త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Green India Challenge | మడ అడవుల్లో మరో 10వేల మొక్కలు.. సుందర్బన్స్‌కు అండగా గ్రీన్ ఇండియా చాలెంజ్

Green India Challenge | పచ్చటి వనాలతోనే భవిష్యత్తు తరాలు సురక్షితంగా ఉంటాయన్న స్ఫూర్తితో సాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ (Green India Challenge) మరోసారి మడ అడవులకు (Mada Adavulu) రక్షణగా నిలిచింది.

G

Telangana | Published On Jul 27, 2026, 10.30 am IST

Green India Challenge | మడ అడవుల్లో మరో 10వేల మొక్కలు.. సుందర్బన్స్‌కు అండగా గ్రీన్ ఇండియా చాలెంజ్
Advertisement
  • సంరక్షకులుగా మారిన టైగర్ విడోస్
  • సహకారం అందించిన మ్యాంగ్రోవ్ ఆర్మీ

Green India Challenge | త్రినేత్ర‌.న్యూస్‌: పచ్చటి వనాలతోనే భవిష్యత్తు తరాలు సురక్షితంగా ఉంటాయన్న స్ఫూర్తితో సాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ (Green India Challenge) మరోసారి మడ అడవులకు (Mada Adavulu) రక్షణగా నిలిచింది. పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బ‌న్ డెల్టా (Sundarbans Forest) ప్రాంతంలో ఆరు నెలల క్రితం 20వేల మొక్కలు నాటి సంరక్షించిన ఈ బృందం మ్యాంగ్రోవ్ (మడ అడవులు) డే సందర్భంగా జూలై 26న మరో 10వేల మొక్కలను నాటింది. ప్రపంచంలోనే అతి పెద్ద అడవుల సమూహానికి రక్షణగా నిలుస్తున్నది.

4 రెట్ల కార్బన్‌ను గ్రహిస్తాయి

సుందర్బ‌న్‌ అడవులు ప్రపంచంలోనే అతి పెద్ద మడ అడవుల సమూహం. ఇవి బంగాళాఖాతంలో గంగ, బ్రహ్మపుత్ర, మేఘ్నా నదుల డెల్టా ప్రాంతంలో పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య విస్తరించి ఉన్నాయి. ఈ మడ అడవులు..తీరానికి గొప్ప రక్షణ కలిగిస్తున్నాయి. తుఫాన్ల నుంచి తీరాన్ని కాపాడడం, అలల తీవ్రతను అడ్డుకోవడం, జీవ వైవిధ్యాన్ని కాపాడడంతో ఈ మడ అడవుల పాత్ర మరవలేనిది. సాధారణ అడవులతో పోలిస్తే అ మడ అడవులు 4 రెట్ల కార్బన్ ను గ్రహించి పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి. సముద్ర మత్స్య సంపదకు, రాయల్ బెంగాల్ టైగర్‌లకు సుందర్‌బన్స్ ప్రధాన నివాస కేంద్రం.అందుకే ఈ ప్రాంతాన్ని యునెస్కో... ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింది.

నాటి బాధితులే.. నేటి సంరక్షకులు

మ్యాంగ్రోవ్ డే సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ 9వ విడత లో భాగంగా సుందర్ బన్స్ అడవుల్లో సాగిన 10వేల మడ అడవులను నాటే కార్యక్రమం వినూత్నంగా సాగింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మార్గదర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ బృహత్తర ఉద్యమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ ప్రాంతంలో రాయల్ బెంగార్ టైగర్స్ దాడిలో భర్తలను కోల్పోయిన 500 మంది మహిళలు ఈ మడ అడవుల కోసం ముందుకు వచ్చి వారే సంరక్షకులుగా మారారు. 'మ్యాంగ్రోవ్ మ్యాన్ ఆఫ్ సుందర్‌బన్స్'గా గుర్తింపు పొందిన ఉమాశంకర్ మండల్ నేతృత్వంలోని మ్యాంగ్రోవ్ ఆర్మీ, ఇగ్నైటింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధి శ్రీ కృష్ణా తేజా రెడ్డి బృందం సంయుక్తంగా ఈ హరిత హారంలో పాల్గొన్నారు.

'ఈ అడవిలో అనేక కారణాలతో సర్వస్వం కోల్పోయిన మహిళలే ఈ రోజు దీనిని పునర్నిర్మించే రక్షకులుగా మారారు. ఇది కేవలం సేవ మాత్రమే కాదు.. ప్రకృతికి చేసే న్యాయం. నేడు నాటిన ప్రతి ఒక్క మొక్క మడ అడవులకు ఒక రక్షణ వలయంలా పనిచేస్తుంది' అని ఈ సందర్భంగా సంతోష్ కుమార్ (Santhosh Kumar) అభిప్రాయపడ్డారు.

మహారాష్ట్ర నుంచి బెంగాల్ దాకా 100 కోట్ల మొక్కలు

పర్యావరణ పరిరక్షణను తమ బాధ్యతగా భావించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ బృందం తెలంగాణ సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  (KCR) పుట్టిన రోజైన ఫిబ్రవరి 17 (2026)న సుందర్‌బన్ లో 20 వేల మొక్కలు నాటి వాటికి జియో ట్యాగ్ కూడా చేసింది. 2018లో తెలంగాణ హరితహారంతో ప్రేరణ పొంది ప్రారంభమైన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’, ఇప్పటివరకు 44 మిలియన్ల మంది పౌరుల భాగస్వామ్యంతో శరవేగంగా విస్తరిస్తోంది.

`మూడు మొక్కలు నాటడం- మూడేళ్లు కాపాడటం- మరో ముగ్గురికి నామినేట్ చేయడం` అనే సూత్రంతో సాగుతున్న ఈ ఉద్యమం, గోదావరి పరివాహక ప్రాంతాల నుండి బెంగాల్ తీరప్రాంతం వరకు విస్తరించింది.భారతరత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం (APJ Abdul Kalam) శతాబ్ది జయంతి రోజైన 2031 అక్టోబర్ 15 నాటికి 100 కోట్ల మొక్కలు నాటాలనే ఆశయంతో ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముందుకు సాగుతున్నది.

Advertisement
Advertisement