త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tirupati Rao | రెండున్న‌రేండ్లు గ‌డిచినా.. ఒక్క హామీ నెర‌వేర్చ‌ని కాంగ్రెస్ స‌ర్కార్‌: తిరుప‌తి రావు

Tirupati Rao | ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల‌తోపాటు ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో కాంగ్రెస్ స‌ర్కార్ విఫ‌ల‌మైంద‌ని ఉద్యోగ సంఘాల నేత తిరుప‌తి రావు (Tirupati Rao) విమర్శించారు.

G

Telangana | Published On Aug 28, 2026, 10.29 am IST

Tirupati Rao | రెండున్న‌రేండ్లు గ‌డిచినా.. ఒక్క హామీ నెర‌వేర్చ‌ని కాంగ్రెస్ స‌ర్కార్‌: తిరుప‌తి రావు
Advertisement

Tirupati Rao | త్రినేత్ర‌.న్యూస్‌: ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల‌తోపాటు ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో కాంగ్రెస్ స‌ర్కార్ విఫ‌ల‌మైంద‌ని ఉద్యోగ సంఘాల నేత తిరుప‌తి రావు (Tirupati Rao) విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు 2023 ఎన్నిక‌ల‌ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింద‌ని చెప్పారు. ప్రతి నెల ఒకటో తారీఖున‌ జీతాలు మినహా ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమ‌ర్శించారు. అప్పుడు పెండింగ్‌లో ఉన్న మూడు డీఏ బకాయిలను తక్షణమే చెల్లిస్తాం అని హామీ ఇచ్చింది, అయితే దానిని నెర‌వేర్చ‌క‌పోవ‌గా.. పెండింగ్ డీఏల సంఖ్య ప్ర‌స్తుతం ఆరుకు చేరింద‌ని వెల్ల‌డించారు.

`సీపీఎస్ (CPS)ను రద్దు చేసి పాత పెన్ష‌న్ ప‌థ‌కాన్ని (OPS)ను అమలు చేస్తాం అని చెప్పింది. కనీసం 2003లో అపాయింట్ అయిన వారికి కూడా అమలు చేయలేక పోయింద‌న్నారు. ఉద్యోగులకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. కొత్త PRC ఏర్పాటు చేసి, దాని సిఫారసులను 6 నెలల్లో అమలు చేస్తామ‌ని హామీ ఇచ్చింది. ఇప్పటికి రెండున్నర ఏండ్లు గడిచిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆర్టీసీ సిబ్బందిని కూడా తదుపరి పీఆర్‌సీలో చేర్చుతామని హామీ ఇచ్చింది. జీఓ 317ను సమీక్షించి, దాని వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తాం అని పేర్కొంది. ఇప్పటికీ అతీగతీ లేదు. పైగా ఇచ్చిన డిప్యుటేషన్లను కూడా రద్దు చేసింది.

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికీ హెల్త్ కార్డులు (Health Cards) ఇచ్చి, ప్రధాన వ్యాధులకు సూపర్ స్పెషాలిటీ హాస్పిట‌ళ్ల‌లో చికిత్స అందించే విధానం తీసుకువస్తాం అని ఆశ కల్పించింది. ఉద్యోగుల జీతంలో ఇప్పటికే 3 నెలల నుంచి 1.5 శాతం జీతం కట్ చేస్తున్నది. అందులో ఓపీ విధానం లేదు. అదే పాత పద్ధతి. ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు, ఐకేపీ, న‌రేగా (MGNREGA) ఉద్యోగుల వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తాం అని హామీ ఇచ్చింది. వారికి కూడా మొండి చేయి చూపింది. ఇవే కాకుండా ఉద్యోగ నియామకాలకు సంబంధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని చెప్పింది. కానీ నెరవేర్చలేకపోయింది` అని తిరుప‌తి రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement