త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Balu Geetha Movie Review | బాలు గీత రివ్యూ – నాగార్జున మేన‌కోడ‌లు నిర్మించిన రొమాంటిక్ మూవీ ఎలా ఉందంటే?

క‌మిటీ కుర్రాళ్లు ఫేమ్ సందీప్ స‌రోజ్‌ హీరోగా న‌టించిన బాలు గీత మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కేయూరి షా హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాను అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సుప్రియా యార్ల‌గ‌డ్డ నిర్మించింది.

N

Entertainment | Published On Nov 7, 2026, 5.41 pm IST

Balu Geetha Movie Review | బాలు గీత రివ్యూ  – నాగార్జున మేన‌కోడ‌లు నిర్మించిన రొమాంటిక్ మూవీ ఎలా ఉందంటే?
Advertisement

Balu Geetha Movie Review | అన్న‌పూర్ణ స్టూడియోస్‌ బ్యాన‌ర్‌పై సుప్రియా యార్ల‌గ‌డ్డ (Supriya Yarlagadda)నిర్మించిన తెలుగు మూవీ బాలు గీత థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ నేరుగా ఓటీటీలో రిలీజైంది. సందీప్ స‌రోజ్‌, కేయూరీ షా హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాకు ప్ర‌తాప్ కొల్లారెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈటీవీ విన్ (Etv Win OTT )ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ ఎలా ఉందంటే?

బాలు ఫిలాస‌ఫీ...

అమ్మాయిల‌కు సాధ్య‌మైనంత దూరంగా ఉండాల‌న్న‌ది బాలు (సందీప్ స‌రోజ్‌) ఫిలాస‌ఫీ. అందుకు కార‌ణం శృతి. ప్రాణంగా ఆమెను ప్రేమిస్తాడు. కానీ శృతి మాత్రం బాలును ఓ ఫ్రెండ్‌గానే చూస్తుంది. సందీప్ అనే మ‌రో అబ్బాయిని పెళ్లిచేసుకుంటుంది. శృతి ఇచ్చిన షాక్‌కు పెళ్లి మాట ఎత్తితే చాలు బాలు భ‌య‌ప‌డిపోతుంటాడు. కొడుకుకు పెళ్లి చేయాల‌న్న‌దే ల‌క్ష్యంగా పెట్టుకుంటాడు బాలు తండ్రి. పెళ్లిచూపులు ఏర్పాటుచేస్తాడు. ఆ పెళ్లిచూపుల‌ను చెడ‌గొట్టాల‌ని బాలు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తాడు. కానీ అవేవీ వ‌ర్క‌వుట్ కావు. చివ‌రి ప్ర‌య‌త్నంగా నేరుగా పెళ్లిచూపుల్లో తాను చూడ‌బోయే గీత (కేయూరి షా) ను క‌లుస్తాడు. పెళ్లి ఇష్టం లేద‌ని చెప్పాల‌నుకుంటాడు. కానీ గీత మాట‌తీరు, మంచిత‌నం చూసి ఆ మాట చెప్ప‌లేక‌పోతాడు.

పెళ్లి చూపుల త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి వారం రోజులు జ‌ర్నీ సాగిస్తారు. ఈ ప్ర‌యాణంలో అభిప్రాయాలు మాత్ర‌మే కాకుండా మ‌న‌సులు క‌లుస్తాయి. పెళ్లిచేసుకుంటారు. పెళ్లైన కొద్ది రోజుల త‌ర్వాత గీత ఫోన్‌కు వ‌చ్చిన ఓ చిన్న వాయిస్ మెసేజ్ వారి కాపురంలో క‌ల‌త‌లు రేపుతుంది. గీత‌ను అనుమానిస్తాడు బాలు. ఆ త‌ర్వాత ఏమైంది? మాజీ ప్రియురాలు శృతితో పాటు ఆమె భ‌ర్త సందీప్ క‌లిసి బాలు కాపురాన్ని ఎలా నిల‌బెట్టారు? మ‌రోవైపు టెన్త్ క్లాస్ చ‌దివే అంజ‌లి త‌న క్లాస్‌మేట్ ప్ర‌వీణ్‌ను ఇష్ట‌ప‌డుతుంది. ప్ర‌వీణ్ చెప్పిన అబ‌ద్దం కార‌ణంగా ల‌వ్‌కు బ్రేక‌ప్ ప‌డుతుంది. అంజ‌లికి, గీత‌కు ఉన్న సంబంధ‌మేమిటి? స్కూల్ గెట్ టూ గెద‌ర్‌లో గీత‌కు బాలు ఎలాంటి షాకిచ్చాడు? భార్య మంచి మ‌న‌సును ఏ విధంగా అర్థం చేసుకున్నాడు అన్న‌దే బాలు గీత మిగిలిన క‌థ‌.

జెన్‌జీ యుగం...

జెన్‌జీ యుగంలో యువ‌త‌ ఎంత త్వ‌ర‌గా ప్రేమ‌లో ప‌డుతున్నారో...అంతే త్వ‌ర‌గా గొడ‌వ‌ల‌తో విడిపోతున్నారు. చిన్న చిన్న అపోహ‌ల‌తోనే బంధాల‌ను విచ్చిన్నం చేసుకుంటారు. అపోహ‌లు అనుమానాలు కాదు.. భార్యాభ‌ర్త‌ల బంధంలో ప్రేమ‌తో పాటు న‌మ్మ‌కం ఉండాలి. చిన్న చిన్న అపార్థాలు స‌హ‌జం. వాటిని దాటుకుంటూ ముందుకు సాగిన‌ప్పుడే ఆ బంధానికి అర్థం, ప‌ర‌మార్థం ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌తాప్ కొల్లారెడ్డి బాలు గీత మూవీలో చూపించాడు.

బ్రేక‌ప్ జీవితం ముగిసిపోయిన‌ట్లు కాద‌ని, కొత్త లైఫ్‌ను తిరిగి నిర్మించుకునే అవ‌కాశం ప్ర‌తి ఒక్క‌రికి ఉంటుంద‌ని చూపించారు. బ్రేక‌ప్ చెప్ప‌గానే అమ్మాయిల‌ను ద్వేషించ‌డం కాద‌ని, నిజంగా వారి మ‌న‌సుల్లో కూడా ఏముందో తెలుసుకోవాల‌ని ఈ సినిమాలో మెసేజ్ ఇచ్చారు.

నిజ‌జీవితంలో...

నిజ‌జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల నుంచే ఈ క‌థ‌ను రాసుకున్నారు డైరెక్ట‌ర్‌. అంతే రియ‌లిస్టిక్‌గా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేశారు. చివ‌ర‌లో కొన్ని ట్విస్ట్‌లు యాడ్ చేసి క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చారు. వావ్ అనిపించేంత గొప్ప‌వి కాక‌పోయినా బాగానే ఉన్నాయి.

డ్రామా పండ‌లేదు...

ఫ‌స్ట్ హాఫ్ కాస్త సాగ‌దీశారు. హీరోహీరోయిన్ల ప‌రిచ‌యం, వారి జ‌ర్నీని ఇంకాస్త అందంగా, రొమాంటిక్‌గా చూపిస్తే బాగుండేది. గొడ‌వ‌లు ప‌డే సీన్‌, అపార్ధాలు తొల‌గిపోయి క‌లిసే సీన్‌లో కావాల్సినంత డ్రామా పండ‌లేదు. స్కూల్ ట్విస్ట్‌లో లాజిక్ మిస్స‌యిన‌ట్లుగా అనిపిస్తుంది.

కెమిస్ట్రీ బ‌లం...

బాలు గీత సినిమాకు సందీప్ స‌రోజ్‌, కేయూరి షా జోడీ, వారి కెమిస్ట్రీ ప్ర‌ధాన బ‌లంగా నిలిచింది. సందీప్ స‌రోజ్ న‌ట‌న‌లో ప‌రిణితి రావాలి. కేయూరి షా మాత్రం హీరోను డామినేట్ చేసింది. స‌హ‌జ న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింది. సినిమాకు సుప్రియా యార్ల‌గ‌డ్డ నిర్మాత‌. షూటింగ్ చాలా వ‌ర‌కు అన్న‌పూర్ణ స్టూడియోలోనే సాగింది.

బాలు గీత జెన్‌జీ ఆడియెన్స్‌ను మెప్పించే రొమాంటిక్ మూవీ. కొంచెం ఓపిక‌తో చూస్తే న‌చ్చుతుంది.

Advertisement
Advertisement