త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ED Notices to Arikepudi Gandhi | ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి బిక్ షాక్‌.. నోటీసులు జారీ చేసిన‌ ఈడీ

ED Notices to Arikepudi Gandhi | శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి బిగ్ షాక్ త‌గిలింది. శుక్ర‌వారం ఈడీ ఆయ‌న‌కు నోటీసులు జారీ చేసింది.

S

Telangana | Published On Sep 25, 2026, 1.03 pm IST

ED Notices to Arikepudi Gandhi | ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి బిక్ షాక్‌.. నోటీసులు జారీ చేసిన‌ ఈడీ
Advertisement
  • మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఎల్లుండి విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశాలు

ED Notices to Arikepudi Gandhi | త్రినేత్ర న్యూస్: శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి బిగ్ షాక్ త‌గిలింది. శుక్ర‌వారం ఈడీ ఆయ‌న‌కు నోటీసులు జారీ చేసింది. మ‌నీలాండ‌రింగ్ కేసులో రూ.842 కోట్ల మోసం జరిగినట్లు ఈడీ అంచనా వేసింది. ఎల్లుండి హాజరు ఈడీ ఎదుట హాజ‌రు కావాల‌ని ఆదేశాలిచ్చింది. ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయలేదంటూ కొనుగోలుదారుల ఫిర్యాదులు చేయ‌గా సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై పోలీసులు మనీలాండరింగ్ కేసు న‌మోదు చేశారు.

సాహితి ఇన్‌ఫ్రాటెక్‌ ప్రాజెక్టుల పేరుతో కొనుగోలుదారుల నుంచి భారీగా నిధులు సేకరించి మోసం చేశారనే ఆరోపణలపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. దీంతో ఈడీ మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేపట్టింది. సాహితి ఇన్‌ఫ్రాటెక్‌ ప్రాజెక్టుల్లో తొలుత సుమారు రూ.248 కోట్ల మేర మోసం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. తదుపరి దర్యాప్తులో ఈ మొత్తం సుమారు రూ.842 కోట్లకు చేరినట్లు ఈడీ అంచనా వేసింది. ఫ్లాట్లు, విల్లాలు నిర్మించి ఇస్తామని చెప్పి ప్రీ-లాంచ్‌ ఆఫర్ల పేరుతో కొనుగోలుదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు దండుకున్న‌ట్లు ఈడీ ఆరోపించింది.

కొంత మొత్తాన్ని సంస్థకు సంబంధించిన వ్యక్తిగత, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు ఈడీ పేర్కొంది. దాదాపు రూ.126 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయని వివ‌రించింది.

రూ.2.1 కోట్ల లావాదేవీలపై ఆరా..

ఈ కేసులో అరికెపూడి గాంధీకి సంబంధించిన బ్యాంకు ఖాతాల ద్వారా సాహితి ఇన్‌ఫ్రా నుంచి సుమారు రూ.2.1 కోట్లు బదిలీ అయినట్లు గుర్తించినట్లు పేర్కొంది. మనీలాండరింగ్‌ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఆస్తులు, లావాదేవీలపైనా ఈడీ ప్ర‌త్యేక‌ దృష్టి సారించింది. ఇప్పటివరకు 56 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేసినట్లు వెల్ల‌డించింది. గతంలో సుమారు రూ.161 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసిన అధికారులు, మరో విడతలో రూ.12.6 కోట్ల విలువైన ఆస్తులనూ అటాచ్‌ చేసినట్లు పేర్కొన్నారు. బినామీ పేర్లతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ ఆరోప‌ణ‌లు చేసింది.

గ‌తంలో ఎండీ అరెస్టు..

సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ కేసులో సంస్థ ఎండీ బి.లక్ష్మీనారాయణ, మాజీ డైరెక్టర్‌ సందు పూర్ణచంద్రరావు తదితరులపై ప్ర‌స్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. సంస్థ ఎండీ బి.లక్ష్మీనారాయణను 2024, సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. సాహితీ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనల్లో కనిపించిన నటుడు జగపతిబాబును కూడా ఈడీ గతంలో సాక్షిగా విచారించినట్లు అధికారులు స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement