త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | పాలమూరుకు పట్టిన శని కాంగ్రెస్.. మళ్ళీ వలసలు రేవంత్ రెడ్డి వైఫల్యం

Harish Rao | పాలమూరుకు పట్టిన శని కాంగ్రెస్.. మళ్ళీ వలసలు రేవంత్ రెడ్డి వైఫల్యం అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. కర్ణాటక రోడ్డు ప్రమాద బాధిత దళిత కుటుంబాలను పరామర్శించిన హ‌రీశ్‌రావు.. రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Oct 14, 2026, 5.27 pm IST

Harish Rao | పాలమూరుకు పట్టిన శని కాంగ్రెస్.. మళ్ళీ వలసలు రేవంత్ రెడ్డి వైఫల్యం
Advertisement

క‌ర్ణాట‌క రోడ్డు ప్ర‌మాద బాధితుల‌కు
రూ. 10 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించాలి
పాల‌మూరులో 40 ఎస్సీ కుటుంబాలు వ‌ల‌స‌బాట ప‌డితే..
సీఎం రేవంత్ రెడ్డికి సోయి లేదు
ప్ర‌మాదాల పాలై ప్రాణాలు కోల్పోతుంటే..
క‌నీసం మంత్రులూ పరామర్శించిన పాపాన పోలేదు
బాధిత ద‌ళిత కుటుంబానికి
బీఆర్ఎస్ త‌ర‌పున త‌క్ష‌ణ ఆర్థిక సాయం అంద‌జేత‌

Harish Rao | త్రినేత్ర న్యూస్ : పాలమూరుకు పట్టిన శని కాంగ్రెస్.. మళ్ళీ వలసలు రేవంత్ రెడ్డి వైఫల్యం అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. కర్ణాటక రోడ్డు ప్రమాద బాధిత దళిత కుటుంబాలను పరామర్శించిన హ‌రీశ్‌రావు.. రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గ‌ద్వాల జిల్లాలోని ఇందువాసి గ్రామానికి చెందిన దళిత కూలీలు ఏసేపు, నాగన్న కుటుంబాలకు, క్షతగాత్రులకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో పార్టీ తరపున తక్షణ ఆర్థిక సాయం అందజేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు, కాళ్లు చేతులు విరిగి నడుము ఫ్రాక్చర్ అయిన క్షతగాత్రులకు పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

ఈ పర్యటనలో హరీశ్ రావు వెంట మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, స్థానిక సీనియర్ నాయకులు హన్మంతు నాయుడు, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. గద్వాల జిల్లా ఇందువాసి గ్రామంలో దాదాపు 40 దళిత కుటుంబాలు కూలి పనుల కోసం పక్క రాష్ట్రమైన కర్ణాటకకు వెళ్లాయి. అక్కడ యాదగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి ఆస్పత్రిలో విషమంగా ఉంది. చాలామందికి కాళ్లు, చేతులు, నడుములు విరిగి తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ స్పందించి.. తక్షణమే బాధిత కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. కేసీఆర్ ఆదేశంతోనే మేమంతా ఇక్కడికి వచ్చాం. చనిపోయిన కుటుంబాలకు, గాయపడ్డ కుటుంబాలకు పార్టీ పరంగా తక్షణ సహాయం అందజేశాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ దళిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకునేలా తీవ్ర ఒత్తిడి తీసుకొస్తామ‌ని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు

ముఖ్యమంత్రికి సోయి లేకుండా పోయింది

అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే.. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరు. ఈ జిల్లాలోనే పేద ఎస్సీ కుటుంబాలు పక్క రాష్ట్రానికి వలసపోయి ఇంత ఘోర ప్రమాదానికి గురైతే, ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ గానీ, ప్రభుత్వం గానీ కనీసం స్పందించలేదు. ఆ బాధిత కుటుంబాలకు సర్కార్ నుంచి నయాపైసా ఆర్థిక సాయం అందలేదు. సరైన వైద్యం అందక, చేతిలో డబ్బులు లేక ఆస్పత్రుల్లో క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి జిల్లా అంటే బాధ్యత ఉంటుందేమో, పేద కుటుంబాలను ఆదుకుంటారేమో అనుకున్నాం కానీ.. ముఖ్యమంత్రికి సోయి లేకుండా పోయింది. ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా, ఏ ఒక్క మంత్రి కూడా బాధితులను పట్టించుకున్న పాపాన గానీ, ఆదుకున్న పాపాన గానీ పోలేదు. ప్రభుత్వం వెంటనే చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, తీవ్రంగా గాయపడ్డ వారికి ప్రభుత్వం తరఫున మెరుగైన పూర్తి ఉచిత వైద్యం అందిస్తూనే తగిన ఆర్థిక సాయం అందించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామ‌ని మాజీ మంత్రి పేర్కొన్నారు.

పాలమూరుకు పాత వలసల రోజులు తీసుకొచ్చాడు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో పల్లె పల్లె పాలమూరులోన పల్లేర్లు మొలిసెనా అంటూ వలసల వేదనపై పాటలు పాడుకున్న దుస్థితి ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ చూపి నెట్టంపాడు, భీమా, కోయిల్‌సాగర్, కల్వకుర్తి లాంటి పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారు. దాదాపు రూ. 4 వేల కోట్లు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున చెక్ డ్యామ్‌లు నిర్మించి, చెరువులు బాగుచేసి పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఈ ఇందువాసి గ్రామానికి కూడా నెట్టంపాడు నీళ్లను పారించింది బీఆర్ఎస్సే. 24 గంటల కరెంట్, రైతుబంధు ఇచ్చి ఆదుకున్నాం. దాంతో ఇందువాసి గ్రామం పత్తి, పొగాకు, మొక్కజొన్న విత్తన పంటలకు కేరాఫ్ అడ్రస్‌గా మారి, పెద్ద పెద్ద సీడ్ కంపెనీలు ఇక్కడికి వచ్చి రైతులతో ఒప్పందాలు చేసుకున్నాయి. గ్రామస్తులందరికీ పుష్కలంగా ఉపాధి దొరికింది. గతంలో కేటీఆర్ వచ్చినప్పుడు రోడ్డుపై కూలీలను పలకరిస్తే.. మేము కర్ణాటక నుంచి, కర్నూలు నుంచి గద్వాలకు కూలి పనుల కోసం వలస వచ్చామని చెప్పిన పరిస్థితి ఉండేది. పాలమూరు జిల్లా నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాటి రోజులు తెస్తా.. పాత రోజులు తెస్తా అన్నాడు. ఆయన చెప్పినట్లే పాలమూరుకు పాత వలసల రోజులు తీసుకొచ్చాడు. సాగునీరు రాక, కరెంట్ లేక, చేతినిండా కూలి దొరకక మళ్లీ వలసలు మొదలయ్యాయి. ఈ గ్రామంలో ఎవరిని కదిలించినా కరెంట్ రావడం లేదని, కరెంట్ పరిస్థితి ఘోరంగా మారిందని లబోదిబోమంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేదని, ఇప్పుడు కనీసం 6-7 గంటల కరెంట్ కూడా సక్రమంగా ఇవ్వడం లేదని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు అని హ‌రీశ్‌రావు తెలిపారు.

సార్, రేవంత్ రెడ్డిని గట్టిగా నిలదీయండి..

మేం ఇక్కడికి వస్తుంటే మార్గమధ్యంలో మల్దకల్, అయిజలో రైతులు మా కారును ఆపి.. సార్, రేవంత్ రెడ్డిని గట్టిగా నిలదీయండి.. నేను రైతును, ఎనిమిది ఎకరాల్లో పంట వేస్తే కరెంట్ రాక నిలువునా ఎండిపోతోంది అని ఎంతో ఆవేదనతో మొరపెట్టుకున్నారు. ఈ ప్రభుత్వం విద్యుత్ సరఫరాలో పూర్తిగా విఫలమైంది. ఆనాడు కేసీఆర్ పాలనలో బొంబాయి, దుబాయ్ పోయిన పాలమూరు బిడ్డలు తిరిగి సొంత గ్రామాలకు వచ్చి గౌరవంగా వ్యవసాయం చేసుకుని బతికారు. కానీ కాంగ్రెస్ పాలన రాగానే మళ్లీ వలసలు ప్రారంభమయ్యాయి. సీఎం సొంత జిల్లాలోని ఈ గ్రామం నుంచి 40 దళిత కుటుంబాలు పొట్టచేతపట్టుకుని కర్ణాటకకు వలసపోయే దుస్థితి వచ్చిందంటే రేవంత్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నీ పాలనలో నీ జిల్లాలోని వలసకూలీలకు కూడా నువ్వు న్యాయం చేయలేకపోయావు. కేసీఆర్ వలసపోయినోళ్లను వాపస్ తెస్తే, నువ్వు మాత్రం పాలమూరు బిడ్డలను మళ్లీ వలసల పాలు చేశావు. దీనికి ముమ్మాటికీ కరెంట్ ఇవ్వకపోవడం, నీళ్లు ఇవ్వకపోవడమే కారణం. నెట్టంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టుల్లో 24 గంటలు నడపాల్సిన మోటార్లను 8-9 గంటలే నడిపి నీళ్లు ఎత్తకపోవడం వల్ల చివరి ఆయకట్టుకు నీళ్లందక పంటలు ఎండిపోయి జనం వలసబాట పట్టారు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

శాశ్వతంగా రాత్రి కరెంటును ఎగ్గొట్టే కుట్ర

నిన్న రేవంత్ రెడ్డి సర్కార్ తెచ్చిన జీవో నెంబర్ 17.. రైతులకు 24 గంటల ఉచిత కరెంటుకు వేసిన ఉరితాడు! సోలార్ విద్యుత్ పేరుతో రైతులకు పగటిపూట కేవలం 6-7 గంటల కరెంటుకే పరిమితం చేస్తూ శాశ్వతంగా రాత్రి కరెంటును ఎగ్గొట్టే కుట్ర. బడ్జెట్లో పెట్టి బల్లలు చరిచిన వ్యవసాయ కూలీల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏటా ఇచ్చే రూ. 12,000 ఎందుకు ఇవ్వలేదు? ఆ డబ్బులు ఇచ్చుంటే ఈ దళిత బిడ్డలు వలసపోయి ప్రాణాలు కోల్పోయేవారా? బడా కాంట్రాక్టర్ల బిల్లులకు, ఫ్యూచర్ సిటీకి, మూసీకి, ఢిల్లీకి కప్పం కట్టడానికి వేల కోట్లుంటాయి కానీ.. దళిత, గిరిజన, బలహీన వర్గాల కూలీలకు రూ. 12,000 ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదా? అని నిల‌దీశారు.

కృష్ణా ట్రిబ్యునల్ వాదనల్లో ఘోర వైఫల్యం..

రేవంత్ రెడ్డి పాలమూరు పులి కాదు.. పాలమూరు పిల్లి! కొడంగల్‌లో రైతులకు బేడీలు వేసి, మక్తల్‌లో పంట కాపాడుకునేందుకు నీళ్లు అడిగిన 14 మంది రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడమేనా సొంత జిల్లాకు రేవంత్ ఇచ్చిన బహుమానం? కృష్ణా ట్రిబ్యునల్ వాదనల్లో ఘోర వైఫల్యం.. తాత్కాలిక వాటా 34 శాతం నీటిని కూడా పంట పొలాలకు మళ్లించలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు.

Advertisement
Advertisement