త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kishan Reddy | డ్రగ్స్ పేరుతో పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు

Kishan Reddy | డ్రగ్స్ పేరుతో దేశద్రోహ శక్తులు యువతను మత్తుకు బానిసలుగా మార్చి పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత కుటుంబాలకు, సమాజానికి దూరమవుతోందని అన్నారు.

S

Telangana | Published On Nov 25, 2026, 4.09 pm IST

Kishan Reddy | డ్రగ్స్ పేరుతో పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు
Advertisement

డ్రగ్స్ రహిత భారత్ కోసం
ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపు

Kishan Reddy | త్రినేత్ర న్యూస్ : డ్రగ్స్ పేరుతో దేశద్రోహ శక్తులు యువతను మత్తుకు బానిసలుగా మార్చి పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత కుటుంబాలకు, సమాజానికి దూరమవుతోందని అన్నారు. దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వ్యతిరేక అవగాహనలో భాగంగా కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మూడు రోజులపాటు 'వాక్ ఫర్ నషాముక్త్ భారత్' పాదయాత్ర ప్రారంభమైంది. బుధవారం ఉదయం అంబర్‌పేట మహంకాళి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్రను సినీ నటుడు విక్టరీ వెంకటేశ్ జెండా ఊపి ప్రారంభించారు. తొలి రోజు అంబర్‌పేట నుంచి ముషీరాబాద్ వరకు పాదయాత్ర కొనసాగింది. అనంతరం మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో యువత, విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచుతున్న పిల్లలను మాదకద్రవ్యాలకు బానిసలుగా మార్చి వారి భవిష్యత్తును దెబ్బతీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా డ్రగ్స్ రహిత దేశ నిర్మాణానికి ప్రధాని మోదీ నషాముక్త్ భారత్ అభియాన్‌కు శ్రీకారం చుట్టారని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, విద్యార్థులు, యువత, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. నటుడు వెంకటేశ్ రాకతో డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమానికి మరింత ప్రాచుర్యం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

డ్రగ్స్‌తో యువతకు దొంగదెబ్బ : ఎంపీ కె.లక్ష్మణ్

శత్రుదేశాలు భారత్‌ను బలహీనపరిచేందుకు కుట్రలు చేస్తున్నాయని ఎంపీ కె.లక్ష్మణ్ ఆరోపించారు. యువతను డ్రగ్స్‌కు బానిసలుగా మార్చడం ద్వారా దేశ యువ వనరులకు నష్టం కలిగిస్తున్నారని అన్నారు. విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ రహిత దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

డ్రగ్స్ రహిత తెలంగాణ కావాలి : బండారు దత్తాత్రేయ

యువతను డ్రగ్స్ సమస్య పట్టిపీడిస్తోందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. విదేశీ శక్తులు మత కల్లోలాలను సృష్టించడంతో పాటు యువతను మాదకద్రవ్యాలకు బానిసలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. డ్రగ్స్ రహిత భారత్ సాధించాలంటే ముందుగా తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

డ్రగ్స్‌కు నో చెబుతూ ప్రతిజ్ఞ చేద్దాం : వెంకటేశ్

డ్రగ్స్ ప్రమాదాల నుంచి పిల్లలను, దేశ యువతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని సినీ నటుడు వెంకటేశ్ అన్నారు. 2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ సాధించాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని, 'సే నో టు డ్రగ్స్' అంటూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.

యువత అప్రమత్తంగా ఉండాలి : నిఖిల్, పాయల్ రాజ్‌పుత్

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు నిఖిల్ మాట్లాడుతూ.. ఎంతోమంది ప్రముఖులు ప్రసంగించిన ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం నుంచి డ్రగ్స్ వ్యతిరేక సందేశం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. యువత డ్రగ్స్‌తో పాటు సిగరెట్ల వంటి హానికర అలవాట్లకు కూడా దూరంగా ఉండాలని సూచించారు. నటి పాయల్ రాజ్‌పుత్ సైతం పాదయాత్రలో పాల్గొని డ్రగ్స్ రహిత భారత్ కోసం అందరూ కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు, సినీ ప్రముఖులు, పార్టీ నాయకులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement