త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NEET UG | నీట్ రీ-ఎగ్జామ్‌.. మ‌ధ్యాహ్నం 1.30 గంట వ‌ర‌కే ఎగ్జామ్ హాల్‌లోకి అనుమ‌తి..

NEET UG | దేశ‌వ్యాప్తంగా నీట్ యూజీ రీ-ఎగ్జామ్ (NEET UG) నిర్వ‌హించ‌నున్నారు. ఆదివారం మ‌ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంట‌ల వరకు ప‌రీక్ష జ‌రుగ‌నుంది.

G

Telangana | Published On Jun 20, 2026, 11.03 am IST

NEET UG | నీట్ రీ-ఎగ్జామ్‌.. మ‌ధ్యాహ్నం 1.30 గంట వ‌ర‌కే ఎగ్జామ్ హాల్‌లోకి అనుమ‌తి..
Advertisement

NEET UG | త్రినేత్ర‌.న్యూస్‌: దేశ‌వ్యాప్తంగా నీట్ యూజీ రీ-ఎగ్జామ్ (NEET UG) నిర్వ‌హించ‌నున్నారు. ఆదివారం మ‌ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంట‌ల వరకు ప‌రీక్ష జ‌రుగ‌నుంది. పెన్ అండ్ పేప‌ర్ విధానంలో ఈ ప‌రీక్షను నిర్వ‌హించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అభ్య‌ర్థుల‌కు కీల‌క అప్‌డేట్ ఇచ్చింది. మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల వ‌ర‌కే విద్యార్థుల‌ను ప‌రీక్ష హాల్‌లోకి అనుమ‌తిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ ప్ర‌క్రియ ఉద‌యం 11 గంట‌ల నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌ని వెల్ల‌డించింది. మధ్యాహ్నం 1.30 దాటిన తర్వాత పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేయనున్నారు. అందువ‌ల్ల అభ్య‌ర్థులు ముందుగానే ప‌రీక్ష కేంద్రానికి చేరుకోవాల‌ని సూచించింది.

మే 3న నీట్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అయితే పేప‌ర్ లీక్ ఆరోప‌ణ‌లు రావ‌డంతో ప‌రీక్ష‌ను ఎన్‌టీఏ ర‌ద్దు చేసింది. జూన్ 21న రీ-ఎగ్జామ్ (NEET UG Re Exam) నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎలాంటి పొర‌పాట్లు జ‌రుగ‌కుండా శ‌నివారం మాక్ డ్రిల్ కూడా నిర్వ‌హిస్తున్న‌ది. ఆదివారం నిర్వ‌హించ‌నున్న ఈ ప‌రీక్ష‌కు దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది అభ్యర్థులు ఎగ్జామ్​ రాయనున్నారు. దీనికోసం 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో ప‌రీక్ష‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2 లక్షలకుపైగా సిబ్బందిని వినియోగిస్తున్నారు. లీకేజీలు, అవకతవకలకు తావులేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సీసీటీవీ నిఘా, జీపీఎస్ వాహనాలు, ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు. సాంకేతిక సమస్యల వల్ల బయోమెట్రిక్ కాకపోయినా.. హామీ పత్రం, మాన్యువల్ వెరిఫికేషన్ ద్వారా అనుమతివ్వాలని స్ప‌ష్టం చేసింది.

ఎయిర్‌ఫోర్స్ విమానాలు, హెలికాప్ట‌ర్ల‌లో ప‌శ్నా పత్రాలు..

లీక్ వంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా ఎన్‌టీఏ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ది. ఇందులో భాగంగా పరీక్ష పత్రాల తరలింపున‌కు వైమానిక దళ విమానాలు, హెలికాప్టర్లను ఉప‌యోగించనుంది. గత అనుభవాల నేప‌థ్యంలో వైమానిక దళ సాయం తీసుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి శ‌నివారం మాక్ డ్రిల్ నిర్వ‌హించ‌నున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మాక్ డ్రిల్ జరగనుంది. విద్యార్థుల‌కు కూడా ప‌లు సూచ‌న‌లు చేసింది.

విద్యార్థుల‌కు సూచనలు..

  • పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థులు తమ మత విశ్వాసాలకు సంబంధించిన దుస్తులు లేదా చిహ్నాలను ధరించాలనుకుంటే ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకుని అధికారులకు తెలియజేయాలి.
  • వర్షాకాలం కావడంతో అడ్మిట్ కార్డు, గుర్తింపు కార్డు, ఫోటోగ్రాఫ్, అవసరమైన అండర్‌టేకింగ్ పత్రాలను పారదర్శక ప్లాస్టిక్ సంచిలో తీసుకువెళ్లవచ్చు.
  • విద్యార్థులు లేత రంగు దుస్తులు ధరించాలి. ఫుల్ హ్యాండ్స్ దుస్తులకు బదులుగా హాఫ్ హ్యాండ్స్ దుస్తులు ధరించాలి.
  • హైహీల్స్, బూట్లు వంటి పాదరక్షలకు బదులుగా సాధారణ చెప్పులు ధరించాలి.
  • పరీక్షా కేంద్రానికి పారదర్శక నీటి సీసా మాత్రమే తీసుకురావడానికి అనుమతి ఉంది.
  • ఓఎంఆర్ షీట్లను పూరించేందుకు అవసరమైన పెన్నులను పరీక్షా కేంద్రంలోనే అందజేస్తారు.
  • మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్‌ఫోన్లు సహా అన్ని రకాల కమ్యూనికేషన్ పరికరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయి.
  • పెద్ద బటన్లు ఉన్న దుస్తులు, భారీ బకిల్స్ ఉన్న బెల్టులు, లోహ వస్తువులు, బరువైన ఆభరణాలు ధరించి రాకూడదు.
  • మే 3న నిర్వహించిన నీట్ పరీక్ష అడ్మిట్ కార్డులు కాకుండా, రీ-ఎగ్జామ్ కోసం విడుదల చేసిన కొత్త హాల్‌టికెట్లను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలి.
Advertisement
Advertisement