త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummal Nageshwar Rao | వ్య‌వ‌సాయాన్ని లాభసాటిగా మార్చుతాం.. రైతుల ఆదాయం పెంచుతాం..

Tummal Nageshwar Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి, రైతుల ఆదాయాన్ని పెంచి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు.

S

Telangana | Published On Nov 6, 2026, 5.30 pm IST

Tummal Nageshwar Rao | వ్య‌వ‌సాయాన్ని లాభసాటిగా మార్చుతాం.. రైతుల ఆదాయం పెంచుతాం..
Advertisement

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తాం
నవంబర్ 7 నుంచి 9 వరకు హకీంపేటలో మెగా రైతు మేళా
150 ప్రదర్శన స్టాళ్లు.. 10 జిల్లాల నుంచి 50 వేల మంది రైతుల హాజరు
ల‌గచర్లలో ఎకో పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీకి సీఎం శంకుస్థాపన
మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర్ రావు వెల్ల‌డి

Tummal Nageshwar Rao | త్రినేత్ర న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి, రైతుల ఆదాయాన్ని పెంచి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు.

ఇందులో భాగంగానే ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం హకీంపేటలో మూడు రోజుల పాటు మెగా రైతు మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. నవంబర్ 7న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ మేళా ప్రారంభం కానుందని తెలిపారు. ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రిగారు రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రగతిశీల రైతులతో ముఖాముఖి చర్చలు జరపడమే కాకుండా పారిశ్రామికవేత్తలతోనూ సమావేశమవుతారని వివరించారు.

నవంబర్ 8న ముఖ్యమంత్రి హకీంపేటలో స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమవుతారని, అనంతరం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. నవంబర్ 9న పది జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది రైతులు పాల్గొనే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు.

రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం, వ్యవసాయంలో వస్తున్న నూతన ఆవిష్కరణలను పరిచయం చేయడమే మెగా రైతు మేళా ప్రధాన ఉద్దేశమని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకువస్తున్నామని తెలిపారు.

మెగా రైతు మేళాలో ఏర్పాటు చేస్తున్న 150 ప్రదర్శన స్టాళ్ల ద్వారా రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలు, డ్రోన్లు, నూతన సాగు పద్ధతులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై ప్రత్యక్ష అవగాహన కలుగుతుందని మంత్రి తెలిపారు. శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చలు, ప్రగతిశీల రైతుల అనుభవాలు, విజయగాథలు ఇతర రైతులకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.

రైతుల ఆదాయం పెరగాలి.. వ్యవసాయం లాభసాటిగా మారాలి.. రైతు కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. సాగు ఖర్చులు తగ్గించి, రైతులు పండించిన పంటలకు మంచి ధర, విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించినప్పుడే నిజమైన రైతు అభ్యున్నతి సాధ్యమవుతుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా మార్కెట్ డిమాండ్‌ను గుర్తించి పంటల వైవిధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యాన పంటలు, ఆయిల్‌పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు. ఇప్పటికే ప్రభుత్వం వేరుశనగ, పెసళ్లు, పొద్దుతిరుగుడు, మినుములు, శనగ వంటి విత్తనాలను సబ్సిడీపై అందచేస్తున్నట్టు తెలిపారు.

తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. లగచర్ల పారిశ్రామిక కారిడార్‌లో ఎకో పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీకి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం ఆయిల్‌పామ్ రైతుల అభివృద్ధికి, రాష్ట్రంలో ప్రాసెసింగ్ పరిశ్రమల విస్తరణకు దోహదపడుతుందని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించే పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటైతే రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు లభించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని వివరించారు.

 

Advertisement
Advertisement