Bhatti Vikramarka | పాత బస్తీ అభివృద్ధికి భారీగా నిధుల కేటాయింపు
Bhatti Vikramarka | మైనార్టీల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వారి సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
మైనార్టీల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట
విద్య, సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం
హజ్‌హౌస్ పక్కన అసంపూర్తి భవన నిర్మాణానికి రూ.25 కోట్లు
మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు మరింత విస్తృతం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి
Bhatti Vikramarka | త్రినేత్ర న్యూస్ : మైనార్టీల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వారి సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ అవసరమైన నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. మైనార్టీ విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడంతో పాటు వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు.

గత అసెంబ్లీ సమావేశంలో మైనార్టీల అభ్యున్నతి గురించి సమీక్ష నిర్వహిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీలో భాగంగా శుక్రవారం ప్రజాభవన్‌లో మైనార్టీ సంక్షేమ శాఖపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ తో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మైనార్టీల విద్యాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, విద్యాసంస్థల నిర్మాణాలు, స్టడీ సర్కిళ్ల ఏర్పాటు, ఓల్డ్ సిటీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు. మైనార్టీలకు విద్యా అవకాశాలను మరింత విస్తృతం చేసేందుకు నిధుల విడుదలలో ఎలాంటి జాప్యం, ఆంక్షలు ఉండబోవని భరోసా ఇచ్చారు.
మైనార్టీ విద్యార్థుల కోసం స్టడీ సర్కిల్
నాంపల్లిలోని హజ్‌హౌస్ పక్కన కొన్నేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన బహుళ అంతస్తుల భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. వివిధ రహదారుల విస్తరణ పనుల కోసం వినియోగించిన వక్ఫ్ భూములకు సంబంధించి జీహెచ్ఎంసీ నుంచి వక్ఫ్ బోర్డుకు రావాల్సిన నిధుల్లో రూ.25 కోట్లను ఈ భవన నిర్మాణం కోసం కేటాయించాలని ఆదేశించారు. నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ భవనంలో మైనార్టీ విద్యార్థుల కోసం స్టడీ సర్కిల్‌తో పాటు మైనార్టీ సంక్షేమ శాఖకు చెందిన వివిధ కార్యాలయాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం ఉండదు
విద్యాసంస్థల భవన నిర్మాణాలకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం ఉండదని స్పష్టం చేశారు. మైనార్టీ విద్యార్థుల విద్యాభివృద్ధికి దోహదపడే పాఠశాలలు, స్టడీ సర్కిళ్లు, ఇతర విద్యాసంస్థలకు అవసరమైన నిధులను సకాలంలో విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. మొఘల్‌పురా, బండ్లగూడ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన రెండు స్టడీ సర్కిళ్లకు సంబంధించి ఉన్న అడ్డంకులను తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. ఈ రెండు ప్రాంతాల్లో స్టడీ సర్కిళ్ల నిర్వహణకు అవసరమైన భవనాలను అందించేందుకు అక్బరుద్దీన్ ఒవైసీ సంసిద్ధత వ్యక్తం చేయగా, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారికంగా సమర్పించాలని కోరారు.
ఓవర్సీస్ జాబితాలో ఈజిప్ట్, సౌదీ అరేబియా
మైనార్టీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం పరిధిని విస్తరిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ పథకం కింద ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అర్హులైన విద్యార్థులు వెళ్లగలిగే దేశాల జాబితాలో ఈజిప్ట్, సౌదీ అరేబియాలను చేర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఈ సమావేశంలో శాసనసభలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, కార్యదర్శి బి. షఫీఉల్లా, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. అకౌంట్ లేని వారికీ ఈవెంట్ ఆహ్వానాలు..
- ●IND Vs NZ ODI | రేపు న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. మ్యాచ్‌కు వానగండం..?
- ●FMG Doctors | ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ డాక్టర్లపై పోలీసుల దాడి
- ●Godavari Pushkaralu 2027 | గోదావరి పుష్కరాలు 2027: పనుల్లో అలసత్వం వద్దు.. ధర్మపురిలో రూ.226 కోట్లతో మాస్టర్ ప్లాన్
- ●Cardiac Arrest | క్లాస్ రూమ్‌లో కుప్పకూలి.. గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి
- ●Gold Price | బంగారం ధరలకు రెక్కలు..? రూ.1.68 లక్షలకు చేరుతుందా..?

WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. అకౌంట్ లేని వారికీ ఈవెంట్ ఆహ్వానాలు..

IND Vs NZ ODI | రేపు న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. మ్యాచ్‌కు వానగండం..?

FMG Doctors | ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ డాక్టర్లపై పోలీసుల దాడి

Godavari Pushkaralu 2027 | గోదావరి పుష్కరాలు 2027: పనుల్లో అలసత్వం వద్దు.. ధర్మపురిలో రూ.226 కోట్లతో మాస్టర్ ప్లాన్




