త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vakiti Srihari | పాలమూరు ప్రజలను మరోసారి మోసం చేయొద్దు: మంత్రి వాకిటి శ్రీహరి

Vakiti Srihari | పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కర్ణాటకలోని (Karnataka) గూడూరు ప్రాంతాన్ని సందర్శించి `కర్ణాటకలో నీళ్లు- తెలంగాణలో బీళ్లు` అంటూ చేస్తున్న ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయమే తప్ప, పాలమూరు రైతుల ప్రయోజనాల కోసం కాదని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) విమర్శించారు.

G

Telangana | Published On Jul 27, 2026, 10.57 am IST

Vakiti Srihari | పాలమూరు ప్రజలను మరోసారి మోసం చేయొద్దు: మంత్రి వాకిటి శ్రీహరి
Advertisement

Vakiti Srihari | త్రినేత్ర‌.న్యూస్‌: పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కర్ణాటకలోని (Karnataka) గూడూరు ప్రాంతాన్ని సందర్శించి `కర్ణాటకలో నీళ్లు- తెలంగాణలో బీళ్లు` అంటూ చేస్తున్న ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయమే తప్ప, పాలమూరు రైతుల ప్రయోజనాల కోసం కాదని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) విమర్శించారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందని చెప్పుకునే వారు, బీఆర్ఎస్ (BRS) తొమ్మిదిన్నరేండ్ల‌ పాలనలో కర్ణాటకలో ఆనకట్టలు నిర్మించినప్పుడు ఒక్కసారి కూడా వెళ్లి ప్రశ్నించలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిప‌డ్డారు.

రైతుల ప్రయోజనాలను నిర్ల‌క్ష్యం చేసిన గ‌త‌ ప్ర‌భుత్వం

జూరాల ప్రాజెక్టు పరిధిలోని రైతుల ప్రయోజనాలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ధ్వ‌జ‌మెత్తారు. భీమా, కృష్ణా నదులపై బ్యారేజ్-కమ్-బ్రిడ్జిల నిర్మాణం ద్వారా నీటిని నిల్వ చేసి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలనే ఆలోచన కూడా గత ప్రభుత్వానికి రాలేదని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్న‌దని, కర్ణాటక ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ కృష్ణా, భీమా నదులపై బ్యారేజ్-కమ్-బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌లు (Detailed Project Reports) సిద్ధం చేశామని మంత్రి తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కర్ణాటక సాగునీటి శాఖ మంత్రులతో కలిసి హెలికాప్టర్ ద్వారా ప్రతిపాదిత ప్రాంతాలను పరిశీలించి, సాంకేతికంగా సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు. జూరాల (Jurala Project) ముంపు గ్రామాలైన భూత్పూర్, నేడుగం, అనుగొండ, అంకెనపల్లి, దాదంపల్లి గ్రామాల అభివృద్ధిని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. దశాబ్దకాలంగా ముంపు గ్రామాల ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, తగిన నిధులు కూడా విడుదల చేయలేదన్నారు. ప్రస్తుతం ఆ గ్రామాల అభివృద్ధి, పునరావాసం, భూత్పూర్ డ్యాం విస్తరణ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు.

గ‌మ‌నిస్తున్న‌ రైతులు, యువత

పాలమూరు ప్రజల (Palamuru) భవిష్యత్తు కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే, ప్లకార్డులు పట్టుకుని రాజకీయ డ్రామాలు చేయడం వల్ల ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. రైతులు, యువత అన్ని విషయాలు గమనిస్తున్నారని, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు విరమించుకోవాలని మాజీ ప్రజాప్రతినిధులకు సూచించారు. `మంచి చేయలేకపోయినా కనీసం చెడు చేయకండి. ప్రజలను మోసం చేసే రాజకీయాలు మానుకోండి. పాలమూరు రైతుల ప్రయోజనాల కోసం మా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్న‌ద‌ని` స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement