త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Boddemma Festival | రేప‌ట్నుంచి ‘బొడ్డెమ్మ’ పండుగ‌

Boddemma Festival | తెలంగాణకు ఓ ప్ర‌త్యేక‌మైన సంస్కృతి ఉంది. ప్ర‌కృతిలో ల‌భించే ప్ర‌తి పువ్వును కూడా పూజించే సంప్ర‌దాయం తెలంగాణ ప్ర‌త్యేక‌త‌. ఈ సంప్ర‌దాయ పండుగ‌ల్లో బొడ్డెమ్మ‌కు, బ‌తుక‌మ్మ‌కు ఎంతో ప్రాధాన్య‌త కూడా ఉంది. క‌న్నెపిల్ల‌లు, మ‌హిళ‌లు ఎంతో ఇష్టంగా బొడ్డెమ్మ‌, బ‌తుక‌మ్మ పండుగ‌ల‌ను నిర్వ‌హిస్తారు.

S

Telangana | Published On Sep 30, 2026, 4.28 pm IST

Boddemma Festival | రేప‌ట్నుంచి ‘బొడ్డెమ్మ’ పండుగ‌
Advertisement

9 రోజుల పాటు ఘ‌నంగా వేడుక‌లు
మంచి భ‌ర్త రావాల‌ని క‌న్నెపిల్ల‌ల వేడుకోలు
బొడ్డెమ్మ అనంత‌రం బ‌తుక‌మ్మ పండుగ ప్రారంభం

Boddemma Festival | త్రినేత్ర న్యూస్ : తెలంగాణకు ఓ ప్ర‌త్యేక‌మైన సంస్కృతి ఉంది. ప్ర‌కృతిలో ల‌భించే ప్ర‌తి పువ్వును కూడా పూజించే సంప్ర‌దాయం తెలంగాణ ప్ర‌త్యేక‌త‌. ఈ సంప్ర‌దాయ పండుగ‌ల్లో బొడ్డెమ్మ‌కు, బ‌తుక‌మ్మ‌కు ఎంతో ప్రాధాన్య‌త కూడా ఉంది. క‌న్నెపిల్ల‌లు, మ‌హిళ‌లు ఎంతో ఇష్టంగా బొడ్డెమ్మ‌, బ‌తుక‌మ్మ పండుగ‌ల‌ను నిర్వ‌హిస్తారు. బ‌తుక‌మ్మ పండుగ‌కు ముందు.. మ‌రి ముఖ్యంగా క‌న్నెపిల్ల‌లు మంచి మొగుడు దొర‌కాల‌ని బొడ్డెమ్మ పండుగ‌ను జ‌రుపుకుంటారు. 9 రోజుల పాటు బొడ్డెమ్మ వేడుక‌ల‌ను నిర్వ‌హించి.. ఆ మ‌రుస‌టి రోజు నుంచి బతుక‌మ్మ పండుగ‌ను జ‌రుపుకుంటారు.

బాధ్రపద మాసంలో వచ్చే మహాలయ అమావాస్యకు ముందు, బహుళపంచమి నుంచి 9 రోజుల పాటు ఈ పండుగను క‌న్నెపిల్ల‌లు జరుపుకుంటారు. మరికొంతమంది అయితే 5 రోజులు, మూడు రోజులు దశమి, ద్వాదశి నుంచి జ‌రుపుకుంటారు. ఈ పండుగను బొడ్డెమ్మల పున్నమి అని కూడా పిలుస్తారు. ప్రధానంగా ఈ పండుగను పెండ్లి కాని అమ్మాయిలు చేస్తుంటారు. క‌న్నెపిల్ల‌లు అయితే మంచి భర్త రావాలని దేవుడిని కోరుకుంటారు.

అయితే ఆయా ప్రాంతాల‌ను బ‌ట్టి బొడ్డెమ్మ నిర్మాణం మారుతూ ఉంటుంది. బొడ్డెమ్మ తయారుచేసే విధానాల్లో ఐదు రకాలుంటాయి. చేసే విధానాన్ని బట్టి ఆ బొడ్డెమ్మలకు పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ, అంతరాల బొడ్డెమ్మ అని ఐదు రకాలుగా బొడ్డెమ్మలని పిలుస్తారు.

బొడ్డెమ్మ పండుగ మూలాలు

బొడ్డెమ్మలో బొడ్డ అనే పదానికి అత్తి చెట్టు/ లేదా మేడిచెట్టు/ ఔదుంబర వృక్షం అని కూడా పేరు. ఈ చెట్టును పూజించడానికి కారణం ఎన్నో ఔషధ గుణాలు ఇందులో ఉంటాయి. వివిధ రకాల అనారోగ్య సమస్యలను ఇది క్రమంగా దూరం చేస్తుంది. ప్రధానంగా సంతాన సాఫల్యానికి, మహిళల్లో వచ్చే పలు రోగాలకు ఇది దివ్యౌషధం. ప్రకృతికి, స్త్రీ జీవితానికి గల సంబంధాన్ని వివరించేలా ఈ పండుగ నిర్వహిస్తారు.

ఏయే జిల్లాల్లో బొడ్డెమ్మ ఆడుతారంటే..?

ఖమ్మం జిల్లాలోని గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న కొత్తగూడెం భద్రాద్రి వైపు, మహబూబాబాద్‌లో కలిసిన ఖమ్మం జిల్లా మండలాల్లో తెలంగాణ సంస్కృతితో మమేకమైన ప్రాంతాల్లో ఈ బొడ్డెమ్మ పండుగ చేసుకుంటారు.ఈ జిల్లాలో గిరిజన ప్రాంతాలన్నీ దాదాపుగా దట్టమైన అడవుల మధ్యే ఉండటం గమనార్హం. ఈ ప్రాంతాల్లో నివసించే వారికి ఏయే చెట్టు ఎలాంటి అనారోగ్యం పోగొడుతుందో తెలుసు. ఆరోగ్యపరమైన విషయాలకు, అటవీ ప్రాంతంలోని చెట్లు ఎలా ఉపయోగపడుతాయో వారికి బాగా తెలుసు. అందుకే వారిలో కొందరు ఈ పండుగను చేసుకుంటారు. ఉమ్మడి వరంగల్, క‌రీంన‌గ‌ర్‌ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ బొడ్డెమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

పీట బొడ్డెమ్మనే ఎక్కువ‌

చాలా మంది పీట బొడ్డెమ్మ‌ను త‌యారు చేస్తారు. ఇందుకు చ‌తురస్రాకారంలో ఉన్న చెక్క పీట అవ‌స‌రం. ఇక అడ‌వి నుంచి పుట్ట‌మ‌న్ను తీసుకురావాల్సి ఉంటుంది. పిండిల క‌లిపి పీట మీద గుండ్రంగా ఐదు వ‌రుస‌లుగా పేర్వాలి. పై దాకా గోపురం ఆకారంలో వచ్చేలా చేయాలి. ఆ పైన ఓ చిన్న గిన్నె, అందులో పసుపు గౌరమ్మను పెడుతారు. ఈ విధంగా బొడ్డెమ్మను తయారు చేసిన తర్వాత ఎవరికైతే ఆనవాయితీ ఉంటుందో వాళ్ల ఇంటి ఆవరణలో ఊడ్చి శుభ్రం చేసి ఎర్రమట్టితో అలికి, మంచిగా ముగ్గులు వేస్తారు. మధ్యలో ఈ బొడ్డెమ్మను పెట్టి, రకరకాల పూలతో అలంకరించి, కన్నెపిల్లలు బాలికలు చుట్టూ తిరుగుతూ ‘బొడ్డెమ్మ బొడ్డెమ్మా కోల్‌- బిడ్డాలెందరూ కోల్‌’ అంటూ కోలాటం ఆడుతారు. చివరలో ‘నిద్రపో బొడ్డెమ్మ నిద్ర పోవమ్మా. నిద్రాకు నూరేండ్లు-నీకు వెయ్యేండ్లు. నిను గన్న తల్లీకీ నిండా నూరేండ్లు’ అంటూ పాడి తర్వాత బొడ్డెమ్మను జాగ్రత్తగా తీసి దేవుని ముందు పెడతారు. ఇలా 9 రోజుల పాటు ఆడి చెరువు దగ్గరికి తీసుకువెళ్తారు. అక్కడ చెక్కపీట మీద నుంచి బొడ్డెమ్మను తీసి నీటిలో నిమజ్జనం చేస్తూ ‘పోయి రా బొడ్డెమ్మ పోయి రావమ్మా’ అంటూ బొడ్డెమ్మతో పాటు ముందురోజుల వాడిపోయిన పూలను కూడా చెరువులో నిమజ్జనం చేస్తారు. ఇక ఆ మ‌రుస‌టి రోజు నుంచి బతుక‌మ్మ వేడుక‌లు ప్రారంభ‌మ‌వుతాయి.

Advertisement
Advertisement