త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బ‌ర్త‌ర‌ఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత‌ లేఖ‌

MLA Maheshwar Reddy | తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ సాగిస్తున్న 'సెక్షన్ 22-A' భూ దోపిడీని ఎండగడుతూ ఎంపీ రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి బ‌హిరంగ లేఖ రాశారు.

S

Telangana | Published On Aug 26, 2026, 9.07 pm IST

MLA Maheshwar Reddy | రెవెన్యూ మంత్రి పొంగులేటిని బ‌ర్త‌ర‌ఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత‌ లేఖ‌
Advertisement

MLA Maheshwar Reddy | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ సాగిస్తున్న 'సెక్షన్ 22-A' భూ దోపిడీని ఎండగడుతూ ఎంపీ రాహుల్ గాంధీకి బీజేఎల్పీ నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి బ‌హిరంగ లేఖ రాశారు. అవినీతికి పాల్పడుతున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేసి, ఈ మహా కుంభకోణంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

లేఖ సారాంశం ఇదే..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత జాతీయ కాంగ్రెస్ సాగిస్తున్న అరాచక పాలనలో ప్రజలపై జరుగుతున్న తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘనను, వ్యవస్థాగతంగా సాగుతున్న భూ దోపిడీ దందాను మీ దృష్టికి తీసుకురావడానికి ఈ లేఖ రాస్తున్నాను. మీరు దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని చేత పట్టుకుని, ప్రజాస్వామ్య విలువలు, నిజాయితీ, పారదర్శకతలకు మీరే అసలైన రాజ్యగాన్ని కాపాడుతున్న వ్యక్తులుగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని వాస్తవ పరిస్థితులు మీ ద్వంద్వ వైఖరినీ ప్రజల కళ్ళకు కట్టినట్లు బట్టబయలు చేస్తున్నాయి. తెలంగాణలో మీ పార్టీ కనుసన్నల్లోనే లక్షలాది మంది ప్రజల రాజ్యాంగ హక్కులు కాలరాయబడుతున్నాయి, చట్టబద్ధ హక్కులు కలిగిన భూ యజమానులను వేధింపులకు గురిచేసి వారిని దీపిడీ చేస్తున్నారు, అలాగే రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగాన్ని రాజకీయ నిధుల సమీకరణకు వేదికగా మార్చేశారు.

రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 300-A, చట్టబద్ధమైన అధికారం ద్వారా తప్ప ఏ వ్యక్తి ఆస్తిని కూడా హరించరాదని స్పష్టంగా నిర్దేశిస్తుంది. అయినప్పటికీ, 1908 రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-Aను ఒక ఆయుధంగా ఉపయోగించడం ద్వారా, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన పట్టాదారులైనా, చిన్న, సన్నకారుకారు రైతులు వారితో పాటు మధ్యతరగతి కుటుంబాల హక్కులను కలుస్తుంది. ఈ 22A సెక్షన్ అనేది చట్టబద్ధమైన ప్రభుత్వ, సామాజిక ఆస్తులను పరిరక్షించడానికి ఉద్దేశించినది, ప్రభుత్వం ఈ సెక్షన్ ను దోపిడీకీ అవసరమైన ఒక సాధనంగా మార్చి వాడుకుంటుంది. చట్టబద్ధమైన భూ యజమానుల భూములు అకస్మాత్తుగా రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో చేర్చబడ్డాయి.

లక్షలకు లక్షలు లంచాలు

ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోలేక ఆసుపత్రి పాలైనా, పిల్లల చదువులకైనా, ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలన్నా సొంత భూమి అమ్ముకోలేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని అధికారుల చుట్టూ సామాన్యులను తిప్పుకుంటూ జరుగుతున్న వ్యవస్థాగత అవినీతికి పాల్పడుతూ, మా భూమిని మాకు ఇవ్వడానికి లక్షలకు లక్షలు లంచాలు చెల్లించవలసి వస్తుంది.

ప్ర‌భుత్వ నిర్బంధంలోకి పౌరుల ఆస్తి హ‌క్కులు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం, తన హయాంలో, ధరణి పోర్టల్ మరియు TLRUPలను ఒక ఆయుధంగా ఉపయోగించుకుని, సెక్షన్ 22-ఏను దుర్వినియోగం చేసి ప్రజలను వేధించడం, బ్లాక్మెయిల్ చేయడం, దోచుకోవడం వంటివి చేసింది. మీ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా ఈ దోపిడీ యంత్రాంగాన్ని నిర్మూలించడానికి బదులుగా, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అదే దోపిడీ విధానాన్ని మరింత విస్తరించి, తీవ్రతరం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భూ భారతి నిర్వహించిన ఇన్వెంటరీ ఆడిట్ ఫలితంగా, రాష్ట్రవ్యాప్త భూభారతి ఇన్వెంటరీ ఆడిట్ పేరుతో వ్యవసాయ, అసైన్డ్, కన్వర్టెడ్ భూములతో కలిపి నిషేధిత ప్రైవేట్ భూముల విస్తీర్ణం కొన్ని లక్షల ఎకరాలకు చేరింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం నిషేధిత భూముల విస్తీర్ణం అక్షరాలా 1.00 నుండి 1.05 కోట్ల ఎకరాలకు చేరుకుంది. తద్వారా తెలంగాణ పౌరుల ఆస్తి హక్కులను ప్రభుత్వం తన నిర్బంధంలోకి తీసుకుంది.

వేల కోట్ల రూపాయాల ఆర్థిక లావాదేవీలు

ఈ సంక్షోభం పరిపాలనాపరమైన పొరపాటు కాదు, పూర్తిగా పథకం ప్రకారం సాగుతున్న వ్యాపార దందా. మీ పార్టీకే చెందిన సీనియర్ క్యాబినెట్ మంత్రి, రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోనే దాదాపు 42,000 ఎకరాలను ఏకపక్షంగా, అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చడాన్ని బహిరంగంగా ఎత్తిచూపి ఈ కుట్రను బయటపెట్టారు. అంతేకాకుండా ఫీనిక్స్ గ్రూప్ అలాగే రెవెన్యూ మంత్రి కుటుంబానికి సంబంధించిన కార్పొరేట్ సంస్థలైన రాఘవ కన్స్ట్రక్షన్తో ముడిపడి ఉన్న వేల కోట్ల రూపాయల భారీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బలమైన ఆధారాలున్నాయి.

ఆ మంత్రి మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మౌనం

ఉద్దేశపూర్వకంగా సెక్షన్ 22-A కింద భూములను కావాలని నిషేధిత భూముల జాబితాలో చేర్చడం, తర్వాత డీ-నోటిఫికేషన్ల ద్వారా నెలకు వేల కోట్ల రూపాయలను సృష్టించే వ్యవస్థాగత వసూళ్ల దందా నడుస్తోందని, అందులోంచి నెలకు రూ.200 కోట్ల వరకు కాంగ్రెస్ అధిష్టానానికి నిధులుగా చేరుతున్నాయని తీవ్రమైన ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. షెల్ కంపెనీలు, అక్రమ భూ లావాదేవీలకు సంబంధించిన పత్రాలతో ఆగస్టు 20, 2026న అసెంబ్లీ ప్రాంగణంలోనే బహిరంగ చర్చకు రావాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నేను నేరుగా సవాలు విసిరినప్పుడు, ఆయన తన శాఖ చర్యలపై వివరణ ఇవ్వలేక పారిపోయారు. ఫీనిక్స్ గ్రూప్కు సంబంధించిన ఒక్క కేసులోనే వేల కోట్ల రూపాయలు ఉంటే, మొత్తం అవినీతి ఏ స్థాయిలో ఉందో ఊహించడం కూడా కష్టమే. ఈ ఆరోపణలపై కేవలం ఆ మంత్రి మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మౌనం వహిస్తోంది.

సిట్టింగ్ హైకోర్టు జ‌డ్జితో జ్యుడిషీయ‌ల్ విచార‌ణ జ‌రిపించాలి

రాజ్యాంగ నైతికతపై ప్రసంగాలు ఇవ్వడం సులభం, కానీ మీ సొంత మంత్రులు ఆ సిద్ధాంతాలను ఉల్లంఘించినప్పుడు వారిని జవాబుదారీగా నిలబెట్టడంలోనే నిజమైన నాయకత్వం దాగివుంటుంది. సెక్షన్ 22-A జాబితాలలో తప్పులు జరిగాయని రెవెన్యూ మంత్రి బహిరంగంగా అంగీకరించారు, అయినా ఈ సంక్షోభంపై మీ మౌనం, చూస్తుంటే మీరు మాట్లాడే ప్రసంగాలు జాతీయ టెలివిజన్ కోసం రూపొందించిన ఒక రాజకీయ ముసుగు కోసమేనని స్పష్టమవుతోంది. రాజ్యాంగం పట్ల, రాజకీయ జవాబుదారీతనం పట్ల మీకున్న నిబద్ధతకు వాస్తవాధారాలు ఉన్నట్లయితే, నిష్పక్షపాత విచారణ జరిగేలా చూడటానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుండి తొలగించమని మీరు తక్షణమే తెలంగాణ ముఖ్యమంత్రిని ఆదేశించాలి. అంతేకాకుండా, ధరణి డిజిటలైజేషన్ ఆడిట్ నివేదికను బహిరంగంగా విడుదల చేయడంతో పాటు, 2014 నుండి నేటి వరకు సెక్షన్ 22-A కింద సర్వే నంబర్ల వారీగా చేసిన అన్ని చేర్పులు, తొలగింపులు, మార్పులను వివరిస్తూ ఒక అధికారిక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే, ఆర్థిక లావాదేవీలు మరియు క్విడ్ ప్రో కో వ్యవహారాలపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో జ్యడీషియల్ విచారణ జరిపించాలని, చట్టబద్ధమైన ప్రైవేట్ పట్టా భూములన్నింటినీ నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి షరతులు లేని, కాలవ్యవధితో కూడిన ఒక నిర్దిష్ట అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాను.

తెలంగాణ ప్రజలు ఈ విధ్వంసకర భూ దోపిడీ వసూళ్లకు ముగింపు పలకాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మీ పార్టీ చర్యలపై స్పష్టమైన, నిస్సందేహమైన సమాధానాన్ని ఆశిస్తున్నారని ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement