Bhatti Vikramarka | మూడేళ్లలో ప్రజల ఖాతాల్లో రూ. 1,64,431 కోట్లు జమ..
Bhatti Vikramarka | రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందని కుటుంబం లేదని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క( Bhatti Vikramarka ) స్పష్టం చేశారు. గత మూడేళ్లలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.1,64,431 కోట్లను నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేశామని వెల్లడించారు.
ఈ లెక్కలపై ఎలాంటి చర్చకైనా, సవాల్‌కైనా సిద్ధం
ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి
రహదారుల నిర్మాణానికి రూ.90 వేల కోట్లు..
జిల్లా వనరుల ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలు
అచ్చంపేటను ప్రధాన జంక్షన్‌గా తీర్చిదిద్దుతాం
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటన
Bhatti Vikramarka | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందని కుటుంబం లేదని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క( Bhatti Vikramarka ) స్పష్టం చేశారు. గత మూడేళ్లలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.1,64,431 కోట్లను నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేశామని వెల్లడించారు. ఈ లెక్కలపై ఎవరితోనైనా చర్చించేందుకు, ఎలాంటి సవాల్‌నైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రతి రూపాయిని వారి అభివృద్ధి, సంక్షేమం కోసమే ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
అచ్చంపేట నియోజకవర్గంలో 74.82 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మన్ననూరులో 220/33 కెవి సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసిన అనంతరం పక్కనే ఏర్పాటుచేసిన బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణానికి రూ.90 వేల కోట్లు కేటాయించామని, జిల్లాల్లో అందుబాటులో ఉన్న సహజ వనరులు, నదులు, ఖనిజ సంపద, మానవ వనరుల ఆధారంగా ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగుతామని చెప్పారు. అచ్చంపేట ప్రాంతాన్ని ప్రధాన రవాణా కూడలిగా అభివృద్ధి చేయడంతోపాటు, పర్యాటక రంగం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు.
నవంబర్ 19న ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం
రాష్ట్రంలో కోటి 15 లక్షల కుటుంబాలు ఉండగా, కోటి ఆరు లక్షల కుటుంబాలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనాలు అందుతున్నాయని భట్టి విక్రమార్క వివరించారు. కేవలం అచ్చంపేట నియోజకవర్గంలోనే 7,300 ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో, నవంబర్ 19న ఇందిరమ్మ జయంతి సందర్భంగా కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ప్రతి కుటుంబానికీ వర్తించేలా ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని వెల్లడించారు.
అచ్చంపేట అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం
అచ్చంపేట నియోజకవర్గంతో తనకు 1980 నుంచి విడదీయలేని అనుబంధం ఉందని భట్టి విక్రమార్క గుర్తు చేసుకున్నారు. తన సోదరుడు మల్లు అనంతరాములు ఈ ప్రాంతం నుంచి పార్లమెంటుకు పోటీ చేసిన రోజుల నుంచి ఇక్కడి గ్రామాలతో తనకు పరిచయం ఉందని చెప్పారు. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలోని అనేక గ్రామాల్లో పర్యటించానని, ప్రజల సమస్యలను దగ్గరగా చూశానని తెలిపారు. గతంలో ఈ ప్రాంత ప్రజలు ప్రధానంగా విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడేవారని, ప్రస్తుతం విద్యుత్ శాఖ తన వద్ద ఉండటంతో సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఇప్పటికే 1,219 కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని, 403 కిలోమీటర్ల మేర కొత్త విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేశామని, 5 వేల కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని వివరించారు. ఈ పనుల కోసం ఇప్పటికే సుమారు రూ.75 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. భవిష్యత్తులో ప్రజలకు, రైతులకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. రాబోయే 50 సంవత్సరాల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేశామని వెల్లడించారు.
ఎకో టూరిజంతో స్థానికులకు ఉపాధి
అచ్చంపేట ప్రాంతంలో రహదారులు, ఎలివేటెడ్ కారిడార్లు, కృష్ణానదిపై వంతెనలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందుతున్నాయని తెలిపారు. వీటి ద్వారా అచ్చంపేటను ప్రధాన రవాణా కూడలిగా తీర్చిదిద్దే అవకాశం ఉందన్నారు. మన్ననూరు, నల్లమల అటవీ ప్రాంతాలకు ఉన్న సహజ సౌందర్యం, వన్యప్రాణుల సంపదను పర్యాటక అభివృద్ధికి అనుకూలంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక గిరిజన కుటుంబాలు, రైతులు, నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. పర్యాటకులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు స్థానికంగా వసతి, ఆతిథ్యం, రవాణా, ఇతర సేవల ద్వారా కుటుంబాలకు ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతలను గుర్తించి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు, నిధులు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.
ప్రజల సమస్యలే ప్రభుత్వ ప్రాధాన్యాలు
గతంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా అచ్చంపేట నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో పర్యటించిన రోజులను భట్టి విక్రమార్క గుర్తు చేసుకున్నారు. 2023 మే 31న లింగాల మండలం అంబటపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్రలో భాగంగా నియోజకవర్గంలోని సుమారు 42 గ్రామాల్లో 130 కిలోమీటర్ల మేర నడిచామని తెలిపారు.
ఆ సమయంలో ప్రజలు పెన్షన్లు, గ్యాస్, పోడు భూములు, విద్యుత్ బిల్లులు, సాగునీరు వంటి సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును సందర్శించినప్పుడు పనులు పూర్తి చేసి నీటిని అందిస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. నక్కలగండి ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలనే అంశాన్ని కూడా ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుంటుందని తెలిపారు. ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలను మరిచిపోకుండా, రాష్ట్ర ఆదాయానికి అనుగుణంగా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Soma Bharat Kumar | హరీశ్‌రావుకు ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు
- ●Ponguleti Srinivas Reddy | అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా అభివృద్ధిలో వివక్ష లేదు
- ●Dell XPS 13 | 2.5కె డిస్ప్లే, డాల్బీ అట్మోస్‌తో డెల్ కొత్త ఎక్స్పీఎస్ ల్యాప్‌టాప్‌లు.. ధర ఎంతంటే..
- ●Justice Madan Lokur | ఓటర్ల జాబితా సవరణపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. సమస్యలపై మాజీ జడ్జిల కమిషన్.. రేపే తొలి విచారణ
- ●MLA Palla Rajeshwar Reddy | జేఎన్టీయూ వీసీ భార్య ఆరోపణలు అవాస్తవం
- ●CM Revanth Reddy | వికసిత్ భారత్‌కు రాష్ట్రాల సహకారం అవసరం

Soma Bharat Kumar | హరీశ్‌రావుకు ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు

Ponguleti Srinivas Reddy | అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా అభివృద్ధిలో వివక్ష లేదు

Dell XPS 13 | 2.5కె డిస్ప్లే, డాల్బీ అట్మోస్‌తో డెల్ కొత్త ఎక్స్పీఎస్ ల్యాప్‌టాప్‌లు.. ధర ఎంతంటే..

Justice Madan Lokur | ఓటర్ల జాబితా సవరణపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. సమస్యలపై మాజీ జడ్జిల కమిషన్.. రేపే తొలి విచారణ



