త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ఆరు నెల‌లు మొబైల్‌ను దూరం పెట్టండి.. అప్పుడే ఉద్యోగం సాధ్యం

Harish Rao | పోలీసు ఉద్యోగాల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థులు ఆరు నెల‌ల పాటు మొబైల్ ఫోన్ల‌కు దూరంగా ఉంటేనే ఉద్యోగం సాధ్య‌మ‌వుతుంద‌ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. ఉద్యోగం వ‌చ్చేదాక ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు దూరంగా ఉండాల‌న్నారు. హ‌రీశ‌న్న ఉద్యోగం వ‌చ్చింద‌ని మీరు నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ప్పుడే ఈ కోచింగ్‌కు సార్థ‌క‌త ఉంటుంద‌న్నారు.

S

Telangana | Published On Sep 27, 2026, 3.33 pm IST

Harish Rao | ఆరు నెల‌లు మొబైల్‌ను దూరం పెట్టండి.. అప్పుడే ఉద్యోగం సాధ్యం
Advertisement

ఉద్యోగం వచ్చేదాకా స్మార్ట్ ఫోన్లను, సోషల్ మీడియాను పక్కనపెట్టాలి.
ఇన్‌స్టాగ్రామ్.. రీల్స్‌కు దూరంగా ఉండండి
కష్టపడితేనే ఫలితం.. ఉచితం అనగానే నిర్లక్ష్యం చేయొద్దు
కానిస్టేబుల్ అభ్యర్థులకు మాజీ మంత్రి హ‌రీశ్‌రావు మార్గనిర్దేశం

Harish Rao | త్రినేత్ర న్యూస్ : పోలీసు ఉద్యోగాల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థులు ఆరు నెల‌ల పాటు మొబైల్ ఫోన్ల‌కు దూరంగా ఉంటేనే ఉద్యోగం సాధ్య‌మ‌వుతుంద‌ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. ఉద్యోగం వ‌చ్చేదాక ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు దూరంగా ఉండాల‌న్నారు. హ‌రీశ‌న్న ఉద్యోగం వ‌చ్చింద‌ని మీరు నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ప్పుడే ఈ కోచింగ్‌కు సార్థ‌క‌త ఉంటుంద‌న్నారు. పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న సిద్దిపేట నిరుద్యోగ యువతకు అండగా ఉండేందుకు హ‌రీశ్‌రావు ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉద్యోగావకాశాలు కోల్పోకూడదనే సదుద్దేశంతో సొంత ఖర్చులతో సిద్దిపేటలో "కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్"ను ఏర్పాటు చేశారు. సుమారు 370 మంది అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్‌తో పాటు మధ్యాహ్న భోజన వసతిని కూడా ఆయన కల్పిస్తున్నారు. ఈ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం, అభ్యర్థుల్లో స్ఫూర్తి నింపుతూ హరీశ్ రావు కీలక మార్గనిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. మీకు నవంబర్ 29 వరకు కేవలం ఉద్యోగం మాత్రమే కనిపించాలి. అర్జునుడికి పక్షి కన్ను ఎలా కనిపించిందో మీ లక్ష్యం మీకు అలా స్పష్టంగా ఉండాలి. దీన్ని 'ఉచిత కోచింగ్' అని పిలవడం మానేయండి. ఉచితం అనగానే నిర్లక్ష్యం వస్తుంది, సీరియస్‌నెస్‌ పోతుంది. పేద విద్యార్థులు ఇబ్బంది పడకూడదని మీరు కట్టాల్సిన ఫీజును నేనే కడుతున్నాను. కాబట్టి డబ్బులు కట్టి చదువుతున్నామనే పట్టుదలతో ఉండండి. తెలంగాణ సాధించిన కేసీఆర్ పేరు మీద ఈ సెంటర్ పెట్టాను. కేసీఆర్ అంటేనే పట్టుదలకు మారుపేరు. ఆ పట్టుదలతోనే ఎవరూ రాదన్న తెలంగాణను సాధించారు. ఆయన స్ఫూర్తితోనే మీరు కూడా పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలి అని హ‌రీశ్‌రావు సూచించారు.

మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇచ్చింది కేసీఆరే

నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం. కాళేశ్వరంతో సిద్దిపేటకు నీళ్లు వచ్చాయి. నిధులతో సిద్దిపేట జిల్లాగా మారి, మెడికల్ కాలేజీ, కలెక్టరేట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లాంటివి వచ్చాయి. ఇక ఉద్యోగాల విషయానికొస్తే.. కేసీఆర్ రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేశారు. గతంలో 60-40 విధానం ఉండేది, ఆంధ్రా వాళ్లు కూడా ఇక్కడ ఉద్యోగాలు కొట్టేవారు. పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది కేసీఆరే. అందుకే ఈరోజు ఇంత మంది ఆడబిడ్డలు ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు. 370 మందిని సెలెక్ట్ చేస్తే అందులో అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు.

9 గంట‌ల‌క‌ల్లా క్లాసులో ఉండాలి..

కానిస్టేబుల్ ఉద్యోగానికి చదువుతో పాటు దేహదారుఢ్యం కూడా అవసరం. అలాగే మిగతా ఉద్యోగాలతో పోలిస్తే ఇందులో సమాజానికి రక్షణగా నిలబడే సామాజిక బాధ్యత ఉంటుంది. కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు 10:30, 11 గంటలకు వస్తున్నారు. రేపటి నుంచి ఉదయం 9 గంటలకల్లా క్లాసులో ఉండాలి. సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు జరుగుతాయి. ఏ ఒక్క క్లాస్ మిస్సయినా నష్టపోతారు. దయచేసి ఈ ఆరు నెలలు మొబైల్ ఫోన్లు ఆఫ్ చేయండి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, రీల్స్ చేస్తామంటే ఇక్కడికి రాకండి. ఆరు నెలలు కష్టపడితే మీ జీవితం బాగుపడుతుంది, మీ అమ్మానాన్నలు తలెత్తుకుని తిరుగుతారు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

25 వేలు ఖాళీ ఉంటే.. 7 వేల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చారు..

కేసీఆర్ పదేళ్ల పాలనలో 19 వేలు, 12 వేలు, 10 వేలు ఇలా మూడు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి 40 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసింది. నేను అసెంబ్లీలో నిలదీస్తే 16 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని వాళ్లే ఒప్పుకున్నారు. పోలీసు శాఖలో 25 వేల కానిస్టేబుల్ ఖాళీలు ఉంటే కేవలం 7 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. నిరుద్యోగులు దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లో రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తే కానీ ఆ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఖాళీలు లేక కాదు, ఇద్దామన్న మనసు లేకనే మోసం చేశారు. ఈ కోచింగ్ కేవలం కానిస్టేబుల్ పోస్టులకే కాదు, జాతీయ స్థాయిలో వచ్చే సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ తదితర కేంద్ర ఉద్యోగాలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంద‌ని హ‌రీశ్‌రావు తెలిపారు.

న‌వంబ‌ర్ 29.. మీ జీవితాల్లో కూడా మలుపు తిప్పాలి

నవంబర్ 29న మీకు తొలి పరీక్ష ఉంది. ఆ రోజు 'దీక్షా దివస్'. కేసీఆర్ దీక్షకు కూర్చుని తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజే, మీ జీవితాన్ని కూడా మలుపు తిప్పాలి. ఆ తర్వాత డిసెంబర్ 28న మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి నా సొంత ఖర్చులతో హైస్కూల్ గ్రౌండ్ లో పీటీల ద్వారా ఫిజికల్ టెస్ట్ కోచింగ్ ఇప్పిస్తాను. ఆ తర్వాత ఫైనల్ ఎగ్జామ్ కి కూడా నేనే ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తాను.

సిల్లీ రీజ‌న్స్‌తో డుమ్మా కొడితే తీసేస్తాం..

క్లాసులో చెప్పింది ఎప్పటికప్పుడు చదువుకునేలా ప్రతిరోజూ డైలీ టెస్ట్, అలాగే వీక్లీ గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తాం. అటెండెన్స్ కచ్చితంగా ఉండాలి. సిల్లీ రీజన్స్ తో డుమ్మా కొడితే తీసేసి, సీరియస్ గా ఉన్న వేరే వాళ్లకు అవకాశం ఇస్తాం. గత 12 ఏళ్లుగా నేను ఇప్పిస్తున్న కోచింగ్ ద్వారా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, టెట్ సహా ఎంతో మంది పేద పిల్లలు ఉద్యోగాలు సాధించి, నా దగ్గరకు స్వీట్ బాక్స్ తీసుకొని రావడం నాకు అత్యంత సంతృప్తినిచ్చే విషయం. మీరంతా కూడా రేపు అలా ఉద్యోగాలు సాధించి రావాలి. బంగారం కంటే సమయం చాలా విలువైంది. సమయం వృధా చేయకండి. మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పట్టుదలతో చదివి పోలీస్ కొలువు సాధించండి.

Advertisement
Advertisement