త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DOST Admissions | మొబైల్ యాప్‌తోనే ‘దోస్త్’ అడ్మిష‌న్‌.. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇలా..

DOST Admissions | ఇటీవ‌ల విడుద‌లైన ఇంట‌ర్ ఫ‌లితాల్లో( Inter Results ) మీరు పాస‌య్యారా..? బీఏ( BA ), బీకామ్( B.Com ), బీఎస్సీ( BSc ) వంటి కోర్సులు చేయాల‌నుకుంటున్నారా..? ఇంకేముంది.. డిగ్రీ కోర్సుల్లో( Degree Courses ) 2026-27 విద్యాసంవ‌త్స‌రానికి ప్ర‌వేశం పొందేందుకు తెలంగాణ రాష్ట్ర ఉన్న‌త విద్యా మండ‌లి దోస్త్ నోటిఫికేష‌న్‌( Dost Notification )ను విడుద‌ల చేసింది. ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న దోస్త్ ద‌ర‌ఖాస్తుల( Dost Application ) స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

S

Telangana | Published On Apr 14, 2026, 6.24 pm IST

DOST Admissions | మొబైల్ యాప్‌తోనే ‘దోస్త్’ అడ్మిష‌న్‌.. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇలా..
Advertisement

మూడు విడ‌త‌ల్లో డిగ్రీ సీట్ల భ‌ర్తీ
అందుబాటులో 4,40,107 సీట్లు
దోస్త్ మొబైల్ యాప్ ద్వారానే రిజిస్ట్రేష‌న్ ఐడీ
కుల‌, ఆదాయ ధృవీక‌ర‌ణ ప‌త్రాలు త‌ప్ప‌నిస‌రి
ఏప్రిల్ 15 నుంచి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

DOST Admissions | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని అండ‌ర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 2026-27 విద్యాసంవ‌త్స‌రానికి ప్ర‌వేశాల నిమిత్తం దోస్త్ నోటిఫికేష‌న్( Dost Notification ) విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 15వ తేదీ నుంచి దోస్త్ ద‌ర‌ఖాస్తుల( Dost Application ) ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. ఇంట‌ర్ పాసై, డిగ్రీ చ‌ద‌వాల‌నుకునే విద్యార్థులంద‌రూ దోస్త్ ద్వారా డిగ్రీ కోర్సుల్లో( Degree Courses ) ప్ర‌వేశం పొందొచ్చు.

రాష్ట్రంలోని తొమ్మిది యూనివ‌ర్సిటీల‌తో పాటు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా మ‌రియు శిక్ష‌ణ మండలి అందించే బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీఎస్‌డ‌బ్ల్యూ, డీ ఫార్మ‌సీ కోర్సుల్లో ప్ర‌వేశం పొందొచ్చు. మొత్తం 1000 కాలేజీల్లో 200ల‌కు పైగా యూజీ కోర్సులు ఉన్నాయి. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 4 ల‌క్ష‌ల మందికి పైగా విద్యార్థులు డిగ్రీ కాలేజీల్లో ప్ర‌వేశం పొందేందుకు అవ‌కాశం ఉంది.

ఎవ‌రి స‌హాయం లేకుండానే..

దోస్త్ ద్వారా డిగ్రీ కాలేజీల్లో ప్ర‌వేశాలు పొందాల‌నుకునే విద్యార్థులెవ‌రూ కూడా ఇత‌రుల‌పై ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌వేశ ప్ర‌క్రియ సుల‌భంగా, విద్యార్థుల‌కు అనుకూలంగా రూపొందించారు. విద్యార్థులు ఎవ‌రి స‌హాయం లేకుండానే స్వ‌యంగా త‌మ డిగ్రీ అడ్మిష‌న్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేసుకోవ‌చ్చు.

మొబైల్ యాప్ ద్వారా దోస్త్ ఐడీ

ఇంట‌ర్ పాసైన విద్యార్థులు మొద‌ట‌గా క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేష‌న్ ద్వారా దోస్త్ ఐడీ పొందాలి. ఈ దోస్త్ ఐడీని స్మార్ట్‌ఫోన్ ద్వారానే పొందొచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో దోస్త్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత విద్యార్థి లేదా వారి పేరెంట్స్ మొబైల్ నంబ‌ర్‌తో రిజిస్ట్రర్ చేసుకోవాలి. ఓటీపీ రాగానే ఎంట‌ర్ చేసి స‌బ్‌మిట్ చేయాలి. అనంత‌రం దోస్త్ అథెంటికేష‌న్ ద్వారా స‌రైన వివ‌రాలు న‌మోదు చేసిన వెంట‌నే.. ఫేస్ రిక్న‌గైజేష‌న్ స‌ర్వీస్ అందుబాటులోకి వ‌స్తుంది. విద్యార్థి లైవ్ ఫొటో వ్య‌వ‌స్థ‌లోని రికార్డుతో స‌రిపోలితే.. వెంట‌నే దోస్త్ ఐడీ క్రియేట్ అవుతుంది.

మీసేవ‌లో ఫీజు చెల్లింపు

మొబైల్ యాప్‌లో విద్యార్థి బ‌యోమెట్రిక్ అథెంటికేష‌న్ పూర్త‌యిన త‌ర్వాత దోస్త్‌లో ప్ర‌వేశం కోసం మీ సేవా కేంద్రాన్ని సంద‌ర్శించాలి. రూ. 200 చెల్లించి రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. త‌ద‌నంత‌రం దోస్త్ ఐడీ, పిన్ జ‌న‌రేట్ అవుతాయి. ఈ పిన్ నంబ‌ర్‌ను ప్ర‌వేశ ప్ర‌క్రియ ముగిసే వ‌ర‌కు భ‌ద్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే.. దోస్త్ ఐడీ, పిన్ నంబ‌ర్‌ను ఉప‌యోగించి.. త‌దుప‌రి ద‌శ‌ల కోసం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇలా..

విద్యార్థులు త‌మ దోస్త్ ఐడీ, పిన్ ఉప‌యోగించి ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు కోసం లాగిన్ అవ్వాలి. ద‌ర‌ఖాస్తులో అన్ని వివ‌రాల‌ను న‌మోదు చేయాలి. ఒక‌సారి డేటా స‌బ్‌మిట్ చేసిన త‌ర్వాత‌.. దాన్ని మార్చ‌డానికి వీల్లేదు. ఇక ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్త‌యిన త‌ర్వాత వెబ్ ఆప్ష‌న్లు న‌మోదు చేసుకోవాలి. త‌మ‌కు ఇష్ట‌మైన కోర్సులు, క‌ళాశాల‌ల‌ను ఎంపిక చేసుకుని, ప్రాధాన్య‌తా క్ర‌మంలో నంబ‌ర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాధాన్య‌త నంబ‌ర్ ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. స‌ద‌రు విద్యార్థి త‌న‌కు న‌చ్చిన కాలేజీలో, కోర్సులో అడ్మిష‌న్ వ‌స్తే.. వెంట‌నే ఆన్‌లైన్లో సీటు క‌న్ఫ‌ర్మేష‌న్ చేసుకుని ఫీజు చెల్లించాలి. ఆ త‌ర్వాత‌ నేరుగా కాలేజీకి వెళ్లి రిపోర్టింగ్ చేయాలి. తొలి విడుత‌లో కేటాయించిన కాలేజీ లేదా సీటుతో అసంతృప్తి ఉంటే.. రెండు, మూడు విడ‌త‌ల కౌన్సెలింగ్‌కు కూడా హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది.

ఫీజు :

మొద‌టి విడ‌త‌కు రూ. 200, రెండో విడ‌త నుంచి కొత్త‌గా రిజిస్ట్రేష‌న్ చేసుకునే వారికి రూ. 400.

కుల‌, ఆదాయ ధృవీక‌ర‌ణ ప‌త్రాలు త‌ప్ప‌నిస‌రి

దోస్త్ ద్వారా ప్ర‌వేశం పొందాలనుకునే విద్యార్థులు కుల‌, ఆదాయ ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను త‌ప్ప‌నిస‌రిగా క‌లిగి ఉండాలి. కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంత‌రం జారీ చేయ‌బ‌డి ఉండాలి. ఆదాయ ధృవీక‌ర‌ణ ప‌త్రం అయితే 2025 ఏప్రిల్ 1 త‌ర్వాత జారీ చేయ‌బ‌డి ఉండాలి. అప్పుడే 2026-27 విద్యాసంవ‌త్స‌రానికి చెల్లుబాటు అవుతుంది.

అందుబాటులో 4,40,107 సీట్లు..

దోస్త్‌ కౌన్సిలింగ్‌తో మొత్తం 969 కాలేజీల్లో 4,40,107 సీట్లు భర్తీ చేయనున్నారు. వీటిలో 119 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 49,530 సీట్లు, 34 ప్రభుత్వ (అటానమస్‌) కాలేజీల్లో 39,480 సీట్లు, 635 ప్రైవేటు కాలేజీల్లో 2,62,770 సీట్లు, 26 ప్రైవేటు ఎయిడెడ్‌ కాలేజీల్లో 10,920 సీట్లు, ఆరు వర్సిటీ కాలేజీల్లో 3,540 సీట్లు ఉన్నాయి. అలాగే 29 బీసీ సంక్షేమ గురుకులాల్లో 9,914 సీట్లు, 28 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 8,080 సీట్లు, 22 గిరిజన సంక్షేమ గురుకులాల్లో 5,620 సీట్లు భర్తీ చేయనున్నారు. 60 మైనార్టీ కాలేజీల్లో 38,586 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

దోస్త్ మూడు విడతల కౌన్సెలింగ్ షెడ్యూలు..

తొలి విడత రిజిస్ట్రేషన్లు - ఏప్రిల్ 15 నుంచి మే 7
వెబ్ ఆప్షన్లు - ఏప్రిల్ 30 నుంచి మే 8
సీట్ల కేటాయింపు - మే 14
ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ - మే 15 నుంచి 23 వ‌ర‌కు

రెండో విడత రిజిస్ట్రేషన్లు - మే 15 నుంచి మే 25
వెబ్ ఆప్షన్లు - మే 15 నుంచి మే 26
సీట్ల కేటాయింపు - మే 30
ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ - మే 31 నుంచి జూన్ 5 వరకు

మూడో విడత రిజిస్ట్రేషన్లు - మే 31 నుంచి జూన్ 15
వెబ్ ఆప్షన్లు - మే 31 నుంచి జూన్ 16
సీట్ల కేటాయింపు - జూన్ 20
ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ - జూన్ 20 నుంచి జూన్ 25 వరకు

యూనివ‌ర్సిటీలు ఇవే..

ఉస్మానియా యూనివ‌ర్సిటీ
కాక‌తీయ యూనివ‌ర్సిటీ
తెలంగాణ యూనివ‌ర్సిటీ
పాల‌మూరు యూనివ‌ర్సిటీ
మహాత్మాగాంధీ యూనివ‌ర్సిటీ
శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీ
చాక‌లి ఐల‌మ్మ మ‌హిళా యూనివ‌ర్సిటీ
జేఎన్‌టీయూ హైద‌రాబాద్
డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ ఎర్త్ యూనివ‌ర్సిటీ
తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్ష‌ణ మండ‌లి(TSBTET)

దోస్త్ అధికారిక వెబ్‌సైట్ dost.cgg.gov.in
హెల్ప్ లైన్ డెస్కు నంబ‌ర్ 040- 23120416

Advertisement
Advertisement