త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP | నెక్స్ట్ తెలంగాణ.. 2028/29 ఎన్నికలపై గురి పెట్టిన బీజేపీ

BJP | బెంగాల్ దక్కింది. ఇక తెలంగాణే తరువాయి. ఆరు నూరైనా 2028 లేదా 2029 లో జరిగే శాసనసభ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించాల్సిందే... ఈ లక్ష్యంతో బీజేపీ ఇప్పటి నుంచే ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా.. బెంగాల్‌లో బీజేపీ గెలుపు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ సునీల్ బ‌న్సల్‌ను ఫుల్ టైం ఇంచార్జిగా, ఛత్తీస్‌గ‌ఢ్‌లో కాషాయ దళం గెలుపు కోసం ఆ రాష్ట్ర ఇంచార్జిగా పనిచేసిన అభయ్ పాటిల్‌ను సహ ఇంచార్జిగా నియమించింది.

S

Telangana | Published On Sep 23, 2026, 7.11 pm IST

BJP | నెక్స్ట్ తెలంగాణ.. 2028/29 ఎన్నికలపై గురి పెట్టిన బీజేపీ
Advertisement

పశ్చిమ బెంగాల్ స్ఫూర్తితో
తెలంగాణలో సరికొత్త వ్యూహాలు
పార్టీని బలోపేతం చేసేందుకు
పెద్ద ఎత్తున ప్రక్షాళన
పార్టీ ఫుల్ టైమ్ ఇంచార్జిగా
బీజేపీ ఎలక్షన్ ఇంజనీర్ సునీల్ బ‌న్సల్
సహ ఇంచార్జిగా అభయ్ పాటిల్

BJP | త్రినేత్ర న్యూస్ : బెంగాల్ దక్కింది. ఇక తెలంగాణే తరువాయి. ఆరు నూరైనా 2028 లేదా 2029 లో జరిగే శాసనసభ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించాల్సిందే... ఈ లక్ష్యంతో బీజేపీ ఇప్పటి నుంచే ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా.. బెంగాల్‌లో బీజేపీ గెలుపు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ సునీల్ బ‌న్సల్‌ను ఫుల్ టైం ఇంచార్జిగా, ఛత్తీస్‌గ‌ఢ్‌లో కాషాయ దళం గెలుపు కోసం ఆ రాష్ట్ర ఇంచార్జిగా పనిచేసిన అభయ్ పాటిల్‌ను సహ ఇంచార్జిగా నియమించింది. ఏ విషయాన్నైనా సరే.. వీరిద్దరూ పార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు, హోం మంత్రి అమిత్ షాకు నేరుగా రిపోర్ట్ చేసే వెసులుబాటు కల్పించారని సమాచారం. కాగా, సునీల్ బ‌న్సల్, అభయ్ పాటిల్‌లు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. వారి క్షేత్రస్థాయి వ్యూహాల వల్లనే 8 ఎంపీ సీట్లు దక్కించుకోగలిగామని పార్టీ అంతర్గత సమావేశాల్లో కాషాయ నేతలు అభిప్రాయపడడం గమనార్హం.

ఎవరీ సునీల్ బ‌న్సల్..?

సునీల్ బన్సల్.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు. బీజేపీ ఆయనను ఎలక్షన్ ఇంజినీర్‌గా పిలుచుకుంటూ ఉంటుంది. యూపీ, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీని గెలిపించడంలో ఆయనదే ప్రధాన పాత్ర అని చెబుతుంటారు. 1990 నుంచి ఆర్ఎస్ఎస్‌లో ప్రచారక్‌లో చేరిన ఆయన తొలిసారిగా 2014లో ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో.. బీజేపీ గెలుపు కోసం పనిచేశారు. దాంతో ఆ ఎన్నికల్లో 80కి గాను బీజేపీ 73 ఎంపీ స్థానాల్లో గెలిచింది. అక్కడ 2017, 2022లో యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం మళ్లీ మళ్లీ గెలిచేందుకు ఆయన వ్యూహాలే కారణమని పార్టీ శ్రేణులు విశ్వసిస్తాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాలో 21కి గాను 20 ఎంపీ స్థానాలు బీజేపీ గెలిచినా.. బెంగాల్‌లో మమతా బెనర్జీని గద్దె దింపినా.. సునీల్ బన్సల్ వ్యూహాలే కారణమని కీలక నేతలు ఆయనకు కితాబునిస్తుంటారు. ఇటీవల ఒకానొక దశలో.. బీజేపీ అధ్యక్ష పదవి కూడా బన్సల్‌కే ఇవ్వాలన్న చర్చ కూడా పార్టీలో జరిగింది. కాగా మరో సహ ఇంచార్జి అభయ్ పాటిల్ కూడా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. 2023లో ఛత్తీస్‌గ‌ఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ గెలుపుకు పాటిల్ రాష్ట్ర ఇంచార్జి స్థాయిలో తీవ్రంగా శ్రమించారు. వీరిద్దరి పనితీరుపై అటు ప్రధాన మంత్రి మోదీకి, ఇటు హోం మంత్రి అమిత్ షాకు ప్రగాఢమైన నమ్మకం ఉండడంతో తెలంగాణ ఎన్నికలను వీరికి అప్పజెప్పారని బీజేపీ రాష్ట్ర ప్రధాన నేత ఒకరు వ్యాఖ్యానించారు. తెలంగాణలో వచ్చే శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు వీరిద్దరు ఫుల్ టైం బాధ్యతలు తీసుకోనున్నారు.

బెంగాల్ వ్యూహం.. తెలంగాణలో సాధ్యమేనా?

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ను మట్టి కరిపించి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే బీజేపీ అందుకున్న నినాదం నెక్స్ట్ తెలంగాణ. ఆ రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడడంతో ఆ గెలుపు తెలంగాణలో బీజేపీ శ్రేణుల్లో కూడా ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం సునీల్ బన్సల్‌ను, అభయ్ పాటిల్‌లను ఫుల్ టైం వర్కర్లుగా రంగంలోకి దించింది. కాగా.. తెలంగాణలో 8 మంది ఎంపీలు గెలిచినా వారందరూ తలో దిక్కులా వ్యవహరిస్తున్నారనే అపవాదు ఉంది. ఒకరిద్దరు ఎంపీలు సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా వ్యవహరించడం.. మరికొందరు బీఆర్ఎస్‌కు అనుకూలంగా ప్రవర్తించడం వంటి ఆరోపణలు అధిష్టానానికి చేరాయి. అంతే కాకుండా.. ఎంపీలందరూ అనేక విషయాల్లో ఒకరినొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో తెలంగాణ నేతల్లో ఐక్యత లేదనే విషయంపై ఢిల్లీలో ఉన్న బాస్‌లకు స్పష్టత వచ్చిందని సమాచారం. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నదంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో గెలిచి తీరాలని బీజేపీ భావిస్తున్నది. అందుకోసమే ఎన్నికల వ్యూహకర్తలను ఇప్పటి నుంచే రంగంలోకి దింపింది. కాగా.. బెంగాల్‌లో బీజేపీ గెలిచే సమయానికి కేవలం ద్విముఖ పోటీ మాత్రమే ఉంది. పైగా మమత బెనర్జీని ఓడించేందుకు అన్ని రాష్ట్రాల బీజేపీ నేతలు శ్రమించారు. వరుసగా 3 దఫాల పాలనతో ప్రజల్లో.. తృణమూల్‌పై ఏర్పడిన నిరాసక్తత కూడా బీజేపీకి కలిసొచ్చింది. అయితే.. క్షేత్రస్థాయిలో బీజేపీ కన్నా బలంగా కనిపిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఢీ కొట్టాలంటే తెలంగాణకు అవసరమైన వ్యూహాలు ప్రత్యేకంగా ఉండాల్సిందే. బీజేపీ పార్టీకి ఆయువు పట్టులాంటి అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఒకరైన బీఎల్ సంతోష్.. తెలంగాణలో పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించి విఫలమైన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు కొత్తగా బాధ్యతలు తీసుకుంటున్న సునీల్ బన్సల్‌కు తెలంగాణ ప్రస్తుతం అగ్ని పరీక్షే.

Advertisement
Advertisement