CM Revanth Reddy | పదేళ్లలో పాలమూరుకు కేసీఆర్ చేసిందేమీ లేదు
CM Revanth Reddy | పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలమూరు జిల్లాలో ఒక్క సాగునీటి ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించాలన్న ఆలోచన కూడా కేసీఆర్ చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మక్తల్–నారాయణపేట ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేశామని తెలిపారు.
- కొడంగల్‌ను దేశానికే అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దుతాం
- రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి..
- ఎల్‌నినో కరువును సమష్టిగా ఎదుర్కొందాం
- రూ.10వేల కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతాం
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy | పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలమూరు జిల్లాలో ఒక్క సాగునీటి ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించాలన్న ఆలోచన కూడా కేసీఆర్ చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మక్తల్–నారాయణపేట ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేశామని తెలిపారు. కొడంగల్‌ను విద్యా, పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలుపుతామని ప్రకటించారు. కొడంగల్ పర్యటనలో భాగంగా రేడియల్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేస్తున్న కొడంగల్ రేర్ (Rural Agriculture Region Economy) ఇండస్ట్రియల్ హబ్, ఎన్ఏఆర్ఐ (Network of Apparel Readiness & Infrastructure) పార్క్, THRIVE హబ్, రైజ్ (Regional Industries and Small Enterprises)లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా ఆవిష్కరించారు. అనంతరం ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు.
పాలమూరు కలలను నెరవేర్చలేదు
బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా సేవలందించారని సీఎం గుర్తుచేశారు. అనంతరం పాలమూరుకు అనేక అవకాశాలు వచ్చినా జిల్లా అభివృద్ధిలో ఆశించిన స్థాయికి చేరుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పాలమూరు అభివృద్ధి చెందుతుందనే ఆశతో 2009లో విఠల్‌రావును కాదని కేసీఆర్‌ను ప్రజలు పార్లమెంటుకు పంపించారని చెప్పారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, మక్తల్–కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తవుతాయని ప్రజలు ఆశించారన్నారు. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఉంటే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవని, ఈ ప్రాంత ప్రజల కల నెరవేరేదని పేర్కొన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసీఆర్ పాలమూరులో ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని విమర్శించారు. కేంద్రం జాతీయ ప్రాజెక్టు ఇస్తామన్నా పట్టించుకోకుండా ప్రాణహిత ప్రాజెక్టును పక్కనపెట్టి కాళేశ్వరం నిర్మించారని ఆరోపించారు. పేరు మార్చి, ఊరు మార్చి, అంచనాలు మార్చారని దుయ్యబట్టారు. కాళేశ్వరం నిర్మించింది వారేనని, కూలింది కూడా వారి హయాంలోనేనని వ్యాఖ్యానించారు.
కాళేశ్వరంపై చర్చకు సిద్ధమా?
కాళేశ్వరం అవకతవకలపై తమ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తే.. ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ ముందు మోకరిల్లి విచారణను జాప్యం చేయాలని కోరింది మీరు కాదా? అని బీఆర్‌ఎస్ నేతలను ప్రశ్నించారు. గతంలో హరీశ్‌రావు తనను కాళేశ్వరరావు అని పొగిడించుకున్నారని, ఇప్పుడు మేడిగడ్డ పేరు ఎత్తితే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీళ్లు వదలాలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. కన్నెపల్లి పంపులు ఆన్ చేసి నీళ్లు ఎత్తాలంటే మేడిగడ్డ ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. మూడు పంపులు ఏకకాలంలో పనిచేస్తేనే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుతుందని తెలిపారు. కాసుల కక్కుర్తి వల్లే మేడిగడ్డ కూలిపోయిందని, ప్రస్తుత కరువు పరిస్థితుల్లో కాళేశ్వరం నుంచి చుక్క నీరు కూడా అందించలేని దుస్థితి నెలకొందని విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా తుపాకులగూడెం వద్ద నీటిని ఎత్తిపోసి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని చెప్పారు. సమ్మక్క సారలమ్మ నుంచి దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా ఖమ్మం జిల్లా రైతులకు నీరు అందిస్తున్నట్లు వివరించారు. కాళేశ్వరం, గోదావరి జలాలు, ఎల్‌నినో ప్రభావంపై అసెంబ్లీలో రెండు రోజులపాటు చర్చకు అనుమతించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో సహా సభకు రావాలని, అన్ని వాస్తవాలను బయటపెట్టి నిజానిజాలు ప్రజల ముందు ఉంచుతామని సవాల్ విసిరారు.
