ని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.

రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముఖ్యం..

ముఖ్యంగా రబీ సీజన్‌లో రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలన్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా రైతులు (Farmers) నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు. రానున్న రోజుల్లో నీటి సమస్య మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని, అందువల్ల రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలే అందరికీ ప్రథమ ప్రాధాన్యం కావాలని, జిల్లాల మధ్య వివాదాలకు తావులేకుండా పరస్పర సహకారంతో సాగునీటి సమస్యలను పరిష్కరించుకోవాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement