త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Khelo India Games | ఓరుగల్లు నుంచి పాలమూరు వరకు.. జిల్లాల్లోనూ జాతీయ క్రీడల సందడి

Khelo India Games | వ‌చ్చే నెల 11 నుంచి 22 వ‌ర‌కు జ‌రుగున్న ఖేలో ఇండియా (Khelo India Games) క్రీడల సందడికి తెలంగాణలోని జిల్లాలు కూడా ముస్తాబవుతున్నాయి. హైదరాబాద్‌తో (Hyderabad) పాటు ఐదు జిల్లా కేంద్రాల్లో జాతీయ స్థాయి పోటీలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న‌ది.

G

Telangana | Published On Nov 29, 2026, 11.31 am IST

Khelo India Games | ఓరుగల్లు నుంచి పాలమూరు వరకు.. జిల్లాల్లోనూ జాతీయ క్రీడల సందడి
Advertisement

Khelo India Games | త్రినేత్ర న్యూస్‌: వ‌చ్చే నెల 11 నుంచి 22 వ‌ర‌కు జ‌రుగున్న ఖేలో ఇండియా (Khelo India Games) క్రీడల సందడికి తెలంగాణలోని జిల్లాలు కూడా ముస్తాబవుతున్నాయి. హైదరాబాద్‌తో (Hyderabad) పాటు ఐదు జిల్లా కేంద్రాల్లో జాతీయ స్థాయి పోటీలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న‌ది. హనుమకొండలో అథ్లెటిక్స్‌, ఖమ్మంలో విలువిద్య, కరీంనగర్‌లో జూడో, మహబూబ్‌నగర్‌లో కబడ్డీ, నిజామాబాద్‌లో టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు జరగనున్నాయి. ఇందుకోసం జిల్లాల్లోని స్టేడియాల్లో వసతులను మెరుగుపరిచారు. కొత్త క్రీడా సామగ్రిని సమకూరుస్తున్నారు.

ప్రస్తుత షెడ్యూల్‌ ప్రకారం జిల్లాల్లో తొలుత 13న నిజామాబాద్‌లో పోటీలు మొదలవుతాయి. 17 నుంచి ఖమ్మం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌లలో.. 18 నుంచి హనుమకొండలో పోటీలు జరుగుతాయి. అయిదు జిల్లా కేంద్రాల్లో కలిపి 60 ఈవెంట్లు నిర్వహించనున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే యువ క్రీడాకారుల ప్రతిభను జిల్లాల్లోని అభిమానులు ప్రత్యక్షంగా తిలకించవచ్చు.

ఓరుగల్లులో పరుగుల పండుగ

హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో డిసెంబరు 18 నుంచి 21 వరకు అథ్లెటిక్స్‌ పోటీలు జరుగుతాయి. ఖేలో ఇండియాలో స్విమ్మింగ్‌ తర్వాత అత్యధిక ఈవెంట్లు అథ్లెటిక్స్‌లోనే ఉన్నాయి. రన్నింగ్‌, జంపింగ్‌, త్రోయింగ్‌ విభాగాల్లో మొత్తం 32 ఈవెంట్లున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పోటీల కోసం జేఎన్‌ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఖమ్మంలో విలుకాళ్ల పోరు

ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియం విలువిద్య పోటీలకు ముస్తాబవుతోంది. డిసెంబరు 17 నుంచి 20 వరకు ఆరు ఈవెంట్లు జరుగుతాయి. అక్కడి విశాలమైన పచ్చిక మైదానం విలువిద్య పోటీలకు అనువుగా ఉంది. మైదానం చుట్టూ సింథటిక్‌ రన్నింగ్‌ ట్రాక్‌ కూడా ఉంది. జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు అవసరమైన సామగ్రిని క్రీడా శాఖ సమకూరుస్తోంది. క్రీడా నిపుణులు, పోటీల నిర్వాహకులకు అవసరమైన వసతులను కల్పిస్తోంది.

కరీంనగర్‌లో జూడో

కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ ఇండోర్‌ స్టేడియం జూడో పోటీలకు ముస్తాబవుతోంది. డిసెంబరు 17 నుంచి 20 వరకు 16 ఈవెంట్లు జరుగుతాయి. స్టేడియంలో చెక్క ఫ్లోరింగ్‌పై సింథటిక్‌ మ్యాట్లు, ఎల్‌ఈడీ లైట్లు, ప్రేక్షకుల గ్యాలరీలతో పోటీలకు అవసరమైన వసతులను సిద్ధం చేస్తున్నారు. వివిధ బరువు విభాగాల్లో దేశంలోని యువ జూడో క్రీడాకారులు ఇక్కడ తలపడనున్నారు.

పాలమూరులో కూతకు కూత

తెలంగాణ పల్లెల్లో కబడ్డీకి ఎంతో ఆదరణ ఉంది. ఈ క్రీడలో జాతీయ స్థాయి పోటీలకు పాలమూరు వేదిక కానుంది. మహబూబ్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో డిసెంబరు 17 నుంచి 20 వరకు బాలుర, బాలికల కబడ్డీ పోటీలు జరగనున్నాయి. స్టేడియంలో చెక్క ఫ్లోరింగ్‌పై ప్రత్యేక కబడ్డీ మ్యాట్లను ఏర్పాటు చేస్తున్నారు. రెండు అంతస్తుల్లో ప్రేక్షకుల గ్యాలరీలున్నాయి. స్టేడియానికి కొత్త హంగులు దిద్దుతున్నారు.

నిజామాబాద్‌లో అయిదు రోజులు

నిజామాబాద్‌లోని నవ్యభారతి పాఠశాలలో డిసెంబరు 13 నుంచి 17 వరకు టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు నిర్వహిస్తారు. మొత్తం నాలుగు ఈవెంట్లున్నాయి. అయిదు రోజుల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల యువ క్రీడాకారులు ఇక్కడ తలపడనున్నారు.

హైదరాబాద్‌లో 22 క్రీడల పోటీలు

హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లో 22 క్రీడలకు సంబంధించిన పోటీలు జరుగుతాయి. గచ్చిబౌలి క్రీడా ప్రాంగణంలో బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, హాకీ, స్విమ్మింగ్‌, సాఫ్ట్‌బాల్‌ పోటీలు నిర్వహిస్తారు. ఎల్బీ స్టేడియంలో టెన్నిస్‌, గత్కా, థాంగ్‌–టా పోటీలు జరుగుతాయి. హకీంపేట క్రీడా పాఠశాలలో వెయిట్‌లిఫ్టింగ్‌, ఫెన్సింగ్‌, మల్లఖంబ్‌ పోటీలు నిర్వహిస్తారు. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జిమ్నాస్టిక్స్‌, ఖోఖో.. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో బాస్కెట్‌బాల్‌ పోటీలు జరుగుతాయి. రైల్వే రిక్రియేషన్‌ క్లబ్‌ (RRC) ఇండోర్‌ స్టేడియంలో బాక్సింగ్‌, రెజ్లింగ్‌ పోటీలు నిర్వహిస్తారు. శేరిలింగంపల్లిలోని పీజేఆర్‌ ఇండోర్‌ స్టేడియంలో కలరిపయట్టు, యోగాసన.. అజీజ్‌నగర్‌లోని శ్రీనిధి డెక్కన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌లో ఫుట్‌బాల్‌ పోటీలు జరుగుతాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం, తుక్కుగూడ వద్ద సైక్లింగ్‌ పోటీలు నిర్వహిస్తారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో షూటింగ్‌, హుస్సేన్‌సాగర్‌లో రోయింగ్‌ పోటీలు జరుగుతాయి. వీటితో పాటు హకీంపేటలో కర్రసాము, హుస్సేన్‌సాగర్‌లో సెయిలింగ్‌ ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

ఏర్పాట్లపై సీఎం ప్రత్యేక శ్రద్ధ

జిల్లాల్లో ఖేలో ఇండియా పోటీల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. స్టేడియాల్లో పనులు, క్రీడా సామగ్రి సరఫరా, క్రీడాకారులకు అవసరమైన వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించారు. సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఖేలో ఇండియా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జాతీయ స్థాయి పోటీలకు అనుగుణంగా స్టేడియాలను అభివృద్ధి చేస్తున్నారు. పోటీలు ముగిశాక కూడా ఈ వసతులు స్థానిక క్రీడాకారులకు ఉపయోగపడనున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు, కోచ్‌లు, క్రీడా సంఘాల ప్రతినిధులు జిల్లాలకు రానున్నారు. సొంత జిల్లాల్లోనే జాతీయ స్థాయి పోటీలు జరుగుతుండటంతో స్థానిక క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement
Advertisement