త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు

శాసనమండలిలో మార్షల్స్ మోహరింపు, సీఎం సోదరుడి భూముల ఇష్యూపై బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని విమర్శించారు.

J

Telangana | Published On Sep 10, 2026, 3.19 pm IST

S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు
Advertisement
  • శాసనమండలి బయట పోలీసులు, లోపల మార్షల్స్‌తో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని మధుసూదనాచారి విమర్శ
  • సీఎం తమ్ముడికి కారుచౌకగా కట్టబెట్టిన కోట్ల విలువైన భూముల వ్యవహారంపై చర్చకు ప్రభుత్వం నిరాకరణ
  • రైతుల సాగునీరు, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర ప్రజా సమస్యలపై చర్చించే ఉద్దేశం సర్కార్‌కు లేదని మండిపాటు
  • డ్రెస్ కలర్ సాకుతో ఇద్దరు బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని హెచ్చరిక

S.Madhusudhana Chary | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ శాసనమండలి (Legislative Council) సమావేశాలు జరుగుతున్న తీరుపై ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కౌన్సిల్ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, పోలీసుల సాయంతో సభను నెట్టుకొస్తోందని ఘాటుగా విమర్శించారు.

మండలి సమావేశాలు చూస్తుంటే "గుడ్డెద్దు పోయి చేనులో పడ్డట్టు" ఉందని ఆయన ఎద్దేవా చేశారు. సభ బయట పోలీసులు, లోపల మార్షల్స్ (Marshals) ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల నిరసన గొంతు నొక్కేందుకు సభలో ఏకంగా 40 మంది మార్షల్స్‌ను మోహరించడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట అని విమర్శించారు. కౌన్సిల్ చరిత్రలో ఏనాడూ ఇంతలా పోలీసులను మోహరించిన దాఖలాలు లేవన్నారు.

ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై చర్చించే చిత్తశుద్ధి ఏమాత్రం లేదని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి తమ్ముడికి కోట్ల రూపాయల విలువైన భూములను అతి తక్కువ ధరకే కట్టబెట్టారని, దీనిపై చర్చ జరగాలని తాము వాయిదా తీర్మానం ఇస్తే దానిని తిరస్కరించారని మండిపడ్డారు. ఎజెండాలో (Agenda) లేని అంశాలను సభలో చర్చిస్తున్నారని, అసలు బిజినెస్‌లో (Business) ఏముందో కూడా సభ్యులకు చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒకవైపు సాగునీటి కోసం రైతన్నలు అవస్థలు పడుతున్నారని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. సెక్షన్ 22A పై ప్రజల్లో ఉన్న అనేక అపోహలను కూడా సభలో చర్చించనీయకుండా తమను అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. నల్ల రంగు దుస్తులు వేసుకున్నారని తమ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులను అన్యాయంగా సస్పెండ్ (Suspend) చేశారని, తాను పింక్ కలర్ చొక్కా వేసుకుంటే తనను కూడా సభలో అడ్డుకున్నారని మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో చేసినట్టే రేపు ప్రజాక్షేత్రంలో కూడా ఈ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.

Advertisement
Advertisement