త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

G Chinna Reddy | యూపీఎస్సీ త‌ర‌హాలో గ్రూప్-1 నియామ‌కాలు చేప‌ట్టాలి

G Chinna Reddy | రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హించే గ్రూప్-1 నియామ‌కాల‌ను యూపీఎస్సీ త‌ర‌హాలో చేప‌ట్టాల‌ని మాజీ మంత్రి డాక్ట‌ర్ జీ చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. గ్రూప్-1 నియామ‌క ప్ర‌క్రియ‌ను కూడా ప్రిలిమిన‌రీ, మెయిన్స్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా నిర్వ‌హించాల‌ని ఆయ‌న సూచించారు.

S

Telangana | Published On Sep 27, 2026, 5.12 pm IST

G Chinna Reddy | యూపీఎస్సీ త‌ర‌హాలో గ్రూప్-1 నియామ‌కాలు చేప‌ట్టాలి
Advertisement

గ్రామీణ విద్యార్థుల‌కు ఉచితంగా కోచింగ్ అందించాలి
మాజీ మంత్రి చిన్నారెడ్డి డిమాండ్

G Chinna Reddy | త్రినేత్ర న్యూస్ : రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హించే గ్రూప్-1 నియామ‌కాల‌ను యూపీఎస్సీ త‌ర‌హాలో చేప‌ట్టాల‌ని మాజీ మంత్రి డాక్ట‌ర్ జీ చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. గ్రూప్-1 నియామ‌క ప్ర‌క్రియ‌ను కూడా ప్రిలిమిన‌రీ, మెయిన్స్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా నిర్వ‌హించాల‌ని ఆయ‌న సూచించారు. ముఖ్యంగా ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ను యూపీఎస్సీ ద్వారా తెలంగాణ‌లో నిర్వ‌హించే అవ‌కాశాన్ని పరిశీలించాల‌న్నారు.

తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన, ఉన్నత విద్యార్హతలు కలిగిన యువత యూపీఎస్సీ, టీజీపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమై గ్రూప్–1 సర్వీసుల్లో అత్యున్నత స్థానాలు సాధించేలా ప్రభుత్వం అవసరమైన శిక్షణ, కోచింగ్ సౌకర్యాలను కల్పించాలని చిన్నారెడ్డి ఒక ప్రకటనలో కోరారు.

గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం ప్రత్యేక కోచింగ్ సెంటర్లతో పాటు సిటీ లైబ్రరీలు, అన్ని ప్రాంతాల్లో ఆధునిక సౌకర్యాలతో కూడిన లైబ్రరీలను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులు స్వయంగా చదువుకుని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా వాతావరణం కల్పించడంతో పాటు గ్రూప్–1 పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం, ఒక రాష్ట్ర గవర్నర్ అభ్యర్థన మేరకు, భారత రాష్ట్రపతి అనుమతితో యూపీఎస్సీ రాష్ట్ర అవసరాలకు సేవలందించే అవకాశం ఉందని తెలిపారు. ఈ నిబంధన ఆధారంగా తెలంగాణ గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు యూపీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించవచ్చని పేర్కొన్నారు.

యూపీఎస్సీ ద్వారా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తే పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెరగడంతో పాటు పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివాదాలు తగ్గే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రతి సంవత్సరం పరీక్ష నిర్వహించే విధానం ద్వారా తెలంగాణ యువత ముందుగానే ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు గ్రూప్–1 పోస్టుల నియామకాలు చేపట్టలేదని డా. చిన్నారెడ్డి పేర్కొన్నారు. గతంలో నిర్వహించిన గ్రూప్–1 పరీక్షకు సంబంధించి పేపర్ లీకేజీ, మాస్ కాపీయింగ్ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాల్సి వచ్చిందని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్–1 పరీక్షను నిర్వహించి నియామక ప్రక్రియను చేపట్టిందని, యూపీఎస్సీ తరహాలో దశలవారీగా పరీక్షలు నిర్వహించి అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. భవిష్యత్తులోనూ అభ్యర్థులకు తగిన అవకాశాలు కల్పిస్తూ పారదర్శకంగా, క్రమబద్ధంగా నియామక ప్రక్రియ కొనసాగించాలని ఆయన కోరారు.

Advertisement
Advertisement