త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Teenmar Mallanna | కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ఒట్టి బోగస్.. 1000 రోజుల పాలన అంతా అన్యాయ‌మే

Teenmar Mallanna | కామారెడ్డిలో కాంగ్రెస్ ఇచ్చిన బీసీ డిక్ల‌రేష‌న్ ఒట్టి బోగ‌స్ అని.. 1000 రోజుల పాల‌న‌లో బీసీల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని టీఆర్పీ అధినేత‌, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మండిప‌డ్డారు. బీసీలకు 21 కీలక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు.

S

Telangana | Published On Aug 31, 2026, 6.47 pm IST

Teenmar Mallanna | కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ఒట్టి బోగస్.. 1000 రోజుల పాలన అంతా అన్యాయ‌మే
Advertisement
  • ఇచ్చిన 21 హామీల్లో ఒక్కటీ అమలు కాలే
  • బడ్జెట్‌లో వేల కోట్లు కేటాయించినా ఖర్చు చేసింది సున్నా
  • బీసీలను మోసం చేసిన కాంగ్రెస్‌కు ప్ర‌జ‌లే బుద్ధి చెప్తారు
  • పాప‌న్న గౌడ్ స్ఫూర్తితో గోల్కొండ నుంచి పాద‌యాత్ర చేస్తాం.. రాజ్యాధికారం సాధిస్తాం
  • టీఆర్పీ అధినేత‌, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్య‌లు

Teenmar Mallanna | త్రినేత్ర‌.న్యూస్‌: కామారెడ్డిలో కాంగ్రెస్ ఇచ్చిన బీసీ డిక్ల‌రేష‌న్ ఒట్టి బోగ‌స్ అని.. 1000 రోజుల పాల‌న‌లో బీసీల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని టీఆర్పీ అధినేత‌, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మండిప‌డ్డారు. బీసీలకు 21 కీలక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు తెలంగాణ శాసనమండలి రికార్డులు, ప్రభుత్వ శాఖలు ఇచ్చిన అధికారిక లిఖితపూర్వక సమాధానాలను ఆధారంగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు చేసిన అన్యాయాలను ప్రజల ముందు పెడ‌తామ‌న్నారు. ఈమేర‌కు సోమ‌వారం టీఆర్పీ కార్యాల‌యంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.

42 శాతం రిజర్వేషన్ల హామీ ఏమైంది?
కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, కులగణన ఆధారంగా రాజకీయ ప్రాతినిధ్యాన్నిపెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకపోగా ఇప్పటికే ఉన్న అవకాశాలను కూడా దెబ్బతీసే విధంగా వ్యవహరించిందని విమర్శించారు. పంచాయతీలు, మున్సిపాలిటీలలో వేలాది కొత్త రాజకీయ నాయకత్వ స్థానాలు బీసీలకు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదన్నారు.

అధికారిక రికార్డుల‌తో తేటతెల్లం..

ఐదేళ్లలో బీసీల అభివృద్ధి కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులలో అత్యల్ప మొత్తమే ఖర్చు చేసినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయని మల్లన్న వెల్లడించారు. విద్య, ఉపాధి, కార్పొరేషన్లు, సంక్షేమ పథకాలు, వృత్తి ఆధారిత అభివృద్ధి కార్యక్రమాల కోసం భారీగా కేటాయింపులు చూపించినా అమలులో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం కనిపించిందన్నారు. బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, హాస్టళ్ల నిర్వహణ, స్టడీ సర్కిళ్లు, ఓవర్సీస్ విద్యానిధి వంటి అంశాలలో నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

22 బీసీ కార్పొరేషన్లకు నిధుల ఎగవేత

వివిధ బీసీ కులాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన 22 కార్పొరేషన్లు, రాజీవ్ యువ వికాసం వంటి పథకాల కోసం వేల కోట్లు కేటాయించినప్పటికీ, వాటిలో అతి స్వల్ప మొత్తమే ఖర్చు చేసినట్లు ప్రభుత్వ సమాధానాలు స్పష్టం చేస్తున్నాయని మల్లన్న పేర్కొన్నారు. బీసీ యువత స్వయం ఉపాధి, వ్యాపారాభివృద్ధి, ఆర్థిక సాధికారత కోసం ఉద్దేశించిన పథకాలు పూర్తిగా నిర్వీర్యమ‌య్యాయన్నారు.

బీసీ సబ్ ప్లాన్‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఏది?

అధికారంలోకి వచ్చిన వెంటనే మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారని, కానీ అనేక అసెంబ్లీ సమావేశాలు ముగిసినా ఇప్పటి వరకు ఆ అంశంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మల్లన్న అన్నారు. బీసీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా నిధుల కేటాయింపు, ఖర్చు పర్యవేక్షణ కోసం అవసరమైన సబ్ ప్లాన్‌ను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు.

వడ్డీ లేని రుణాలు, ప్రతి జిల్లాలో బీసీ ఐక్యతా భవనాలు, ప్రతి మండలంలో గురుకులాలు, కొత్త డిగ్రీ కాలేజీలు, వృత్తి బజార్లు, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, వృత్తిదారులకు ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు వంటి హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

ముదిరాజ్, గంగపుత్ర, యాదవ, కురుమ, గౌడ, మున్నూరుకాపు, పద్మశాలి, విశ్వకర్మ, రజక తదితర బీసీ కులాలకు ప్రత్యేకంగా ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని మల్లన్న విమర్శించారు. గొర్రెల పంపిణీ నుంచి కార్పొరేషన్ల బలోపేతం వరకు, పవర్‌లూమ్ క్లస్టర్ల నుంచి టూల్‌కిట్ల పంపిణీ వరకు ప్రతి అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు.

బీసీలకు న్యాయం జరగాలంటే..

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని ఆరోపించారు. తెలంగాణ జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీ సమాజానికి రాజకీయ అధికారం దక్కినప్పుడే నిజమైన సామాజిక, ఆర్థిక న్యాయం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.

బీసీల హక్కులు, నిధులు, రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరంతరం పోరాడుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని, చట్టసభల్లో బీసీల గొంతుకగా నిలుస్తామని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. "బీసీల ఓటుతో అధికారంలోకి వచ్చి, బీసీల హక్కులనే కాలరాసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది" అని తీన్మార్ మల్లన్న హెచ్చరించారు.

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఏలిన చ‌రిత్రాత్మక గోల్కొండ కోట నుంచి సెప్టెంబర్ 17న బీసీ రాజ్యాధికార పాదయాత్ర ప్రారంభించనున్నట్లు మల్లన్న ప్రకటించారు. బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రాజ్యాధికారం సాధించడమే ఈ పాదయాత్ర లక్ష్యమని ఆయన తెలిపారు. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు పాలనలో తగిన భాగస్వామ్యం దక్కే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాపన్న గౌడ్ స్ఫూర్తితో గోల్కొండ కోట నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర బీసీ రాజ్యాధికార ఉద్యమానికి కొత్త దిశను చూపుతుంద‌ని తీన్మార్ మల్లన్న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement