త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ

Irrigation Projects | రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం–పునర్నిర్మాణం (ఆర్‌అండ్‌ఆర్‌), అటవీ అనుమతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

S

Telangana | Published On Aug 25, 2026, 9.13 pm IST

Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
Advertisement
  • భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌, అటవీ అనుమతులకు నిధుల కొరత రానివ్వం
  • అవసరమైన నిధులు తక్షణమే ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం
  • పీడీ ఖాతాల్లో డబ్బులు ఉండటం కాదు..
  • భూములు కోల్పోయిన రైతుల చేతికి పరిహారం చేరాలి
  • నెల నుంచి నెలన్నరలో పెండింగ్ ప్రక్రియలను కొలిక్కి తేవాలి
  • ప్రతిరోజూ భూసేకరణ పురోగతిని సమీక్షించాలి
  • కలెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లు సమన్వయంతో యుద్ధప్రాతిపదికన పనిచేయాలి
  • నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

Irrigation Projects | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం–పునర్నిర్మాణం (ఆర్‌అండ్‌ఆర్‌), అటవీ అనుమతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ అవసరాల కోసం దాదాపు రూ.6 వేల కోట్లు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

మంగళవారం జిల్లా కలెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లు, నీటిపారుదల, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌, అటవీ అనుమతులు, పరిహారం చెల్లింపులు, పెండింగ్ ప్రక్రియలపై సమగ్రంగా సమీక్షించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం ఈ అంశాలపై ప్రత్యేకంగా సమీక్షించారని, నిధుల కొరత కారణంగా రాష్ట్రంలోని ఏ సాగునీటి ప్రాజెక్టు పనులూ నిలిచిపోకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి తెలిపారు.

“సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌, అటవీ సమస్యల పరిష్కారానికి ఎంత నిధులు అవసరమైనా ప్రభుత్వం తక్షణమే సమకూర్చేందుకు సిద్ధంగా ఉంది. అధికారులు ప్రక్రియను పూర్తి చేసి టోకెన్లు సమర్పించండి. నిధులు సమకూర్చే బాధ్యత మాపై వదిలేయండి” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌, అటవీ సంబంధిత అవసరాలకు దాదాపు రూ.6 వేల కోట్లు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే తొలి విడతలో సుమారు రూ.1,056 కోట్లు, అనంతరం మరో రూ.1,500 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు.

నెలన్నరలో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి

భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌, అటవీ సంబంధిత పెండింగ్ ప్రక్రియలను రాబోయే నెల నుంచి నెలన్నర వ్యవధిలో గణనీయంగా పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. అవసరమైన ప్రతిపాదనలు, అవార్డులు, టోకెన్ల ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరగకుండా కలెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు. “మీరు ప్రక్రియ పూర్తి చేయండి... టోకెన్లు సమర్పించండి. డబ్బులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది. నిధుల కారణంగా ఒక్క పని కూడా ఆగకూడదు” అని మంత్రి స్పష్టం చేశారు.

పీడీ ఖాతాలో కాదు... రైతు ఖాతాలో పడితేనే ఫలితం

ప్రభుత్వం నిధులు విడుదల చేసి జిల్లా ఖాతాలకు పంపించడంతోనే బాధ్యత పూర్తయినట్లు భావించరాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. “డబ్బులు కలెక్టర్ పీడీ ఖాతాలోనో, మరో ప్రభుత్వ ఖాతాలోనో ఉండిపోతే నిధులు విడుదల చేసిన ప్రయోజనం ఏముంటుంది? భూమి కోల్పోయిన రైతు, నిర్వాసిత కుటుంబం చేతికి పరిహారం చేరినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లు” అని స్పష్టం చేశారు. జిల్లా, భూసేకరణ కార్యాలయాలకు చేరిన నిధులను అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు వెంటనే బదిలీ చేయాలని ఆదేశించారు. భూసేకరణలో ప్రభుత్వ విజయాన్ని ఖాతాల్లో ఉన్న నిధులతో కాకుండా భూములు కోల్పోయిన వారికి వాస్తవంగా అందిన పరిహారంతోనే కొలుస్తామని స్పష్టం చేశారు. రాబోయే మూడేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం దాదాపు 40 వేల ఎకరాల భూసేకరణ అవసరమవుతుందని, ఇందుకు సుమారు రూ.6,150 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే రూ.1,000 కోట్లకు పైగా నిధులు వివిధ భూసేకరణ కార్యాలయాలు, జిల్లా ఖాతాల్లో వివిధ దశల్లో ఉండి పంపిణీ కావాల్సి ఉందని సమీక్షలో వెల్లడైంది.

రోజూ కొన్ని నిమిషాలు భూసేకరణకే కేటాయించండి

ప్రతి జిల్లా కలెక్టర్ రోజూ కొన్ని నిమిషాలు భూసేకరణ పురోగతిని వ్యక్తిగతంగా సమీక్షించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు, భూసేకరణ అధికారులు, నీటిపారుదల ఇంజినీర్ల మధ్య తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. చీఫ్ ఇంజినీర్లు కూడా తమ బాధ్యతను కేవలం సాంకేతిక అంశాలకే పరిమితం చేసుకోకుండా, భూసేకరణ నుంచి ఆర్‌అండ్‌ఆర్‌, అటవీ అనుమతుల వరకు ప్రతి అంశంలో చొరవ చూపాలని సూచించారు. అవార్డులు పూర్తయిన వెంటనే మ్యూటేషన్‌, ఎన్‌కంబ్రెన్సుల తొలగింపు, సేకరించిన భూమిని అధికారికంగా నీటిపారుదల శాఖకు అప్పగించడం వంటి ప్రక్రియలను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను ఆదేశించారు.

గౌరవెల్లిపై వారం రోజుల్లో ప్రత్యేక సమీక్ష

గౌరవెల్లి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం నిధులు అందించినప్పటికీ క్షేత్రస్థాయిలో కొన్ని ప్రక్రియలు ఆలస్యమవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. సంబంధిత కలెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లు సంయుక్తంగా సమావేశమై పెగ్ మార్కింగ్‌, భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌, న్యాయపరమైన సమస్యలు, నిర్మాణం, కాలువ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. గౌరవెల్లి ప్రాజెక్టుపై వారం రోజుల తర్వాత ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు.

బస్వాపూర్‌లో 5 టీఎంసీల నిల్వపై అధ్యయనం

బస్వాపూర్ రిజర్వాయర్‌లో 5 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు పరిమిత అదనపు పనులతో అవకాశం ఉందా అన్న అంశాన్ని అధికారులు పరిశీలించాలని మంత్రి సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదించి సాంకేతిక, ఆర్థిక అంశాలపై సమన్వయ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌, అటవీ అనుమతులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో తాను, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ. శ్రీధర్ కలెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లకు నేరుగా అందుబాటులో ఉంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ప్రజాప్రతినిధుల వినతులకు తప్పనిసరిగా స్పందించాలి

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమర్పించే వినతులను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో స్పందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఏదైనా ప్రతిపాదనను ఆమోదించడం సాధ్యం కాకపోయినా, అందుకు గల కారణాలను సంబంధిత ప్రజాప్రతినిధికి స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన వినతులపై నెలకు రెండుసార్లు సమీక్ష నిర్వహించి, తీసుకున్న చర్యలను తెలియజేయాలని ఆదేశించారు. పూర్తయిన భూసేకరణ వివరాలు, కొత్తగా సమర్పించిన టోకెన్ల సమాచారాన్ని ప్రతిరోజూ కార్యదర్శి కార్యాలయానికి పంపించాలని, తద్వారా వాటిని సమీకరించి ఆర్థిక శాఖ స్థాయిలో తదుపరి చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.

వారం, పది రోజుల్లో మరో సమగ్ర సమీక్ష

భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌, అటవీ అనుమతుల పురోగతిపై వారం నుంచి పది రోజుల్లో మరో సమగ్ర సమీక్ష నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనే అవకాశం ఉందన్నారు. “ప్రభుత్వం నిధులను సిద్ధంగా ఉంచింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌, అటవీ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇదొక మంచి అవకాశం. ప్రతి శాఖ చిత్తశుద్ధితో, సమన్వయంతో, యుద్ధప్రాతిపదికన పనిచేయాలి. చివరికి ప్రతి రూపాయి భూమి కోల్పోయిన రైతు చేతికి చేరాలి. అప్పుడే సాగునీటి ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతాయి” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement