త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి 4 శాతానికి పెంచండి.. వీబీజీరాంజీతో రాష్ట్రాలపై ఆర్థికభారం: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka | పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి (PRLIS) జాతీయ హోదా క‌ల్పించాల‌ని, రీజిన‌ల్‌ రింగ్‌ రోడ్‌ (RRR) ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేయాల‌ని, హైదరాబాద్‌ మెట్రో (Hyderabad Metro)ఫేజ్‌-2కు త్వ‌ర‌గా అనుమ‌తులు ఇవ్వాల‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) కేంద్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.

G

Telangana | Published On Jan 11, 2026, 9.30 am IST

Bhatti Vikramarka | ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి 4 శాతానికి పెంచండి.. వీబీజీరాంజీతో రాష్ట్రాలపై ఆర్థికభారం: భట్టి విక్రమార్క
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి (PRLIS) జాతీయ హోదా క‌ల్పించాల‌ని, రీజిన‌ల్‌ రింగ్‌ రోడ్‌ (RRR) ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేయాల‌ని, హైదరాబాద్‌ మెట్రో (Hyderabad Metro)ఫేజ్‌-2కు త్వ‌ర‌గా అనుమ‌తులు ఇవ్వాల‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) కేంద్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎఫ్ఆర్‌బీఎం (FRBM) ప‌రిమితిని 4 శాతానికి పెంచాల‌ని, విద్య, వైద్యానికి సమీకరించే ఆర్థిక వనరులను రాష్ట్ర రుణపరిమితి నుంచి మినహాయించాలన్నారు. బడ్జెట్‌ ముందస్తు కసరత్తులో భాగంగా ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ నిర్వ‌హించిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో భ‌ట్టి విక్ర‌మార్క పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్రభుత్వ డిమాండ్లు వినిపించారు.

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేస్తున్న రాష్ట్రాలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేలా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3.5 శాతం నుంచి 4 శాతానికి పెంచాలని కోరారు. మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ఇస్తున్న 50 ఏండ్ల‌ వడ్డీలేని రుణాలను గ్రాంట్లుగా మార్చడంతోపాటు, ప్రస్తుతం ఇస్తున్న సాహాయాన్ని రెట్టింపుచేయాలన్నారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5.1 శాతంగా ఉంద‌ని, దానిని 10 శాతానికి పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పించార‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనపై పెట్టుబడుల రేటును 37 శాతం నుంచి 50 శాతానికి పెంచాల‌న్నారు. ఈ వెసులుబాటు కల్పించడానికి రాష్ట్రాల ఆర్థికలోటు పరిమితిని ఏడాదికి కనీసం 4 శాతానికి పెంచాలని విజ్ఞ‌ప్తి చేశారు.

రాష్ట్రానికి నిధులు ఇవ్వండి..

అదేవిధంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో త‌మ‌ ప్ర‌భుత్వం యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లను , అనేక సూపర్‌ స్పెషాలిటీ ద‌వాఖాన‌లు, మెడిక‌ల్ కాలేజీల‌ను ఏర్పాటుచేస్తుండ‌టంతో విద్య, వైద్య రంగాలకోసం సేకరించే ఆర్థిక వనరులను ఎఫ్‌ఆర్‌బీఎం నుంచి మినహాయించాల‌న్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, తెలంగాణకు సెమీకండక్టర్‌ ప్రాజెక్టు, ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ మంజూరుచేయాలన్నారు. దీనికోసం రంగారెడ్డి జిల్లా తాటిపర్తిలో భూమి సిద్ధంగా ఉందని చెప్పారు.

మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌కు రూ.14,100 కోట్లు, రేడియల్‌ రోడ్లకు రూ.45,000 కోట్లు, హైదరాబాద్‌ నుంచి ఫ్యూచర్‌ సిటీ మీదుగా అమరావతికి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణానికి రూ.17 వేల కోట్లు మంజూరు చేయాల‌న్నారు. వికారాబాద్‌ నుంచి కృష్ణా వరకు కొత్త రైల్వేలైన్‌ కోసం రూ.2,677 కోట్లు, హైదరాబాద్‌- చెన్నై హైస్పీడ్‌ రైల్‌కారిడార్‌ నిర్మాణానికి రూ.17,212 కోట్ల ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకోవాల‌న్నారు. రీజిన‌ల్‌ రింగ్‌ రోడ్‌ ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేయాలని, హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2పై త్వరగా నిర్ణయం తీసుకుని అనుమతులు ఇవ్వాల‌ని, హైదరాబాద్‌లో ఐఐఎం, జిల్లాల్లో కేంద్రీయ, జవహర్‌ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని, పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలకు విమానాశ్రయాలు మంజూరు చేయాల‌ని డిమాండ్ చేశారు. వీటికోసం బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించాల‌ని కోరారు.

వీబీజీరాంజీ భారం కేంద్ర‌మే భ‌రించాలి..

రాష్ట్ర, ఉమ్మడి జాబితాల్లోని అంశాలపై కేంద్ర ప్ర‌భుత్వం 20 శాతం కంటే ఎక్కువ‌గా ఖర్చు చేస్తున్న‌ద‌ని, దాంట్లో 25 శాతం తగ్గించి, తద్వారా మిగిలే రూ.2.21 లక్షల కోట్లను నేరుగా రాష్ట్రాలకు ఇవ్వాల‌న్నారు. సెస్‌లు, సర్‌ఛార్జీల ద్వారా కేంద్రానికి దాదాపు 20 శాతం ఆదాయాన్ని పన్నుల్లో చూపకపోవడంతో రాష్ట్రాల‌కు వాటా ద‌క్క‌డం లేద‌న్నారు. దీంతో ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు రావాల్సిన 41 శాతం వాటాకు బదులు 30 శాతమే అందుతున్న‌ద‌ని నిర్మ‌లా సీతారామ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిని సరిదిద్దడానికి రూ.1.55 లక్షల కోట్ల సర్‌చార్జీలను మౌలిక సదుపాయాల నిధికి మళ్లించి, రాష్ట్రాలకు అందించాలన్నారు. అలాకాని నేప‌థ్యంలో ప్రాథమిక పన్ను రేట్లలో కలిపి రాష్ట్రాలకు పంపిణీచేయాలి.

ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తెచ్చిన వీబీజీరాంజీ చట్టంవల్ల 90:10గా ఉన్న‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 60:40కి మారింద‌ని, దీనివల్ల రాష్ట్రాలపై ఆర్థికభారం పెరిగిపోతుందని చెప్పారు. సాధారణ కేటాయింపులకు మించి పనిదినాలు పెరిగితే ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మోయాల్సి వస్తుంద‌న్నారు. ఇది డిమాండ్‌కు తగ్గట్టు పని కల్పించడానికి తీవ్ర ఇబ్బందిగా మారుతుంది. ఈ అదనపు భారాన్ని కేంద్రమే భరించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement