త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummala Nageshwar Rao | రాష్ట్ర వ్య‌వ‌సాయ రంగానికి ఆధునిక సాంకేతిక‌త అందిస్తాం

Tummala Nageshwar Rao | తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు పెట్టుబడులు, పరిశోధన రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకునేందుకు జర్మనీ ఆసక్తి చూపింది.

S

Telangana | Published On Nov 25, 2026, 4.45 pm IST

Tummala Nageshwar Rao | రాష్ట్ర వ్య‌వ‌సాయ రంగానికి ఆధునిక సాంకేతిక‌త అందిస్తాం
Advertisement
తెలంగాణ‌తో క‌లిసి ప‌ని చేసేందుకు జ‌ర్మ‌నీ సంసిద్ధ‌త‌
ఫుడ్ ప్రాసెసింగ్, స్టోరేజీ, పరిశోధన రంగాల్లో సహకారంపై చర్చ
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాలని 
జర్మనీ ప్రతినిధులకు మంత్రి తుమ్మల ఆహ్వానం
సచివాలయంలో మంత్రి తుమ్మలతో జర్మనీ ప్రతినిధుల బృందం భేటీ 
Tummala Nageshwar Rao | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు పెట్టుబడులు, పరిశోధన రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకునేందుకు జర్మనీ ఆసక్తి చూపింది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును జర్మనీ ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది.
ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ రంగంలో అందుబాటులో ఉన్న అవకాశాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆధునిక వ్యవసాయ సాంకేతికత, వ్యాపార విస్తరణ, ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల బలోపేతంపై ప్రతినిధుల బృందంతో మంత్రి చర్చించారు.
తెలంగాణ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అధిగమించేందుకు జర్మనీ తమ వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని ప్రతినిధుల బృందం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వంతో పాటు భారత ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ వివిధ రంగాల్లో కలిసి పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్, ఆహార నిల్వ సదుపాయాలు (స్టోరేజీ), పరిశోధన, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ రంగాల్లో సహకారం అందించేందుకు ఆసక్తి చూపింది.
తెలంగాణలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, రానున్న రోజుల్లో జర్మనీకి చెందిన మరిన్ని వ్యాపార సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ నుంచి జర్మనీకి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచేందుకు అవసరమైన ప్రయత్నాలు చేయాలని జర్మనీ ప్రతినిధులను కోరారు.
భారత్–జర్మనీ మధ్య స్నేహపూర్వక సంబంధాలు, వ్యాపార భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని మంత్రి ఆకాంక్షించారు. తెలంగాణకు అవసరమైన ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు, ఇరు దేశాలకు ప్రయోజనం చేకూరేలా పరస్పర సహకారాన్ని విస్తరించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించిన మంత్రి తుమ్మల, రానున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026లో జర్మనీ ప్రతినిధుల బృందం పాల్గొని తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలని ఆహ్వానించారు.
ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌తో పాటు జర్మనీ రాయబార కార్యాలయం, న్యూఢిల్లీలో వ్యవసాయ, ఆహార విభాగం అధిపతి మిస్టర్ వోల్కర్ క్లిమా, జర్మనీలోని బీఎంఎల్‌ఈహెచ్ ద్వైపాక్షిక సహకార కార్యక్రమం డైరెక్టర్ డాక్టర్ ఆండ్రియాస్ గ్రామ్‌జో, ప్రాజెక్టు మేనేజర్ సబ్రినా లాండ్‌మన్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement