Bill Gates Warns | ఏఐతో ప్రపంచానికి సైబర్ ముప్పు.. ఆస్పత్రులు, బ్యాంకులపై హ్యాకర్ల గురి! బిల్ గేట్స్ సంచలన హెచ్చరిక
Bill Gates Warns | ఆర్టిఫిషీయిల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక ప్రపంచానికి ఎన్ని ప్రయోజనాలు అందిస్తోందో.. అంతే స్థాయిలో కొత్త ముప్పును తీసుకొస్తోంది. ముఖ్యంగా సైబర్ భద్రత విషయంలో ఏఐతో పెను ప్రమాదం పొంచి ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రులు, బ్యాంకులు, విద్యుత్ గ్రిడ్‌ల వంటి కీలక వ్యవస్థల సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను హ్యాకర్లు ఏఐ టూల్స్ సాయంతో గుర్తించి సైబర్ దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
International | Published On Nov 29, 2026, 1.39 pm IST
Bill Gates Warns | ఆర్టిఫిషీయిల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక ప్రపంచానికి ఎన్ని ప్రయోజనాలు అందిస్తోందో.. అంతే స్థాయిలో కొత్త ముప్పును తీసుకొస్తోంది. ముఖ్యంగా సైబర్ భద్రత విషయంలో ఏఐతో పెను ప్రమాదం పొంచి ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రులు, బ్యాంకులు, విద్యుత్ గ్రిడ్‌ల వంటి కీలక వ్యవస్థల సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను హ్యాకర్లు ఏఐ టూల్స్ సాయంతో గుర్తించి సైబర్ దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ దాడులతో కీలక డిజిటల్ వ్యవస్థలు స్తంభించిపోయే అవకాశం ఉందన్నారు. ఫైనాన్షియల్ టైమ్స్ నిర్వహించిన ‘ఫ్యూచర్ ఆఫ్ ఏఐ’ సదస్సులో పాల్గొన్న గేట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆధునిక ఏఐ టూల్స్ అందుబాటులో ఉన్న హ్యాకర్ల బృందం.. ప్రస్తుతం కీలక డిజిటల్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయగలదని అభిప్రాయపడ్డారు. ఈ వ్యవస్థల్లోని సాఫ్ట్‌వేర్‌ను సురక్షితంగా మార్చడం అత్యంత క్లిష్టమైన పని అని పేర్కొన్నారు. ప్రాధాన్యతా క్రమంలో నిరంతరం చర్యలు చేపట్టినా.. సాఫ్ట్‌వేర్‌లోని బలహీనమైన కోడ్‌ను పూర్తిగా మార్చేందుకు సుమారు ఐదేళ్లు పట్టవచ్చని అంచనా వేశారు.
ఓపెన్ సోర్స్ ఏఐ మోడళ్లతోనే అసలు ముప్పు
బిల్ గేట్స్ ఆందోళనల్లో ప్రధానమైనది ఓపెన్ సోర్స్ ఏఐ మోడళ్లు. వీటికి సంబంధించిన మోడల్ వెయిట్స్ (పారామీటర్లు) అందుబాటులో ఉండటంతో ఇతరులు వాటిని తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ క్రమంలో భద్రతా పర్యవేక్షణ, రక్షణ వ్యవస్థలు వంటి కీలక ఫీచర్లను తొలగించే ప్రమాదం ఉందని గేట్స్ పేర్కొన్నారు. అలాంటి మోడళ్లను దుర్వినియోగం చేస్తే సైబర్ దాడులను గుర్తించేలోపే భారీ నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆస్పత్రులు, విద్యుత్ నెట్‌వర్క్‌లు, బ్యాంకింగ్ వ్యవస్థలు అత్యంత సంక్లిష్టమైన సాఫ్ట్‌వేర్‌పై ఆధారపడి పనిచేస్తున్నాయి. ఏఐ సాయంతో వాటిలోని లోపాలను గతంలో కంటే వేగంగా గుర్తించవచ్చు. ఈ బలహీనతలను హ్యాకర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటే కీలక సేవలకు అంతరాయం కలిగే ప్రమాదం ఉందని ఆయన వివరించారు.
వేగంగా బయటపడుతున్న సాఫ్ట్‌వేర్ లోపాలు
సాఫ్ట్‌వేర్‌లోని బలహీనతలను గుర్తించడమే కాకుండా.. వాటిని సరిచేసి మరింత భద్రంగా మార్చడంలోనూ ఏఐ ఉపయోగపడుతుందని గేట్స్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రక్రియ అంత సులభం కాదని, అవసరమైన మార్పులు పూర్తి చేయడానికి సుమారు ఐదేళ్లు పట్టవచ్చని తెలిపారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సైతం ఏఐతో పెరుగుతున్న సైబర్ ముప్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. న్యూయార్క్ టైమ్స్ నిర్వహించిన ‘డీల్‌బుక్ సమ్మిట్’లో మాట్లాడుతూ.. ఏఐ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ లోపాలను అత్యంత వేగంగా గుర్తిస్తోందన్నారు. అందువల్ల కొత్త భద్రతా అప్‌డేట్లు అందుబాటులోకి రాగానే వాటిని ప్రొడక్షన్ సిస్టమ్‌లలో అమలు చేయడం కీలకమని పేర్కొన్నారు. ఎందుకంటే లోపాలను సరిచేసే అప్‌డేట్లు విడుదలయ్యేలోపే హ్యాకర్లు వాటిని ఉపయోగించుకునే ప్రమాదం ఉందని వివరించారు. ప్రస్తుత పరిస్థితిని గతంలో ఎదురైన ‘వై2కే’ సమస్యతో నాదెళ్ల పోల్చారు. అప్పట్లో ఒక నిర్దిష్ట తేదీకి సంబంధించిన సమస్య ఉండగా.. ప్రస్తుత సాఫ్ట్‌వేర్ లోపాల పరిధి చాలా విస్తృతంగా ఉందని స్పష్టం చేశారు.
ర్యాన్సమ్‌వేర్, క్రిప్టోతో మరింత ప్రమాదం
సైబర్ దాడుల వెనుక నేరగాళ్లకు ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయని గేట్స్ పేర్కొన్నారు. ర్యాన్సమ్‌వేర్ దాడుల ద్వారా కంప్యూటర్ వ్యవస్థలను లాక్ చేసి, వాటిని తిరిగి అందుబాటులోకి తీసుకురావడానికి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసే అవకాశం ఉందన్నారు. క్రిప్టోకరెన్సీ ద్వారా చెల్లింపులు స్వీకరించడం కూడా నేరగాళ్లకు అనుకూలంగా మారుతోందని వివరించారు. ఈ పరిణామాలతో రానున్న రోజుల్లో సైబర్ దాడులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. గత ఏడాది చివరి నుంచి ఏఐ ఆధారిత కోడింగ్ టూల్స్ వేగంగా అభివృద్ధి చెందాయని గేట్స్ గుర్తుచేశారు. అనేక సందర్భాల్లో ఇవి మానవ ప్రోగ్రామర్ల కంటే మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి ఇది సానుకూల పరిణామమే అయినప్పటికీ.. అదే సాంకేతికత తప్పుడు చేతుల్లోకి వెళ్తే భద్రతా ముప్పులు పెరుగుతాయని హెచ్చరించారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ రాసే కోడ్‌లో దాదాపు మూడో వంతు ఏఐ సాయంతో రూపొందుతోందన్న కథనాలు వచ్చాయి. సైబర్ దాడులతోపాటు ఏఐ వల్ల జీవసంబంధమైన ముప్పులు కూడా పొంచి ఉన్నాయని గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని దుర్వినియోగం చేస్తే కోవిడ్-19 కంటే తీవ్ర ప్రభావం చూపగల జీవసంబంధ పదార్థాలు, ప్రమాదాలను సృష్టించేందుకు దోహదపడే అవకాశం ఉందని హెచ్చరించారు. సైబర్ నేరాల మాదిరిగా జీవసంబంధ ముప్పుల వెనుక ఎల్లప్పుడూ ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనం ఉండకపోవచ్చని పేర్కొన్నారు.
ప్రభుత్వాల నియంత్రణ అవసరం..
అయితే, ఏఐ సంస్థలే తమ భద్రతా ప్రమాణాలను నిర్ణయించుకోవడం సరిపోదని బిల్ గేట్స్ స్పష్టం చేశారు. ఈ రంగంలో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో కంపెనీల స్వీయ నియంత్రణలతో ప్రమాదాలను పూర్తిగా అడ్డుకోలేమని అభిప్రాయపడ్డారు. ఓపెన్ వెయిట్ మోడల్స్ వినియోగంపై ప్రభుత్వాలు స్పష్టమైన నిబంధనలు రూపొందించాలని సూచించారు. ప్రతి కొత్త ఏఐ మోడల్‌లో భద్రతా పర్యవేక్షణ, రక్షణ ఫీచర్లు తప్పనిసరిగా ఉండేలా ప్రమాణాలు తీసుకురావాలని కోరారు. ప్రస్తుతం అమెరికాలో కొత్త ఏఐ మోడళ్లకు తప్పనిసరి పరీక్షల విధానం లేదని గేట్స్ పేర్కొన్నారు. అమెరికా ముందడుగు వేయనంతవరకు చైనా వంటి దేశాలు కూడా చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నాయని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో అమెరికా ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కఠినమైన నియంత్రణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు ఎన్ని తీవ్రమైన ఘటనలు జరిగే వరకు వేచి చూస్తాయన్నదే అసలు ప్రశ్న అని వ్యాఖ్యానించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RSS | సంబరాల కోసం కాదు.. సమాజ సేవకు మరో అవకాశం.. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రస్థానంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..!
నవంబర్ 29, 2026

IND Vs NZ Test | రెండో టెస్టులో భారత్‌కు కష్టాలు.. కివీస్ ఆధిక్యం 243 రన్స్
నవంబర్ 29, 2026

Tirupparankundram | భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుప్పరంకుండ్రం కొండపై డిసెంబర్ 15 దాకా దీపాలు వెలిగించొచ్చు!
నవంబర్ 29, 2026
తాజావార్తలు
- ●Delimitation Bill 2026 | లోక్‌సభలో మోదీ సర్కార్ మార్క్ '371'.. డీలిమిటేషన్ బిల్లు గట్టెక్కేదిలా!
- ●Keerthy Suresh | బ్లాక్‌డ్రెస్‌లో కీర్తి సురేష్ అందాల హోయలు
- ●KTR | రేవంత్ రెడ్డి నోట.. కేసీఆర్ పేరు కోటి సార్లు
- ●Renu Desai | గుడికి వెళ్లి పూజలు చేస్తారు... కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లను పట్టించుకోరు - రేణుదేశాయ్ కామెంట్స్ వైరల్
- ●Delimitation Bill 2026 | స్టాలిన్‌ను ఒప్పించలేకపోయిన సోనియా, రాహుల్.. గంటపాటు సాగిన చర్చలు విఫలం!
- ●KTR | 90 సీట్లు కాదు.. 900 ఫీట్ల లోతున కాంగ్రెస్‌ను పాతి పెడుతాం

Delimitation Bill 2026 | లోక్‌సభలో మోదీ సర్కార్ మార్క్ '371'.. డీలిమిటేషన్ బిల్లు గట్టెక్కేదిలా!

Keerthy Suresh | బ్లాక్‌డ్రెస్‌లో కీర్తి సురేష్ అందాల హోయలు

KTR | రేవంత్ రెడ్డి నోట.. కేసీఆర్ పేరు కోటి సార్లు

Renu Desai | గుడికి వెళ్లి పూజలు చేస్తారు... కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లను పట్టించుకోరు - రేణుదేశాయ్ కామెంట్స్ వైరల్



