త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GCC | సాఫ్ట్‌వేర్ నుంచి సెమీకండక్టర్ల దాకా.. కొత్త తరం పరిశ్రమల కేంద్రంగా తెలంగాణ

GCC | ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో తమ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. కొత్తగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (GCC) ఏర్పాటులో బెంగళూరును సైతం హైదరాబాద్ అధిగమించింది. డేటా సెంటర్ల ఏర్పాటులో ముంబైతో పోటీపడుతోంది. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలు భారీ పెట్టుబడులతో తెలంగాణకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి.

S

Telangana | Published On Nov 29, 2026, 2.07 pm IST

GCC | సాఫ్ట్‌వేర్ నుంచి సెమీకండక్టర్ల దాకా.. కొత్త తరం పరిశ్రమల కేంద్రంగా తెలంగాణ
Advertisement

కొత్త జీసీసీల ఏర్పాటులో హైదరాబాద్ అగ్రస్థానం
డేటా సెంటర్ల ప్రాజెక్టుల్లో దేశంలో రెండో స్థానం
గ్లోబల్ సమ్మిట్‌కు తరలిరానున్న దిగ్గజ కంపెనీలు

GCC | త్రినేత్ర న్యూస్ : ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో తమ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. కొత్తగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (GCC) ఏర్పాటులో బెంగళూరును సైతం హైదరాబాద్ అధిగమించింది. డేటా సెంటర్ల ఏర్పాటులో ముంబైతో పోటీపడుతోంది. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలు భారీ పెట్టుబడులతో తెలంగాణకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. సాఫ్ట్‌వేర్ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన హైదరాబాద్ ఇప్పుడు కొత్త తరం సాంకేతిక పరిశ్రమలకు కేంద్రంగా ఎదుగుతోంది.

ఈ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. కొత్త పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఐటీ, జీసీసీలు, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల రంగాలకు కొత్త పాలసీలను రూపొందించింది. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వేదికగా వీటిని ఆవిష్కరించనుంది.

ఈసారి గ్లోబల్ సమ్మిట్‌కు అందిన పెట్టుబడి ప్రతిపాదనల్లో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల వాటానే ఎక్కువ. ఈ రంగాల్లో ఇప్పటికే రూ.1.35 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు 42 సంస్థలు ముందుకు వచ్చాయి. వీటిలో దాదాపు 25 ప్రతిపాదనలకు సంబంధించి సమ్మిట్‌లో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఒప్పందాలు అమల్లోకి వస్తే దాదాపు 18 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా.

జీసీసీల ఏర్పాటులో బెంగళూరు కంటే ముందంజ

దేశంలోని మొత్తం జీసీసీల్లో దాదాపు 20 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో కొత్త జీసీసీల ఏర్పాటులో దేశంలోని ప్రధాన నగరాల కంటే హైదరాబాద్ ముందంజలో నిలిచింది. హైదరాబాద్‌లో 70కి పైగా జీసీసీలు ఏర్పాటయ్యాయి. ఇదే సమయంలో బెంగళూరులో 30 నుంచి 35, పుణెలో 15 నుంచి 20, చెన్నైలో 12 నుంచి 15 జీసీసీలు ఏర్పాటయ్యాయి. సెప్టెంబర్‌లో ఫిక్కీ, అనరాక్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది మార్చి నాటికి హైదరాబాద్‌లో దాదాపు 515 జీసీసీలున్నాయి. వీటిలో మూడు లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు. కొత్త జీసీసీల ఏర్పాటుకు బెంగళూరు కంటే హైదరాబాద్‌ను ఎంచుకునేందుకు కంపెనీలు ఎక్కువ ఆసక్తి చూపుతుండటం విశేషం. ఏఎన్‌ఎస్‌ఆర్ సంస్థ అంచనా ప్రకారం 2027లో హైదరాబాద్‌లో మరో 60 నుంచి 70 జీసీసీలు ఏర్పాటయ్యే అవకాశముంది.

డేటా సెంటర్ల ఏర్పాటులో దేశంలో రెండో స్థానం

కొత్త డేటా సెంటర్ల ప్రాజెక్టుల సంఖ్యలో హైదరాబాద్ దేశంలో రెండో స్థానంలో ఉంది. నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజా అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 80 డేటా సెంటర్ల ప్రాజెక్టులు అమలు, ప్రణాళిక దశల్లో ఉన్నాయి. ముంబైలో 34, హైదరాబాద్‌లో 15 ప్రాజెక్టులున్నాయి. మొత్తం ప్రాజెక్టుల్లో హైదరాబాద్ వాటా 18.8 శాతం. గతేడాది హైదరాబాద్‌లో 11 ప్రాజెక్టులుండగా ఈ ఏడాది వాటి సంఖ్య 36.4 శాతం పెరిగింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్, అదానీ కనెక్స్, కంట్రోల్‌ఎస్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. డేటా సెంటర్ల ఏర్పాటుకు చందన్‌వెల్లి, భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక క్లస్టర్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈసారి కూడా గ్లోబల్ సమ్మిట్‌లోనూ డేటా సెంటర్ల రంగంలో భారీ పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

చిప్‌ల తయారీ పరిశ్రమలపై దృష్టి

చిప్‌ల డిజైన్ రంగంలో హైదరాబాద్‌కు ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ రెండు రంగాల్లో రూ.52 వేల కోట్ల విలువైన పెట్టుబడులకు వివిధ సంస్థలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. సెమీకండక్టర్ల రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కేడెన్స్, సినాప్సిస్, ఎన్‌ఎక్స్‌పీ, మాస్‌చిప్ వంటి సంస్థలు ఈసారి గ్లోబల్ సమ్మిట్‌లో పాలుపంచుకోనున్నాయి. ఎలక్ట్రానిక్స్, టెలికాం రంగాలకు చెందిన సిస్కో, జియో, ఎయిర్‌టెల్, తేజస్ నెట్‌వర్క్స్ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి.

ఒకే వేదికపై ఐటీ దిగ్గజాలు

ఐటీ, జీసీసీలు, డేటా సెంటర్లు, కృత్రిమ మేధ రంగాలకు చెందిన 62 సంస్థలు గ్లోబల్ సమ్మిట్‌లో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, ఐబీఎం, వాన్‌గార్డ్, కేపీఎంజీ, టీ–మొబైల్ వంటి ప్రముఖ సంస్థలు ఇందులో పాల్గొంటాయి. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, టెలికాం తదితర రంగాలకు చెందిన మరో 49 సంస్థలు ప్రదర్శనలు ఏర్పాటు చేస్తాయి. కృత్రిమ మేధ రంగంలో పనిచేస్తున్న సర్వం ఏఐ, దక్కన్ ఏఐ, శాట్‌స్యూర్ వంటి సంస్థలు తమ ఆవిష్కరణలను ప్రదర్శిస్తాయి. ఐఐటీ హైదరాబాద్, బిట్స్‌కు చెందిన పరిశోధనా కేంద్రాలు కూడా ఇందులో పాలుపంచుకుంటున్నాయి.

మూడు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు

డిసెంబర్ 7న గ్లోబల్ సమ్మిట్‌లో సెమీ కండక్టర్లు, చిప్‌ల డిజైన్, ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమలపై ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. డిసెంబర్ 8న హైదరాబాద్‌లో సాంకేతిక ఉత్పత్తుల అభివృద్ధి కేంద్రాల ఏర్పాటుపై సమావేశం ఉంటుంది. డిసెంబర్ 9న కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్, ప్రభుత్వ సేవల్లో ఏఐ వినియోగంపై చర్చలు జరగనున్నాయి. ఆయా రంగాలకు చెందిన దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు.

Advertisement
Advertisement