త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌

Revanth Reddy | రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల‌లో (Arutla) అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను (TPS) సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు.

G

Telangana | Published On Jun 17, 2026, 10.25 am IST

Revanth Reddy | తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల‌లో (Arutla) అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను (TPS) సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు శ్రీధ‌ర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క‌లిసి పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లోని పైలాన్ ఆవిష్కరించారు. అనంత‌రం అత్యాధునికంగా రూపొందించిన డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించారు. విద్యార్థుల‌తో క‌లిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఆ త‌ర్వాత ఆరుట్ల‌లో ఏర్పాటు చేసిన‌ బ‌హిరంగ స‌భ‌లో సీఎం పాల్గొంటారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా..

దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ డాక్టర్ ఆకునూరి మురళి, సభ్యులు పీఎల్ విశ్వేశ్వర్ రావు, డాక్టర్ చారకొండ వెంకటేష్, జోష్నా శివారెడ్డి పర్యవేక్షణలో ఆరుట్లలోని ఈ పాఠశాల రూపుదిద్దుకుంది. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించేలా టీపీఎస్‌ను తీర్చిదిద్దారు. విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇంగ్లీష్ మీడియం బోధనతో పాటు ఆధునిక సాంకేతిక పద్ధతులు ఈ స్కూల్ ప్రత్యేకతగా నిలుస్తున్నాయి. విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ వంటి సమగ్ర వసతులు కల్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల నమ్మకాన్ని పెంచే దిశగా ఈ మోడల్ స్కూల్‌ను రూపొందించారు.

దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా 100 పాఠశాలలు

పైలట్ ప్రాజెక్ట్‌గా నాలుగు పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసింది. రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మోడల్‌ను దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా 100 పాఠశాలలకు విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆరుట్ల పబ్లిక్ స్కూల్ ఇప్పటికే కార్పొరేట్ స్థాయి వాతావరణాన్ని తలపిస్తోంది. విశాలమైన తరగతి గదులు, డిజిటల్ లెర్నింగ్ సిస్టమ్స్, లైబ్రరీ, జిమ్, ప్లేగ్రౌండ్స్‌తో పాటు క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్ వంటి క్రీడలకు ప్రత్యేక మైదానాలు ఏర్పాటు చేశారు. ప్రతి క్రీడకు ప్రత్యేక శిక్షకులను కూడా నియమించారు.

ప్ర‌తి స్కూల్ ఐదు బ‌స్సులు..

పాఠశాలకు సమీప గ్రామాల నుంచి విద్యార్థుల రాకపోకల కోసం ఐదు బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా టీపీఎస్‌పై తల్లిదండ్రుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను కూడా ఈ స్కూల్‌లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకొస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఆరుట్ల పబ్లిక్ స్కూల్‌లో 1,814 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రీ-ప్రైమరీలో 150 మంది, ప్రైమరీలో 600 మంది, హైస్కూల్ రెండు బ్లాకుల్లో కలిపి 800 మంది, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 160 మంది, రెండో సంవత్సరం 104 మంది విద్యార్థులు ఉన్నారు. పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో “నో అడ్మిషన్” బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని పాఠశాల వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ విద్యను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రారంభిస్తున్న ఈ ఆరుట్ల టీపీఎస్ రాష్ట్ర విద్యా చరిత్రలో కీలక మైలురాయిగా నిలవనుంది.

Advertisement
Advertisement