త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Contract Lecturers | నల్ల బ్యాడ్జీలతో రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీలలో కాంట్రాక్టు అధ్యాపకుల నిరసన

Contract Lecturers | గత ఎన్నో సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలలో బోధన, పరిశోధన రంగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు ( కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు) ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యారు. తమను రెగ్యులరైజేషన్ లేదా విలీనం చేసిన తర్వాతనే కొత్త రిక్రూట్‌మెంట్ యూనివర్సిటీలలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 12 యూనివర్సిటీలలో విధులకు హాజరవుతూనే నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

S

Telangana | Published On Nov 25, 2026, 7.16 pm IST

Contract Lecturers | నల్ల బ్యాడ్జీలతో రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీలలో కాంట్రాక్టు అధ్యాపకుల నిరసన
Advertisement

రెగ్యులరైజేషన్/ విలీనం కోసం అన్ని యూనివర్సిటీలలో ఉద్యమ కార్యాచరణ
వెంటనే ఉద్యోగ భద్రతతో కూడిన 7వ యూజీసీ పే స్కేల్స్‌కు డిమాండ్

Contract Lecturers | త్రినేత్ర న్యూస్ : గత ఎన్నో సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలలో బోధన, పరిశోధన రంగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు ( కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు) ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యారు. తమను రెగ్యులరైజేషన్ లేదా విలీనం చేసిన తర్వాతనే కొత్త రిక్రూట్‌మెంట్ యూనివర్సిటీలలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 12 యూనివర్సిటీలలో విధులకు హాజరవుతూనే నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యమ కార్యాచరణలో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మా గాంధీ, త్రిపుల్ ఐటీ బాసర, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలలో కాంట్రాక్టు అధ్యాపకులు విధులకు హాజరవుతూనే నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.

కాగా, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బుధవారం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించిన "యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్- కాంట్రాక్ట్ "- తెలంగాణ స్టేట్( UTA- C-TG) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఏ. పరశురాం, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ డి ధర్మతేజలు మాట్లాడుతూ.. యూజీసీ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలతో యూనివర్సిటీలలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు పాఠాలు బోధించడంతోపాటు పరిశోధన ప్రాజెక్టులు విద్యార్థులు పూర్తిచేసేలా వారికి మార్గదర్శకులుగా కూడా పనిచేస్తున్నామని వివరించారు. అంతే కాకుండా తాము పేటెంట్స్ సాధించడంతోపాటు రీసెర్చ్ ఆర్టికల్స్‌ను ఉత్తమ రీసెర్చ్ జర్నల్స్‌లలో ప్రచురిస్తూ జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో సైటేషన్స్ కలిగి ఉన్నామని చెప్పారు. ఎగ్జామ్ పేపరు ఇన్విజిలేషన్ మొదలుకొని పేపర్ సెట్టింగ్, మాడ‌రేష‌న్ వరకు తాము పరీక్షలకు సంబంధించిన విధులు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే ఎన్ఎస్ఎస్, ఎన్ సీసీ ప్రోగ్రాం ఆఫీసర్లుగా మొదలైన అదనపు బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల కాంట్రిబ్యూషన్ తోనే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు నడుస్తున్నాయని వివరించారు.

ఇటీవల తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ కూడా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను యూనివర్సిటీలలో విలీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిందని గుర్తు చేశారు. పంజాబ్, అస్సాం, రాజస్థాన్ రాష్ట్రాలలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఆ రాష్ట్ర ప్రభుత్వాలు యూనివర్సిటీలలో విలీనం చేస్తూ రెగ్యులర్ అధ్యాపకులుగా మార్చారని వివరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజేషన్ లేదా విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ జయశ్రీ, డాక్టర్ కవిత, డాక్టర్ కృష్ణయ్య, డాక్టర్ మోడెం రవి, డాక్టర్ మీనా, డాక్టర్ శ్రీ దుర్గా, డాక్టర్ మహేందర్, డాక్టర్ కృష్ణారెడ్డి, డాక్టర్ పరమేశ్వర్లు, డాక్టర్ భాస్కర్, డాక్టర్ శంషుద్దీన్, డాక్టర్ మక్ధూమ్, డాక్టర్ అజయ్, డాక్టర్ పరంధాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement