త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రాష్ట్ర రెవెన్యూ త‌గ్గుతుంది.. మంత్రి పొంగులేటి రెవెన్యూ వేల కోట్ల‌కు పెరుగుతంది : కేటీఆర్

KTR | రాష్ట్ర రెవెన్యూ మ‌త్రం త‌గ్గుతుంది.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మాత్రం వంద‌ల‌, వేల కోట్ల‌కు పెరుగుతుంద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు సీతారామ ప్రాజెక్టు నుంచి రూ. 100 కోట్ల విలువైన మ‌ట్టిని దోపిడీ చేస్తున్నార‌ని ఆరోపించారు.

S

Telangana | Published On Jun 24, 2026, 4.40 pm IST

KTR | రాష్ట్ర రెవెన్యూ త‌గ్గుతుంది.. మంత్రి పొంగులేటి రెవెన్యూ వేల కోట్ల‌కు పెరుగుతంది : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర రెవెన్యూ మ‌త్రం త‌గ్గుతుంది.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మాత్రం వంద‌ల‌, వేల కోట్ల‌కు పెరుగుతుంద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు సీతారామ ప్రాజెక్టు నుంచి రూ. 100 కోట్ల విలువైన మ‌ట్టిని దోపిడీ చేస్తున్నార‌ని ఆరోపించారు. స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ బీఆర్ఎస్ స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

తెలంగాణ నలుమూలల ఎక్కడికి వెళ్లినా.. ఈ దుర్మార్గ పాలన పోవాలి.. కేసీఆర్ పాలన రావాలి అని ప్రజలు కోరుతున్నారు. కాంగ్రెస్ మాయమాటలు విని మోసపోతే గోస తప్పదని ఆనాడే కేసీఆర్ చెప్పారు. రెండున్నరేళ్ల అసమర్థ కాంగ్రెస్ పాలనలో ఎవరికి నష్టం జరిగిందో ఆలోచించండి. కాంగ్రెస్ హయాంలో మోసపోని వర్గం లేదు, కుప్పకూలని రంగం లేదు అని కేటీఆర్ అన్నారు.

విలేకరుల గౌరవానికి తగ్గట్టుగా కార్డులు ఇవ్వాలి

నియోజకవర్గాల్లో పనిచేసే విలేకరులకు బీఆర్ఎస్ హయాంలో అక్రిడేషన్ కార్డులు ఇచ్చే వాళ్లం. కాంగ్రెస్ హయాంలో వాటి విషయంలోనూ అన్యాయం చేస్తున్నారు. ఐ అండ్ పీఆర్ మంత్రి విలేకరుల గౌరవానికి తగ్గట్టుగా కార్డులు ఇవ్వాలని కోరుతున్నా. లేకపోతే హైదరాబాద్ వేదికగా ప్రభుత్వంపై బీఆర్ఎస్ పక్షాన ఒత్తిడి తీసుకువస్తామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

ముఖ్యమంత్రి 72 సార్లు ఢిల్లీకి పోయి.. పైసా తెచ్చింది లేదు

60 ఏళ్లలో రైతులపై రకరకాల పన్నులు వసూలుచేసిన ప్రభుత్వాలనే చూశాం. తొలిసారి రైతుకు పెట్టుబడి సాయం అందించాలన్న ఆలోచన చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్. 72 లక్షల మంది రైతుల ఖాతాలో రూ. 73 వేల కోట్లు వేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పుడున్న ముఖ్యమంత్రి 72 సార్లు ఢిల్లీకి పోయి.. పైసా తెచ్చింది లేదు అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

కేసీఆర్ అధికారంలోకి రాగానే సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తాం

గతంలో ఖమ్మం జిల్లాలో రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ పేరిట కాంగ్రెస్ రైతులను మోసం చేసింది. గోదావరిలోని ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి ఖమ్మం జిల్లా రూపురేఖలు మార్చాలని ఆనాడు కేసీఆర్ సంకల్పించారు. పది వేల కోట్లతో సీతారామ ప్రాజెక్టు చేపట్టి 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం చేపట్టారు. సీతారామ ప్రాజెక్టుతో మొట్టమొదటి ఫలితం అందుకునే నియోజకవర్గం సత్తుపల్లి. ఈ ప్రాజెక్టు కోసం రూ. 8 వేల కోట్లను బీఆర్ఎస్ ప్రభుత్వమే ఖర్చు చేసింది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినా రెండున్నరేళ్లలో ఏం పట్టించుకోలేదు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రాగానే సీతారామ ప్రాజెక్టును పూర్తిచేసి రైతులకు నీళ్లిచ్చే బాధ్యత తీసుకుంటామ‌ని కేటీఆర్ తెలిపారు.

మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిన దివాణాగాడు ఎవరు...?

పవర్‌ఫుల్ శాఖలన్నీ ఖమ్మంలోని ముగ్గురు మంత్రుల చేతిలోనే ఉన్నాయి. ఈ ముగ్గురు మంత్రులతో ఖమ్మం జిల్లాకు ఒరిగింది శూన్యం. రూ. 50 వేల కోట్ల రుణమాఫీని చివరికి రూ. 20 వేల కోట్లకు తెచ్చారు. కేసీఆర్ 11 సార్లు రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం వేశారు. గత రెండున్నరేళ్లలో మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిన దివాణాగాడు ఎవరు. అన్నిరకాల వడ్లకు బోనస్ అని ఎన్నికల్లో మాటిచ్చి చివరికి ఏడు రకాలకు కుదించి దగా చేశారు. సంచులన్నీ ఢిల్లీకి పోతున్నై కాబట్టే కొనుగోలు కేంద్రాల్లో రైతులకు గన్నీబ్యాగులు దొరకని దుస్థితి. రాష్ట్రంలో రైతుబంధు పడటం లేదుకానీ.. ఢిల్లీలో ఠంచన్‌గా రాహుల్ బంధు మాత్రం పడుతోంది అని వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ విమ‌ర్శించారు.

విద్యార్థుల తల్లిదండ్రులపై భారం

ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. విద్యార్థులకు రకరకాల హామీలిచ్చిన రేవంత్ రెడ్డి, చివరికి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కూడా చెల్లించకుండా నయవంచన చేస్తున్నారు. పదివేల కోట్ల ఫీజుల బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల తల్లిదండ్రులపై భారం మోపుతున్నారు. కాంగ్రెస్‌ను నమ్మిన పాపానికి నష్టం ఎవరికి జరుగుతోందో ఒక్కసారి ఆలోచించాలి అని కేటీఆర్ చెప్పారు.

యూరియా యాప్‌ను బంగాళాఖాతంలో పడేస్తాం..

బూతులు, ఎగవేతలు, కూల్చివేతలు తప్ప ఈ రెండున్నరేళ్లలో చేసిందేమిటి. గ్యారెంటీ కార్డును భద్రంగా పెట్టుకోమని చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు. మూడు నెలల్లో అన్నీ చేస్తామన్న మాట మూడేళ్లు కావస్తున్నా ఏమైపోయింది. షాపుల్లో లేని యూరియా.. యాప్‌లో ఎక్కడ ఉంటది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు మెజారిటీ స్థానాలు కట్టబెడితే.. యూరియా యాప్‌ను బంగాళాఖాతంలో పడేస్తాం. మళ్లీ ఆటో అన్నకు ఫోన్ చేస్తే, పొలం కాడికి యూరియా ఇచ్చి పోయే రోజులు తెస్తామ‌ని కేటీఆర్ తెలిపారు.

21 లక్షలకే ఎందుకు రాసిచ్చారు

కోటి మందిని కోటీశ్వరులను చేస్తామన్న ముఖ్యమంత్రి కనీసం మహిళలను లక్షాధికారులను చేయాలి. కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలకు ఒక్కొక్కరి ఖాతాలో లక్షా 50 వేలు వేస్తే, శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 60 ఏళ్లలో.. ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. రాష్ట్ర రెవెన్యూ పడిపోతోంది. రెవెన్యూ మంత్రి సంపద మాత్రం పెరుగుతోంది. బుగ్గపాడు ఫుడ్ పార్కులో ఏం జరుగుతోందో ప్రజలు గమనించాలి. ఎకరానికి 60 లక్షల మార్కెట్ విలువ ఉన్న భూములను 21 లక్షలకే ఎందుకు రాసిచ్చారు. సీతారామ ప్రాజెక్టు నుంచి వంద కోట్ల మట్టి దోపిడీ చేస్తున్నది గౌరవ వ్యవసాయ మంత్రి గారే. కాంట్రాక్టుల రూపంలో పొంగులేటి వేల కోట్ల దోపిడీ చేస్తున్నారు. పొంగులేటికి తప్ప ఎవరికైనా కాంట్రాక్టులు వస్తున్నాయా? ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement