త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | తెలంగాణ భ‌విష్య‌త్ అద్దాల మేడ‌లు, రంగుల గోడ‌ల్లో లేదు.. త‌ర‌గ‌తి గ‌దుల్లోనే: సీఎం రేవంత్‌

G

Telangana | Published On Jun 17, 2026, 12.57 pm IST

Revanth Reddy | తెలంగాణ భ‌విష్య‌త్ అద్దాల మేడ‌లు, రంగుల గోడ‌ల్లో లేదు.. త‌ర‌గ‌తి గ‌దుల్లోనే: సీఎం రేవంత్‌
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ భ‌విష్య‌త్ అద్దాల మేడ‌లు, రంగుల గోడ‌ల్లో లేద‌ని, త‌ర‌గ‌తి గ‌దుల్లోనే ఉంద‌ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. విద్య మాత్రమే జీవితాలను సమూలంగా మార్చగలదని చెప్పారు. సమాజంలో అసమానతలు పోవాలంటే అందరికీ నాణ్యమైన విద్య అవసరమని తెలిపారు. రాష్ట్రంలో 27 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బ‌డుల్లో చదువుతున్నారని వెల్ల‌డించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై తల్లిదండ్రులకు అపోహలు ఉన్నాయని, వాటిని తొలగించేందుకే తెలంగాణ ప‌బ్లిక్ స్కూల్ (TPS) నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే విద్యా కమిషన్‌ను ఏర్పాటుచేశామ‌న్నారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్ల‌లో తెలంగాణ ప‌బ్లిక్ స్కూల్‌ను సీఎం రేవంత్ ప్రారంభించారు. అనంత‌రం మాట్లాడుతూ.. `ఆరుట్లలో ప్రారంభించుకున్న టీపీఎస్‌ను రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అంకితం చేస్తున్నాం. ఈ స్ఫూర్తి ఆరుట్ల గ్రామానికే కాదు.. తెలంగాణలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు. తెలంగాణ భవిష్యత్ అద్దాల మేడలు రంగుల గోడల్లో లేదు.. త‌రగతి గదుల్లోనే ఉందని మేం సంపూర్ణంగా విశ్వసించాం. విద్యాకమిషన్ నివేదిక ప్రకారం ప్రభుత్వం పాఠశాలలల్ని బలోపేతం చేస్తున్నాం.

ప్రతీ నియోజకవర్గంలో ఒక టీపీఎస్‌..

ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో ఇప్పటికే 1814 మంది విద్యార్థులు చేరారు. ఒక ప్రభుత్వ పాఠశాలకు నో అడ్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇందుకు పాఠశాల ఉపాధ్యాయులను నేను అభినందిస్తున్నా. రాష్ట్రంలో ప్రతీ శాసన సభ నియోజకవర్గంలో ఒక టీపీఎస్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేస్తున్నాం. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ప్రభుత్వ పాఠశాలలను పునరుద్దరిస్తున్నాం.

విధ్వంసమైన విద్యావ్యవస్థను వికాసం వైపు..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారు ఎందరో గొప్ప నాయకులుగా, అధికారులుగా ఎదిగారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ప్రభుత్వ బడిలో చదువుకున్నవారే. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నవాడినే. ప్రభుత్వ బడిలో చదువుకుని ముఖ్యమంత్రి స్థాయికి చేరా. తల్లిదండ్రులు ఆత్మగౌరవంతో బ్రతికేలా మీరు విద్యలో రాణించాలి. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, అధికారులుగా, రాజకీయ నాయకులుగా మీరు ఎదగాలి. విధ్వంసమైన విద్యావ్యవస్థను వికాసం వైపు నడిపించేందుకే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నాం. ఆరుట్ల గ్రామం తెలంగాణకు ఆదర్శంగా ఉండాలని, ఉంటుందని నేను విశ్వసిస్తున్నా.

విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంతో పాటు కిట్స్‌ను అందిచే ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్న‌ది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం. డిసెంబరు 9 న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవనాన్ని ప్రారంభించుకోబోతున్నాం. ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం.

కడుపులో కుల్లు పెట్టుకుని..

విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ అందించే కార్యక్రమాన్ని చేపట్టాం. ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీతో విద్యార్థులను ఫుట్ బాల్ ఆడించాం.
క్రీడలను ప్రోత్సహించాలని మేం మెస్సీని తీసుకొస్తే రాజకీయ విమర్శలు చేశారు. కడుపులో కుల్లు పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటున్న వాళ్లకు భవిష్యత్ లో ప్రతిపక్ష హోదా కూడా మిగలదు. విమర్శించే వాళ్లకు ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను చూపించండి. మీరు అండగా నిలబడండి అద్భుతాలని సృష్టిస్తాం.. తెలంగాణను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చి దిద్దుతాం.

అపోహలు తొలగించేందుకే..

రాష్ట్రంలో 27 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారని సీఎం రేవంత్​రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో 24 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. విద్యాశాఖపై ఈ ప్రభుత్వం రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తోంది సీఎం వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై తల్లిదండ్రులకు అపోహలు ఉన్నాయన్న రేవంత్​రెడ్డి, అందరి అపోహలు తొలగించేందుకే టీపీఎస్‌ నిర్మాణాన్ని చేపట్టామని వెల్లడించారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే విద్యా కమిషన్‌ ను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. విద్య మాత్రమే జీవితాలను సమూలంగా మార్చగలదని స్పష్టం చేశారు. సమాజంలో అసమానతలు పోవాలంటే అందరికీ నాణ్యమైన విద్య అవసరం` అని సీఎం రేవంత్ అన్నారు.

Advertisement
Advertisement