త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND Vs NZ ODI | రేపు న్యూజిలాండ్‌తో రెండో వ‌న్డే.. మ్యాచ్‌కు వాన‌గండం..?

IND Vs NZ ODI | భారత్‌-న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌కు వాన‌గండం పొంచి ఉన్న‌ది. తొలి వన్డేకు వర్షం అంతరాయం కలిగించగా.. తాజాగా రెండో మ్యాచ్‌పైనా నీలినీడలు కమ్ముకున్నాయి. శనివారం వెల్లింగ్టన్‌లోని హెన్రీ స్టేడియం వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి. శుక్రవారం కురిసిన భారీ వర్షం కారణంగా ఇరు జట్ల ప్రాక్టీస్‌ సెషన్లకు అంతరాయం ఏర్పడింది.

P

Sports | Published On Nov 6, 2026, 5.13 pm IST

IND Vs NZ ODI | రేపు న్యూజిలాండ్‌తో రెండో వ‌న్డే.. మ్యాచ్‌కు వాన‌గండం..?
Advertisement

IND Vs NZ ODI | భారత్‌-న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌కు వాన‌గండం పొంచి ఉన్న‌ది. తొలి వన్డేకు వర్షం అంతరాయం కలిగించగా.. తాజాగా రెండో మ్యాచ్‌పైనా నీలినీడలు కమ్ముకున్నాయి. శనివారం వెల్లింగ్టన్‌లోని హెన్రీ స్టేడియం వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి. శుక్రవారం కురిసిన భారీ వర్షం కారణంగా ఇరు జట్ల ప్రాక్టీస్‌ సెషన్లకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం రోజు తొలి భాగంలో వెల్లింగ్టన్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో ఇరు జట్ల ప్రాక్టీస్‌ షెడ్యూళ్లలో మార్పులు చేయాల్సి వచ్చింది. బేసిన్‌ రిజర్వ్‌లో ప్రాక్టీస్‌ చేయాల్సి ఉండగా.. న్యూజిలాండ్‌ జట్టు వెల్లింగ్టన్‌ కాలేజ్‌ ఇండోర్‌ సదుపాయంలో సాధన చేసింది. మరోవైపు వర్షం, మైదాన పరిస్థితుల కారణంగా భారత జట్టు ప్రాక్టీస్‌ను పూర్తిగా రద్దు చేసుకుంది.

60 శాతం వర్ష సూచన

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం శనివారం మ్యాచ్‌ జరిగే సమయంలోనూ వర్షం పడే అవకాశాలున్నాయి. రోజులో తొలి భాగంలో 60 శాతం, రెండో భాగంలో 55 శాతం వర్ష సూచన ఉన్నట్లు సమాచారం. దీంతో మ్యాచ్‌కు వరుణుడి అంతరాయం తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తొలి వన్డే వర్షం కారణంగా డక్‌వర్త్‌ లూయిస్‌ స్టెర్న్‌ (డీఎల్‌ఎస్‌) పద్ధతిలో ముగియడంతో అభిమానులు రెండో మ్యాచ్‌ పరిస్థితులపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆక్లాండ్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలోనూ వర్షం రెండుసార్లు అంతరాయం కలిగించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 40.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌లోనూ వర్షం రెండుసార్లు ఆటకు బ్రేక్‌ వేసింది. దీంతో డీఎల్‌ఎస్‌ పద్ధతిలో భారత్‌ లక్ష్యాన్ని 32 ఓవర్లలో 143 పరుగులుగా నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని టీమిండియా 22.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్‌ కోహ్లి 51 బంతుల్లో 74 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు బౌలింగ్‌లో అన్షుల్‌ కాంబోజ్‌ సత్తాచాటాడు. 10 ఓవర్లు వేసి రెండు మెయిడిన్లతో 22 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడికి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

మ్యాచ్‌ ఎప్పుడంటే?

భారత్‌-న్యూజిలాండ్‌ రెండో వన్డే శనివారం (నవంబర్‌ 7) వెల్లింగ్టన్‌లోని హెన్రీ స్టేడియంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు టాస్‌ వేయనుండగా.. 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను భారత్‌లో సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ టీవీ ఛానెల్స్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నున్నాయి. అలాగే, మొబైల్‌, ఆన్‌లైన్‌ వీక్షకులు సోనీ లివ్‌ యాప్‌, వెబ్‌సైట్‌లో లైవ్‌ స్ట్రీమింగ్ చేయ‌నుంది. ఇదిలా ఉండ‌గా.. తొలి వన్డేలో వర్షం ఆటను ప్రభావితం చేయగా.. రెండో వన్డేపైనా అదే ముప్పు పొంచి ఉన్న‌ది. అభిమానులు మాత్రం వరుణుడు కరుణించి పూర్తి మ్యాచ్‌ జరిగేలా చూడాలని కోరుకుంటున్నారు.

Advertisement
Advertisement