త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Anirudh Reddy | బెల్ట్ షాపుల‌ను అరిక‌ట్టలేక‌పోతున్నాం.. అందుకే ఇప్పసారా ప్ర‌మోట్ : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

MLA Anirudh Reddy | రసాయనాలు ఉపయోగించి తయారు చేసే కల్తీ సారా గురించి తాను మాట్లాడటం లేదని, అడవుల్లో సహజంగా దొరికే ఇప్పపూలతో తయారు చేసే సారాను ప్రమోట్ చేయాలని మాత్రమే కోరుతున్నానని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేసారు.

S

Telangana | Published On Mar 10, 2026, 6.51 pm IST

MLA Anirudh Reddy | బెల్ట్ షాపుల‌ను అరిక‌ట్టలేక‌పోతున్నాం.. అందుకే ఇప్పసారా ప్ర‌మోట్ : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Advertisement

తెలంగాణ‌ సాంప్రదాయక సారాగా గుర్తించాలి
5 వేల ఏళ్ల నుంచే దేశంలో ఇప్పసారా ఉంది
ఇప్పసారాతో రాష్ట్రానికి, గిరిజనులకు ఆదాయం
ఇప్పసారా సేవనంతో ఆరోగ్యం
రసాయనాలతో తయారు చేసే సారాకు నేను వ్యతిరేకం
ఇప్పసారా విషయంపై అసెంబ్లీలో మాట్లాడుతా

MLA Anirudh Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రసాయనాలు ఉపయోగించి తయారు చేసే కల్తీ సారా గురించి తాను మాట్లాడటం లేదని, అడవుల్లో సహజంగా దొరికే ఇప్పపూలతో తయారు చేసే సారాను ప్రమోట్ చేయాలని మాత్రమే కోరుతున్నానని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేసారు. ఇప్పపూలతో తయారు చేసే సారాతో తెలంగాణ బ్రాండ్‌ను క్రియేట్ చేయాలని, తద్వారా అటు ప్రభుత్వానికీ ఇటు ఆదివాసీ, గిరిజనులకు కూడా భారీ ఎత్తున ఆదాయం వచ్చేలా చూడాలని తాను ప్రభుత్వాన్ని కోరనున్న‌ట్లు తెలిపారు. ఇప్పపూల సారా అనేది తన వ్యక్తిగత ఆలోచన అని, కేవలం తాను గిరిజనుల కోసమే దీని గురించి అసెంబ్లీలో మాట్లాడాలని నిర్ణయించుకున్నానని వివరించారు.

జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం అనిరుధ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను సారాపై చేసిన వాఖ్యలకు వివరణ ఇచ్చారు. ఇప్పపూలతో సారా తయారు చేయడం అనేది 5 వేల ఏళ్ల క్రితం నుంచే మన దేశంలో ఉందని, అయితే బ్రిటీష్ వాళ్లు మన దేశానికి వచ్చిన తర్వాత వారు తయారు చేసే మద్యాన్ని అమ్ముకోవడానికి ఇప్పసారా తయారీని బంద్ చేయించారని తెలిపారు. గతంలో ఇప్పసారా తాగిన వాళ్లు 115 ఏళ్ల వరకూ బతికే వారని, అయితే ఇప్పుడు తాగుతున్న మద్యం కారణంగా 60 ఏళ్లకే మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయం గురించి తాను ఎంతో పరిశోధన చేసిన తర్వాతనే ఈ విషయాలపై మాట్లాడుతున్నానని తెలిపారు. విదేశాల్లో మన ఇప్పపూల తరహాలోనే తయారు చేసి టకీలా అనే సారా ద్వారా దాన్ని తయారు చేసే దేశం లక్ష కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తోందని, అలాగే చైనా, జపాన్‌లు కూడా తమ సాంప్రదాయపు మద్యాన్ని తయారు చేసి ప్రప్రంచ వ్యాప్తంగా అమ్ముతున్నాయని తెలిపారు.

ఆదివాసీ బిడ్డలకు ఉపాధి

అదే విధంగా సాంప్రదాయకమైన ఇప్పసారాను కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రమోట్ చేయడం ద్వారా మన రాష్ట్రానికి కూడా లక్ష కోట్ల ఆదాయాన్ని సంపాదించి పెట్టాలని, దాని ద్వారా ఆదివాసీ, గిరిజనులు కూడా ప్రతి యేటా లక్షల రుపాయల ఆదాయాన్ని సంపాదించుకోవాలన్నదే తన లక్ష్యమని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్లమలతో సహా అటవీ ప్రాంతాల్లో ఇప్పపూలు విస్తారంగా లభిస్తాయని వాటిని సేకరించడం ద్వారా ఆదివాసీ బిడ్డలకు ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పసారాకు ప్రపంచ వ్యాప్తంగా ఒక గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్‌ను తీసుకురావాలన్నదే తన ఆలోచన అని అనిరుధ్ రెడ్డి చెప్పారు.

కల్తీ సారా గురించి తాను మాట్లాడటం లేదు

అయితే రసాయనాలు ఉపయోగించి తయారు చేసే కల్తీ సారా గురించి తాను మాట్లాడటం లేదని ఆయన స్పష్టం చేసారు. చీప్ లిక్కర్ గురించి కూడా మాట్లాడబోనన్నారు. బెల్టుషాపులను అరికట్టడంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని, తాను కూడా గతంలో తన నియోజకవర్గంలో వాటిని పూర్తిగా అరికడతానని హామీ ఇచ్చానని, అయితే నిబంధనల ప్రకారంగా 7 బాటిళ్ల కంటే తక్కువ మద్యం ఉన్నప్పుడు వాటిని పట్టుకొని కేసు చేయడం సాధ్యం కాదని చెప్పారు. ఈ లొసుగు ఆధారంగా బెల్టుషాపుల్లో 6 బాటిళ్ల కంటే తక్కువ మద్యాన్ని పెట్టుకొని అమ్ముకుంటున్నారని వాపోయారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమే ఇప్పసారా అని అభిప్రాయపడ్డారు. ఇప్పసారాను ప్రమోట్ చేయాలన్నది గిరిజనులు, ఆదివాసీలకు ఉపాధి కల్పించాలనే తన సొంత ఆలోచన మాత్రమేనని జ‌ర్న‌లిస్టులు అడిగిన ఒక ప్రశ్నకు బదులుగా ఎమ్మెల్యే స్పష్టీకరించారు.

ఇప్పసారా విషయంపై అసెంబ్లీలో మాట్లాడుతా

ఇప్పసారాతో లాభాలు ఉన్నాయని, అలాగే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని వీటన్నింటిని గురించి తాను అసెంబ్లీలో మాట్లాడుతానని ఈ విషయంలో తప్పొప్పులు ఏమైనా ఉంటే అసెంబ్లీలోనే సరిదిద్దుకుంటానని అనిరుధ్ అన్నారు. తాను ఇప్పసారా గురించి మాత్రమే మాట్లాడితే కొన్ని మీడియా సంస్థలు వాటికి మసాలాలు జోడించి తాను సారా ప్రభుత్వమే అమ్మాలని, సారా దుకాణాలు మళ్లీ తెరవాలని చెప్పినట్లుగా ప్రచారం చేసాయని వాటిలో వాస్తవం లేదని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement