త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | స్థానిక అల‌వాట్ల‌కు అనుగుణంగా బ్రేక్‌ఫాస్ట్

CM Revanth Reddy | ప్రాంతాల వారీగా స్థానిక అల‌వాట్ల‌కు అనుగుణంగా బ్రేక్‌ఫాస్ట్ త‌యారు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పిల్ల‌ల‌కు అందించే ఆహార నాణ్యత విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు.

S

Telangana | Published On Oct 2, 2026, 3.15 pm IST

CM Revanth Reddy | స్థానిక అల‌వాట్ల‌కు అనుగుణంగా బ్రేక్‌ఫాస్ట్
Advertisement

నవంబ‌ర్ 30 లోగా సెంట్ర‌ల్ కిచెన్లు పూర్తి కావాలి
డిసెంబ‌ర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలి
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : ప్రాంతాల వారీగా స్థానిక అల‌వాట్ల‌కు అనుగుణంగా బ్రేక్‌ఫాస్ట్ త‌యారు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పిల్ల‌ల‌కు అందించే ఆహార నాణ్యత విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. సెంట్రల్ కిచెన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తాం.. జీవితకాలం కొనసాగే కార్యక్రమం ఇది. కాబట్టి అత్యంత జాగ్రత్త వహించాలి అని సీఎం రేవంత్ సూచించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో హ‌రే కృష్ణ ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు శుక్ర‌వారం క‌లిశారు.

సీఎం రేవంత్ సమక్షంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ కోసం హరే కృష్ణ ఫౌండేషన్‌తో జున్నా సోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకున్నారు. నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లలో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు ఈ సంస్థ‌లు సహకారం అందిస్తున్నాయి. నాగర్‌కర్నూల్‌లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కోసం రూ. 5.17 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హరే కృష్ణ ఫౌండేషన్‌కు జున్నా సోలార్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ శేఖర్ రెడ్డి, సీఈవో అనిల్ బాబు అందించారు. వికారాబాద్‌లో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రూ. 4 కోట్ల చెక్కును హరే కృష్ణ ఫౌండేషన్‌కు చైన్ ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి సమంత డే, వైస్ ప్రెసిడెంట్ బుగత సంతోష్ కుమార్ అందించారు. ఈ సంద‌ర్భంగా ఇరు సంస్థ‌ల ప్ర‌తినిధుల‌ను సీఎం అభినందించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల ట్రాక్ రికార్డును నిర్వహించాలి. విద్యార్థుల శారీరక పెరుగుదల, విద్యా పురోగతి వంటి అంశాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలి. ఆహారంలో ఇచ్చే పదార్థాల క్యాలరీలను లెక్కించడానికి యాప్‌లను ఉపయోగించుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్ వల్ల విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకుంటారు. నవంబర్ 30లోగా సెంట్రల్ కిచెన్లు పూర్తి అయ్యేలా చూడాలి. డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సెంట్రల్ కిచెన్ల ప్రారంభించాలి. సెంట్రల్ కిచెన్లను విద్యార్థులు సందర్శించేలా చర్యలు తీసుకోవాలి అని సీఎం సూచించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, హరే కృష్ణ ప్రతినిధి సత్య గౌర చంద్ర దాస్ స్వామీజీ పాల్గొన్నారు.

Advertisement
Advertisement