కొడంగల్‌కు ఏం చేశారో చెప్పాలి
పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కొడంగల్‌కు ఏం చేశారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కృష్ణా రైల్వేలైన్‌ను అడ్డుకున్నారని, సిమెంట్ ఫ్యాక్టరీలు రాకుండా చేశారని ఆరోపించారు. సాగునీరు, తాగునీరు, విద్యావకాశాలు కల్పించలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మక్తల్–నారాయణపేట ఎత్తిపోతల పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. గతంలో ఎకరాకు రూ.2 లక్షల పరిహారం కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ.20 లక్షల పరిహారం అందించిందని చెప్పారు. కొడంగల్ అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక అవినీతి జరిగిందంటూ విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన అవకాశంతో మూడేళ్లలో ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానన్నారు.
దేశానికే ఆదర్శంగా కొడంగల్
ఢిల్లీ నుంచి నోయిడా వరకు, ముంబై నుంచి పుణె వరకు జరిగిన అభివృద్ధి తరహాలో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి కవచర్ల ఇండస్ట్రియల్ పార్క్ వరకు అభివృద్ధి చేస్తామని సీఎం ప్రకటించారు. కొడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని, RARE ఎడ్యుకేషన్ హబ్, RARE ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. తాండూరు పప్పును ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. రూ.10 వేల కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులను ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా పదేళ్లపాటు కాకుండా, రాబోయే కాలంలోనూ అందరం కలిసి కొడంగల్‌ను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రజలకంటే తనకు ఆత్మబంధువులు ఎవరూ లేరని అన్నారు. అందరికీ రేపు దీపావళి అయితే కొడంగల్ ప్రజలకు ఇవాళే దీపావళి వచ్చిందని వ్యాఖ్యానించారు.
గడ్డం పెంచుకున్నంత మాత్రాన రేవంత్ కాలేరు
తనను చూసి ఓ నాయకుడు గడ్డం పెంచుకున్నాడని వ్యాఖ్యానించిన సీఎం.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులి కాలేదని ఎద్దేవా చేశారు. గడ్డం పెంచుకున్నంత మాత్రాన రేవంత్‌రెడ్డి కాలేరని, పది జన్మలెత్తినా కేటీఆర్ అవుతారే తప్ప రేవంత్‌రెడ్డి కాలేరని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి కావాలంటే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే ధైర్యం, నమ్మినవారి కోసం ఎంతటి కష్టమైనా నిలబడే తెగువ ఉండాలని అన్నారు. గడ్డం రావడానికి 50 ఏళ్లు పట్టిందని, బుద్ధి రావడానికి ఎన్నేళ్లు పడుతుందోనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వేషాలు, భాషలు మార్చినా బుద్ధి మారనంత వరకు తెలంగాణ ప్రజలు నమ్మరని విమర్శించారు.
రైతులు ఆరుతడి పంటలే వేయాలి
రైతులు రాబోయే ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరుతడి పంటలు సాగు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. కరువు పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రభుత్వం రైతుల మేలు కోరుతోందని, వారికి అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. బావ, బామ్మర్దులు చెప్పే మాటలు వింటే నష్టపోవాల్సి వస్తుందని, రైతులు ఆలోచించి పంటల ఎంపిక చేసుకోవాలని హితవు పలికారు. సంక్రాంతి తర్వాత ప్రజాబలం కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికి వచ్చి ప్రజలను కలుస్తానని వెల్లడించారు. ఎల్‌నినో కారణంగా తలెత్తే కరువు పరిస్థితులను అందరం కలిసికట్టుగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●OTT | కరీనా కపూర్ వర్సెస్ ప్రీతీ జింటా - ఒకే రోజు ఓటీటీలోకి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ల సినిమాలు
- ●Suicide attempt | శ్రీనివాసరావు వల్లనే సచ్చిపోతున్నా.. సెల్ఫీ వీడియో తీస్తూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
- ●Telugu Serial | జీ తెలుగులో కొత్త సీరియల్ - హీరోయిన్గా కోలీవుడ్ బ్యూటీ
- ●Medak RTC RM | డీఎం తప్పు లేదు.. కార్మిక సంఘాల ఆరోపణలే అబద్ధం: మెదక్ ఆర్ఎం
- ●Koppula Eshwar | సీఎం, మంత్రుల ప్రచారం వల్లే పంటలు ఎండిపోతున్నయ్
- ●Balu Geetha Movie Review | బాలు గీత రివ్యూ - నాగార్జున మేనకోడలు నిర్మించిన రొమాంటిక్ మూవీ ఎలా ఉందంటే?

OTT | కరీనా కపూర్ వర్సెస్ ప్రీతీ జింటా - ఒకే రోజు ఓటీటీలోకి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ల సినిమాలు

Suicide attempt | శ్రీనివాసరావు వల్లనే సచ్చిపోతున్నా.. సెల్ఫీ వీడియో తీస్తూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Telugu Serial | జీ తెలుగులో కొత్త సీరియల్ - హీరోయిన్గా కోలీవుడ్ బ్యూటీ

Medak RTC RM | డీఎం తప్పు లేదు.. కార్మిక సంఘాల ఆరోపణలే అబద్ధం: మెదక్ ఆర్ఎం






