త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | జూరాల ఆయ‌క‌ట్టు రైతుల అరెస్టు అత్యంత‌ దుర్మార్గం

KTR | జూరాల ప్రాజెక్టులో 9 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా కూడా విడుదల చేయకుండా కుంటి సాకులతో రేవంత్ సర్కారు పచ్చని పంటల ఉసురు తీస్తోందని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

S

Telangana | Published On Sep 21, 2026, 12.51 pm IST

KTR | జూరాల ఆయ‌క‌ట్టు రైతుల అరెస్టు అత్యంత‌ దుర్మార్గం
Advertisement
  • చుక్క నీరు విడుద‌ల చేయ‌క‌పోవ‌డం క్ష‌మించ‌రాని నేరం
  • కుంటిసాకుల‌తో ప‌చ్చ‌ని పంట‌ల ఉసురు తీస్తున్నరు
  • కాంగ్రెస్ స‌ర్కార్‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్ర‌హం

త్రినేత్ర‌.న్యూస్‌: జూరాల ప్రాజెక్టులో 9 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా కూడా విడుదల చేయకుండా కుంటి సాకులతో రేవంత్ సర్కారు పచ్చని పంటల ఉసురు తీస్తోందని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల‌ను, రైతుల‌ను అక్ర‌మంగా అరెస్టు చేయ‌డం అత్యంత దుర్మార్గ‌మ‌న్నారు. ఈమేర‌కు సోమ‌వారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

జూరాల ఆయకట్టుకు సాగునీరిచ్చి పంటలు కాపాడాలని డిమాండ్ చేసిన ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నేతలను, రైతులను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ అక్రమంగా నిర్బంధించడం రేవంత్ రాక్షస మనస్తత్వానికి నిదర్శనం. వందలాది రైతులను కూడా పోలీసులు అడ్డుకుని, నిర్భంధించడం రాష్ట్రంలో సాగుతున్న అణచివేతకు తాజా ఉదాహరణే సాక్ష్యం.

చీక‌టి ఆదేశాలిచ్చిండు..

కళ్ల ముందే పంటలు ఎండిపోయి అల్లాడుతున్న అన్నదాతల గోసను ప్రభుత్వం తీర్చాల్సిందిపోయి, న్యాయమైన డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన రైతులను, బీఆర్ఎస్ శ్రేణులను అణచివేసేందుకు రేవంత్ సర్కారు కుట్ర చేస్తోంది. సీఎంగా విఫలమైన రేవంత్ తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే, జిల్లాలోని అనేక మండలాల్లో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలకు చీకటి ఆదేశాలిచ్చాడు.

ముమ్మాటికీ సిగ్గుమాలిన చర్య..

తమ పంటలను కాపాడుకునే ఏకైక తపనతో గుండెపగిలిన రైతులు జూరాల గేట్లు ఎత్తే ప్రయత్నం చేస్తే, వారిపై అక్రమ కేసులు బనాయించిన ప్రభుత్వం అన్నదాతలను అన్నివిధాలా అరిగోస పెడుతోంది. తెలంగాణ గడ్డపై ఉన్న జూరాల ప్రాజెక్టు పరిసరాల్లోకి రైతులు రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి, వందలాది పోలీసులను చుట్టుపక్కల మోహరించడం, వస్తున్న రైతులను అడ్డగించి అరెస్టులు చేయడం ముమ్మాటికీ సిగ్గుమాలిన చర్య.

తాగునీటికి కేవలం రెండు టీఎంసీలు సరిపోతాయని తెలిసినా, 9 టీఎంసీలున్న జూరాల నుంచి చుక్క నీరు విడుదల చేయకుండా ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు రైతులను సంక్షోభంలోకి నెట్టడం క్షమించరాని నేరం. అక్రమంగా అరెస్టు చేసిన రైతులను, బీఆర్ఎస్ నేతలను ప్రభుత్వం విడుదల చేయడంతో పాటు జూరాల ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీరు రిలీజ్ చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement