త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND Vs NZ Test | రెండో టెస్టులో భారత్‌కు కష్టాలు.. కివీస్‌ ఆధిక్యం 243 ర‌న్స్‌

IND Vs NZ Test | న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు కష్టాలు తప్పడం లేదు. హ్యాగ్లీ ఓవల్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్‌ పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 110 పరుగులతో కలిపి మొత్తం ఆధిక్యాన్ని 243 పరుగులకు పెంచుకుంది.

P

Sports | Published On Nov 29, 2026, 2.17 pm IST

IND Vs NZ Test | రెండో టెస్టులో భారత్‌కు కష్టాలు.. కివీస్‌ ఆధిక్యం 243 ర‌న్స్‌
Advertisement

IND Vs NZ Test | న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు కష్టాలు తప్పడం లేదు. హ్యాగ్లీ ఓవల్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్‌ పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 110 పరుగులతో కలిపి మొత్తం ఆధిక్యాన్ని 243 పరుగులకు పెంచుకుంది. రచిన్‌ రవీంద్ర (46 బ్యాటింగ్‌), డారిల్‌ మిచెల్‌ (5 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. నాలుగో వికెట్‌కు ఇప్పటికే 40 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 356 పరుగులు చేయగా.. భారత్‌ 246 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ (8), హెన్రీ నికోల్స్‌ (22) వికెట్లను బుమ్రా పడగొట్టాడు. డెవాన్‌ కాన్వే (51) అర్ధసెంచరీతో రాణించినా వాషింగ్టన్‌ సుందర్‌ అతడిని పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం రచిన్‌, మిచెల్‌ క్రీజులో ఉండటంతో కివీస్‌ భారీ లక్ష్యం దిశగా సాగుతోంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో భారత బౌలర్లు త్వరగా వికెట్లు తీస్తేనే మ్యాచ్‌పై ప‌ట్టు సాధించే అవ‌కాశం ఉంటుంది.

ఫాలోఆన్‌ గండం నుంచి గట్టెక్కిన భారత్‌

మూడో రోజు ఆటలో భారత జట్టుకు ధ్రువ్‌ జురెల్‌ అండగా నిలిచాడు. 116/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట కొనసాగించిన భారత్‌.. జురెల్‌ (88) అద్భుత పోరాటంతో 246 పరుగులు చేసింది. దీంతో ఫాలోఆన్‌ ప్రమాదం నుంచి బయటపడింది. సెంచరీకి 12 పరుగుల దూరంలో జురెల్‌ వెనుదిరిగినా.. అతడి ఇన్నింగ్స్‌ జట్టుకు కీలకంగా మారింది. 170 బంతులు ఎదుర్కొన్న అతడు 14 ఫోర్లు బాదాడు. టెయిలెండర్లతో కలిసి జురెల్‌ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఆకాశ్‌ దీప్‌ (29)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 46 పరుగులు జోడించాడు. అనంతరం గుర్నూర్‌ బ్రార్‌ (10)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 64 పరుగులు సాధించాడు. చివర్లో బుమ్రాతో కలిసి పదో వికెట్‌కు 19 పరుగులు జోడించాడు. ఆకాశ్‌ దీప్‌ 52 బంతుల్లో 29 పరుగులు చేయగా.. గుర్నూర్‌ 46 బంతుల్లో 10 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో కైల్‌ జేమీసన్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మాట్‌ హెన్రీ, నాథన్‌ స్మిత్‌, జాకబ్‌ డఫీ రెండేసి వికెట్లు తీశారు.

ఆకాశ్‌ దీప్‌ ఔట్‌.. ప్రసిద్ధ్‌ కృష్ణకు ఛాన్స్‌కు

భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బ్యాటింగ్‌ సమయంలో ఒకే ఓవర్‌లో రెండుసార్లు హెల్మెట్‌కు బంతి తగలడంతో ఆకాశ్‌ దీప్‌ తలకు గాయమైంది. తొలుత జాకబ్‌ డఫీ బౌలింగ్‌లో, ఆ తర్వాత కైల్‌ జేమీసన్‌ బౌలింగ్‌లో బంతి హెల్మెట్‌కు తగిలింది. వైద్య పరీక్షల్లో తలకు గాయమైనట్లు తేలడంతో అతడు మిగిలిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ప్రసిద్ధ్‌ కృష్ణ జట్టులోకి వచ్చాడు. అయితే మహ్మద్‌ సిరాజ్‌కు మాత్రం తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన ఆకాశ్‌ దీప్‌.. బ్యాటింగ్‌లోనూ 29 పరుగులతో కీలకంగా నిలిచాడు. ఇప్పుడు అతడు దూరం కావడం భారత్‌కు నష్టమే. ఇప్పటికే 243 పరుగుల ఆధిక్యంలో ఉన్న న్యూజిలాండ్‌ను త్వరగా ఆలౌట్‌ చేయడం టీమిండియా ముందున్న ప్రధాన సవాల్‌. జురెల్‌ పోరాటంతో ఫాలోఆన్‌ ముప్పు తప్పించుకున్న భారత్‌.. బౌలింగ్‌లోనూ అదే స్థాయి పట్టుదల చూపిస్తుందా? కివీస్‌ ఆధిక్యానికి కళ్లెం వేసి మ్యాచ్‌లోకి తిరిగి వస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement