త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan Kumar | తెలంగాణ జ‌నాక్రోశ‌మే ఈ క‌విత్వం.. సీఎం రేవంత్‌కు అంకితం

Dasoju Sravan Kumar | తెలంగాణ సమాజంలో వ్య‌క్త‌మ‌వుతున్న తీవ్ర ఆక్రోశాన్ని గొంతుకగా మార్చారు ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్. క‌విత్వం రూపంలో ఉన్న ప్ర‌జ‌ల ఆవేద‌న‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంకితం ఇస్తున్న‌ట్లు ఆయ‌న ఎక్స్ వేదికగా ప్ర‌క‌టించారు.

S

Telangana | Published On Jun 8, 2026, 5.19 pm IST

Dasoju Sravan Kumar | తెలంగాణ జ‌నాక్రోశ‌మే ఈ క‌విత్వం.. సీఎం రేవంత్‌కు అంకితం
Advertisement

Dasoju Sravan Kumar | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ సమాజంలో వ్య‌క్త‌మ‌వుతున్న తీవ్ర ఆక్రోశాన్ని గొంతుకగా మార్చారు ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్. క‌విత్వం రూపంలో ఉన్న ప్ర‌జ‌ల ఆవేద‌న‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంకితం ఇస్తున్న‌ట్లు ఆయ‌న ఎక్స్ వేదికగా ప్ర‌క‌టించారు. ఇదే ఆ క‌విత్వం..

నిజంగానే హిట్లర్ నీకు ఆదర్శం,
హైడ్రా నువ్వు ఎక్కుపెట్టిన కిరాతక ఆయుధం,
కూల్చివేతలే నువ్వు నమ్ముకున్న సిద్ధాంతం,
పేదల ఏడుపులే నువ్వు కోరుకున్న ప్రజాపాలనా సందర్భం..

లగచర్ల, వెలుగుమట్ల‌ మొదలుకొని మూసీ పేరుతో,
ఆడబిడ్డలు, నిండు చూలాలు, పసిపిల్లలు అని చూడకుండా,
వారి హృదయ విదారక దృశ్యాలకు సాక్షిగా,
నువ్వు సాగించిన నీ రాక్షస ప్రయాణం
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక చీకటి కాలం..

నెలల తరబడి రైతుల పంటను కొనకుండా,
వానకు తడిసి, ఎండకు ఎండిపోయిన పంటను చూసి,
పంట కుప్పల పైనే రైతులు ప్రాణాలు విడుస్తున్న
భయానక దృశ్యాలు
నీ హిట్లర్ పాలనకు నిదర్శనం..

ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చి,
ఫ్యూచర్ సిటీ నెపంతో రియల్ ఎస్టేట్ లక్ష్యంగా నువ్వు వేస్తున్న ఎత్తులు,
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించి,
అధికారాన్ని కాపాడుకోవడం కోసం
ఢిల్లీకి మోస్తున్న డబ్బుల మూటలు,

ప్రశ్నించిన ప్రజలపై కేసుల పేరుతో
ఉక్కుపాదం మోపుతూ నువ్వు చేస్తున్న వికటాట్టహాసం
అవును.. హిట్లర్ పాలనకు నిదర్శనమే..

హామీలను ఎగవేసి, పాలనను గాలికొదిలేసి,
నిరుద్యోగుల ఉసురు పోసుకొని,
తెలంగాణ చరిత్రను పక్కదారి పట్టిస్తూ,
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతూ,
నువ్వు సాగిస్తున్న పాలన
నిజంగా హిట్లర్ పాలనే..

కానీ.. యాది ఉంచుకో రేవంత్ రెడ్డి,
నీ ఆరాధ్య దైవమైన హిట్లర్‌కూ
ఓటమి తప్పలేదు..
ప్రజల ఆగ్రహ జ్వాలల్లో
చరిత్రలో కలిసిపోక తప్పలేదు..

తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ,
తెలంగాణ బిడ్డల ఉద్యమాల ఉప్పెనలో,
నీ అధికారం కొట్టుకుపోక తప్పదు.
ప్రజల తీర్పు ముందు ఏ నియంతృత్వానికైనా తలవంచక తప్పదు
ఇట్లు, రాజ్యాంగబద్ధమైన నిబద్ధతతో..

మీ
డాక్టర్ శ్రవణ్ కుమార్ దాసోజు
జై కేసీఆర్..  జై తెలంగాణ

Advertisement
Advertisement