త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Global Summit | ఫ్యూచర్ సిటీలో భారీ రక్షా ఎక్స్‌పో.. 130 కంపెనీలు, సంస్థల భాగస్వామ్యం

Global Summit | రక్షణ, విమానయాన రంగాల్లో భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రజా ప్రభుత్వం సన్నద్ధమైంది. దేశ, విదేశాలకు చెందిన రక్షణ రంగ దిగ్గజ సంస్థలను హైదరాబాద్‌లో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు (Global Summit) ఆహ్వానించింది.

G

Telangana | Published On Nov 29, 2026, 12.45 pm IST

Global Summit | ఫ్యూచర్ సిటీలో భారీ రక్షా ఎక్స్‌పో.. 130 కంపెనీలు, సంస్థల భాగస్వామ్యం
Advertisement

Global Summit | త్రినేత్ర న్యూస్‌: రక్షణ, విమానయాన రంగాల్లో భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రజా ప్రభుత్వం సన్నద్ధమైంది. దేశ, విదేశాలకు చెందిన రక్షణ రంగ దిగ్గజ సంస్థలను హైదరాబాద్‌లో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు (Global Summit) ఆహ్వానించింది. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏడు రోజుల పాటు భారీ రక్షణ రంగ ప్రదర్శన (Raksha Expo) నిర్వహించనుంది. డీఆర్‌డీవో, హెచ్‌ఏఎల్, టాటా, లాక్‌హీడ్ మార్టిన్ వంటి ప్రముఖ సంస్థలు ఇందులో పాల్గొంటాయి. భారత త్రివిధ దళాలు ప్రత్యేక ప్రదర్శనలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

దేశంలోని రక్షణ, విమానయాన పరిశ్రమల్లో దాదాపు 30 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఈ రంగంలో తెలంగాణకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవటంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. కొత్త పరిశ్రమల స్థాపనతో పాటు ఇప్పటికే ఉన్న పరిశ్రమల విస్తరణను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. విమానయాన, రక్షణ, అంతరిక్ష పరిశ్రమలకు ప్రత్యేక పాలసీని రూపొందించింది. రక్షణ రంగంలో తెలంగాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఈసారి గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా రక్షా ఎక్స్‌పోను నిర్వహిస్తోంది.

భారీ విస్తీర్ణంలో ప్రదర్శన

డిసెంబర్ 7న సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా రక్షా ఎక్స్‌పోను ప్రారంభిస్తారు. ఈ ప్రదర్శన 13వ తేదీ వరకు కొనసాగుతుంది. మొత్తం 130 సంస్థలు పాల్గొంటాయి. ఇందుకోసం 14,400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భారీ ప్రదర్శనశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆరుబయట ప్రదర్శనలకు మరో 40 వేల చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించారు. రక్షణ, విమానయాన, అంతరిక్ష రంగాల్లో తయారవుతున్న ఉత్పత్తులను ఆయా సంస్థలు ప్రదర్శిస్తాయి. అంతర్గత భద్రత, సైబర్ భద్రతకు సంబంధించిన ఆధునిక సాంకేతిక ఉత్పత్తులను కూడా ప్రదర్శనలో ఉంచుతారు.

ఒకే వేదికపై దిగ్గజ సంస్థలు

డీఆర్‌డీవో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ డైనమిక్స్, మిధాని, ఈసీఐఎల్ వంటి సంస్థలు రక్షా ఎక్స్‌పోలో పాల్గొంటాయి. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఎల్ అండ్ టీ, అదానీ ఏరోస్పేస్, కల్యాణి గ్రూప్ తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. అంతర్జాతీయంగా పేరొందిన లాక్‌హీడ్ మార్టిన్, సఫ్రాన్, డసాల్ట్ సంస్థలు కూడా పాల్గొంటాయి. అంతరిక్ష, డ్రోన్ల తయారీ రంగాల్లో గుర్తింపు పొందిన స్కైరూట్, ధ్రువ స్పేస్, మారుత్ డ్రోన్స్ వంటి సంస్థలు ఇందులో పాలుపంచుకుంటాయి.

స్థానిక పరిశ్రమలకు అవకాశాలు

రక్షా ఎక్స్‌పోలో తొలి మూడు రోజులు పారిశ్రామిక, వాణిజ్య సమావేశాలు నిర్వహిస్తారు. దేశ, విదేశీ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో తెలంగాణ పారిశ్రామికవేత్తలు నేరుగా సమావేశమయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రక్షణ రంగ ఉత్పత్తుల కొనుగోలుదారులు, తయారీదారుల మధ్య ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. వివిధ దేశాల రక్షణ శాఖ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. కొత్త పెట్టుబడి ఒప్పందాలు, ఉత్పత్తుల ఆవిష్కరణకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ సమావేశాల ద్వారా రక్షణ రంగంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, స్టార్టప్‌లకు కొత్త వ్యాపార అవకాశాలు కల్పించటంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

వాయుసేన విన్యాసాలు

డిసెంబర్ 7, 8 తేదీల్లో భారత వాయుసేన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సూర్యకిరణ్, సారంగ్ బృందాలు ఇందులో పాల్గొంటాయి. భారత సైన్యం, నౌకాదళం ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. నౌకాదళ బ్యాండ్ ప్రదర్శన కూడా ఉంటుంది. మూడు రోజుల గ్లోబల్ సమ్మిట్ ముగిసిన తర్వాత కూడా రక్షా ఎక్స్‌పో కొనసాగుతుంది. డిసెంబర్ 10 నుంచి 13 వరకు ప్రజలు, విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లకు ప్రదర్శన సందర్శించే అవకాశం కల్పిస్తారు.

Advertisement
Advertisement