త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Y Satish Reddy | తెలంగాణ హిట్లర్ రేవంత్ రెడ్డి : వై సతీష్ రెడ్డి

Y Satish Reddy | రేవంత్ రెడ్డి తెలంగాణ హిట్లర్ అని బీఆర్ఎస్ నాయకుడు, రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.

S

Telangana | Published On Jun 8, 2026, 4.33 pm IST

Y Satish Reddy | తెలంగాణ హిట్లర్ రేవంత్ రెడ్డి : వై సతీష్ రెడ్డి
Advertisement

కూల్చివేత‌ల‌తోనే పాల‌న మొద‌లుపెట్టాడు
మాన‌వ‌త్వం లేకుండా ఇండ్లు కూల్చాడు
హిట్ల‌ర్‌కు ప‌ట్టిన గ‌తే రేవంత్ రెడ్డికి
ఇకనైనా నియంత పోకడలు మానుకోవాలి
సీఎం రేవంత్ రెడ్డికి స‌తీష్ రెడ్డి హెచ్చ‌రిక‌

Y Satish Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రేవంత్ రెడ్డి తెలంగాణ హిట్లర్ అని బీఆర్ఎస్ నాయకుడు, రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. 1945లో జర్మనీ బెర్లిన్ ప్యాలెస్‌లో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన హిట్లర్.. 1969లో కొండారెడ్డిపల్లి గడీలో జన్మించి జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో ఉంటూ తెలంగాణలో నియంత పాలన చేస్తున్నారన్నారు. తాము ఇదే విషయాన్ని రెండున్నరేళ్లుగా చెబుతున్నామని సతీష్ రెడ్డి అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డే స్వయంగా ఒప్పుకున్నారన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు ఎవరైనా నిర్మాణం గురించి మాట్లాడతారని.. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కూల్చివేతలతోనే పాలన మొదలు పెట్టారని అన్నారు. ఆ తర్వాత కూడా ఆయన భాష, చేతలు అన్నీ అలాగే ఉన్నాయన్నారు.

రైతులకు సంకెళ్లు వేసిన నియంత రేవంత్ రెడ్డి

జర్నలిస్టులను బట్టలూడదీసి కొడతానని నిండు అసెంబ్లీలో మాట్లాడారని.. పెట్టుబడులు పెట్టేవాళ్ల మీద కేసులు పెట్టి జైలులో వేయండని వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేసి రోజుల తరబడి జైలులో పెట్టారని అన్నారు. రైతులమీద పోలీసులను ఉసిగొల్పి.. రైతులకు సంకెళ్లు వేసిన నియంత రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. అందుకే.. రేవంత్ రెడ్డి.. నియంతృత్వం, అరాచక, అక్రమ పాలన అని తాము రెండున్నరేళ్లుగా చెబుతూనే ఉన్నామని సతీష్ రెడ్డి తెలిపారు.

కనీసం సిగ్గు, ఎగ్గు లేకుండా.. రేవంత్ రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్నారు

కనీసం సిగ్గు, ఎగ్గు లేకుండా.. పేదల ఇండ్లు కూల్చి వాటిని ఇరాన్, ఇరాక్ కూల్చివేతలతో పోల్చుకుంటున్నాడని మండిపడ్డారు. ఇరాన్‌లో అమెరికా బాంబులతో ఇండ్లు పేల్చేసినట్టు రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో, వెలుగుమట్లలో కూల్చివేశాడని తాము ఆరోపిస్తే.. దాన్ని కూడా రేవంత్ రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అందుకే తెలంగాణ హిట్లర్ రేవంత్ రెడ్డి.. అని పేరు పెడుతున్నామన్నారు.

రేవంత్ రెడ్డికి కూడా అదే గతి

తనకు హిట్లర్ స్పూర్తి రేవంత్ రెడ్డి చెప్పిన మాటల ఆధారంగా తాము సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే.. వాటిపైనా కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండని.. ఆ పోస్టులను ప్రెస్‌మీట్‌లో కూడా ప్రదర్శించారు. ఈ నియంత పోకడ మానుకోకుంటే.. బెర్లిన్ ప్యాలెస్‌లో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నట్టుగానే.. రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. ఇది నియంతృత్వం కాదని.. రాచరికం కాదని.. ప్రజాస్వామ్య దేశమని చెప్పారు. ప్రజలు తమకున్న ఓటుహక్కుతో.. చెప్పుతో కొట్టినట్టుగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Advertisement
Advertisement