త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | సామ్రాజ్య‌వాదుల కంటే బీజేపీ ప్ర‌మాద‌క‌రం: మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌

Bhatti Vikramarka | సామ్రాజ్య‌వాదుల కంటే బీజేపీ (BJP) ప్ర‌మాద‌క‌ర‌మ‌ని తెలంగాణ (Telangana) రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి (Deputy CM) భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) అన్నారు. జాతీయ‌ ఉపాధి హామీ చ‌ట్టం (MGNREGA)ను ర‌ద్దు చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోంద‌ని మండిప‌డ్డారు.

A

Telangana | Published On Jan 8, 2026, 4.33 pm IST

Bhatti Vikramarka | సామ్రాజ్య‌వాదుల కంటే బీజేపీ ప్ర‌మాద‌క‌రం: మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌
Advertisement

Bhatti Vikramarka | సామ్రాజ్య‌వాదుల కంటే బీజేపీ (BJP) ప్ర‌మాద‌క‌ర‌మ‌ని తెలంగాణ (Telangana) రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి (Deputy CM) భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) అన్నారు. జాతీయ‌ ఉపాధి హామీ చ‌ట్టం (MGNREGA)ను ర‌ద్దు చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోంద‌ని మండిప‌డ్డారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) విసృత స్థాయి సమావేశాన్ని గాంధీభ‌వ‌న్‌ (Gandhi Bhavan) లో గురువారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా విక్ర‌మార్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, సామాజిక, ఆర్థిక ,రాజకీయ సంస్కరణలు దేశంలో గొప్ప మార్పులు తెచ్చాయని చెప్పారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం ఒక్క కొత్త చట్టం తీసుకురాకపోగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన చట్టాలన్నింటిని రద్దు చేసే కార్యక్రమం చేపట్టిందని ఆరోపించారు. చివరకు దేశ స్వతంత్రాన్ని కూడా రద్దు చేస్తుంద‌ని అన్నారు. కొత్త ఉపాధి చట్టం రద్దు కోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిద్దామ‌ని పిలుపునిచ్చారు. ప్రభుత్వంలోని పెద్దలు అంతా ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటార‌ని స్ప‌ష్టం చేశారు.

బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కంటే ఆర్ఎస్ఎస్ భావజలం కలిగిన బిజెపి ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమని డిప్యూటీ సీఎం అన్నారు. దేశానికి దిశా నిర్దేశం చేసిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను రాష్ట్రంలోని ప్రజలందరికీ వివరించాలని పిలుపునిచ్చారు. కొత్త ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలని రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతున్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణేన‌ని చెప్పారు. దేశంలోని కోట్లాది ప్రజలకు ఉపాధి భద్రతను కల్పించేందుకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఉపాధి హామీ చట్టం రాకముందు 40 రూపాయలుగా ఉన్న రోజు కూలి ఒకేసారి వంద రూపాయలకు పెరిగిందన్నారు. వ్యవసాయ సీజన్లో 60 రోజులపాటు కొత్త ఉపాధి చట్టంలో ఉపాధి పనులకు అవకాశం లేకుండా పోయిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీంతో పేదలు పట్టణాలకు వలస పోయే ప్రమాదముంద‌ని అనుమానం వ్య‌క్తం చేశారు.
పాత చట్టంలో కాంట్రాక్టర్లకు స్థానం లేదు కానీ ఇప్పుడు కాంట్రాక్టులతో కలిసి పని చేసుకునేలా చట్టంలో మార్పు తీసుకొచ్చార‌ని ఆరోపించారు. దీని ద్వారా కార్మికులను కాంట్రాక్టర్లకు ధారాద‌త్తం చేసే కుట్రను బిజెపి ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. జాతీయ ఉపాధి హామీ చట్టం అంటే కేంద్రమే నిధులు ఇవ్వాలని, రాష్ట్రాల ద్వారా వచ్చిన పనులతో నిధులు కేటాయించాలని, కానీ 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రాలు అంటూ కొత్త నిబంధన తెచ్చార‌ని మండిప‌డ్డారు.

ఉత్తరాది రాష్ట్రాలు 100 రూపాయలు పన్ను కడితే కేంద్రం 300 రూపాయలు కేటాయిస్తుందని, అదే మన రాష్ట్రం వంద రూపాయలు కడితే తిరిగి కేంద్రం 45 రూపాయలు మాత్రమే కేటాయిస్తుందని భ‌ట్టి విక్రమార్క చెప్పారు. కాంగ్రెస్ బలంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో భారీ వ్యత్యాసం ఉంటుందని వివరించారు. కాంగ్రెస్ తెచ్చిన చట్టాలన్నింటిని వరుసగా రద్దు చేసే పనుల్లో బిజెపి ప్రభుత్వం ఉందని దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం, బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఉపాధి చట్టం దానివల్ల జరిగే నష్టాలు గ్రామ గ్రామానా వివరించాలని పిలుపునిచ్చారు. కొత్త ఉపాధి హామీ చట్టం రద్దు కోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement