త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Facebook | ఫేస్‌బుక్‌లో కొత్త వెరిఫికేషన్.. ఇక ఫేక్‌ ఖాతాలకు చెక్..

Facebook | సోషల్ మీడియా వేదికల్లో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఖాతాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, నిజమైన వ్యక్తుల ఖాతాలను గుర్తించడం వినియోగదారులకు కష్టంగా మారుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా మెటా సంస్థ ఫేస్‌బుక్‌లో కొత్త ఫేస్‌బుక్ వెరిఫైడ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది.

S

Technology | Published On Jul 27, 2026, 10.50 am IST

Facebook | ఫేస్‌బుక్‌లో కొత్త వెరిఫికేషన్.. ఇక ఫేక్‌ ఖాతాలకు చెక్..
Advertisement

Facebook | సోషల్ మీడియా వేదికల్లో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఖాతాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, నిజమైన వ్యక్తుల ఖాతాలను గుర్తించడం వినియోగదారులకు కష్టంగా మారుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా మెటా సంస్థ ఫేస్‌బుక్‌లో కొత్త ఫేస్‌బుక్ వెరిఫైడ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఏఐ సహాయంతో నకిలీ ప్రొఫైళ్లు, సందేశాలు, కంటెంట్ సులభంగా సృష్టించగలిగే పరిస్థితుల్లో, ఒక ప్రొఫైల్ వెనుక నిజమైన వ్యక్తి ఉన్నారని వినియోగదారులు సులభంగా గుర్తించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. ఫేస్‌బుక్ అందిస్తున్న ఈ వెరిఫికేషన్ సేవ పూర్తిగా ఉచితమే. ఇందులో వినియోగదారులు ఒక వీడియో సెల్ఫీ సమర్పించాల్సి ఉంటుంది. ఆ వీడియోను ఇప్పటికే ప్రొఫైల్‌లో ఉన్న ఫోటోలతో సరిపోల్చి వ్యక్తి నిజమైనవారేనా అనే విషయాన్ని నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియ సాధారణంగా కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుంది. వెరిఫికేషన్ విజయవంతమైన తర్వాత వినియోగదారుడి ప్రొఫైల్‌పై ప్రత్యేక వెరిఫైడ్ బ్యాడ్జ్ (టిక్ మార్క్) కనిపిస్తుంది.

అన్ని విభాగాల్లోనూ వెరిఫైడ్ సింబ‌ల్‌..

ఈ వెరిఫైడ్ గుర్తు కేవలం ప్రొఫైల్‌కే పరిమితం కాకుండా, ఫేస్‌బుక్ డేటింగ్, మార్కెట్‌ప్లేస్, గ్రూప్స్, ప్రొఫైల్ టు స్టార్ట్ వంటి పలు విభాగాల్లో కూడా క‌నిపిస్తుందని మెటా వెల్లడించింది. దీంతో ఇతర వినియోగదారులు ఆ ఖాతా నిజమైన వ్యక్తిదేనని మరింత సులభంగా గుర్తించగలుగుతారు. అయితే ఈ వెరిఫికేషన్ పొందాలంటే మెటా నిర్దేశించిన ట్రస్ట్ అండ్ సేఫ్టీ ప్రమాణాలను ఖాతా తప్పనిసరిగా పాటించాలి. అలాగే ఈ ఫీచర్ ప్రస్తుతం 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అర్హత కలిగిన ఫేస్‌బుక్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కొత్త ఫీచర్‌ను మెటా దశలవారీగా విడుదల చేస్తోంది. తొలుత ఎంపిక చేసిన కొన్ని మార్కెట్లలో అందుబాటులోకి తీసుకువచ్చి, తరువాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రణాళిక ఉందని కంపెనీ తెలిపింది.

నిజ‌మైన వ్య‌క్తి అని స్ప‌ష్ట‌మైన సంకేతం..

ఈ ఫీచర్ గురించి మెటా స్పందిస్తూ ఫేస్‌బుక్ వెరిఫైడ్ బ్యాడ్జ్ అంటే ఆ ప్రొఫైల్ నిజమైన వ్యక్తిదేనని సూచిస్తుంద‌ని తెలిపింది. సెల్ఫీ వెరిఫికేషన్ పూర్తి చేసి, త‌మ‌ ట్రస్ట్ అండ్ సేఫ్టీ ప్రమాణాలను పాటించిన వారికి మాత్రమే ఈ గుర్తు లభిస్తుంద‌ని వెల్ల‌డించింది. మార్కెట్‌ప్లేస్‌లో కొనుగోలు లేదా విక్రయం చేసే ముందు, డేటింగ్‌లో స్పందించే ముందు లేదా సంభాషణ ప్రారంభించే ముందు, ఎదుటి వ్యక్తి నిజమైనవారేనని తెలియజేసే స్పష్టమైన సంకేతంగా ఇది పనిచేస్తుంద‌ని పేర్కొంది.

Advertisement
Advertisement