త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | పాఠ‌శాల‌ విద్యలో ఇంటర్‌ను కలుపుతారా?.. ఇంటర్‌లో స్కూల్ విద్యను కలుపుతారా?: క‌విత‌

Kavitha | ఇంటర్ బోర్డును (Inter Board) ఏకపక్షంగా పాఠ‌శాల విద్య‌లో విలీనం చేస్తామంటే అంగీకరించేది లేద‌ని తెలంగాణ రక్షణ సేన (TRS) ఆధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తల్లితండ్రులు, జూనియర్ కాలేజీలు, స్కూల్ యాజమాన్యాలు, విద్యావేత్తలతో మాట్లాడిన త‌ర్వాతే నిర్ణయం తీసుకోవాల‌ని చెప్పారు.

G

Telangana | Published On Nov 25, 2026, 4.39 pm IST

Kavitha | పాఠ‌శాల‌ విద్యలో ఇంటర్‌ను కలుపుతారా?.. ఇంటర్‌లో స్కూల్ విద్యను కలుపుతారా?: క‌విత‌
Advertisement

Kavitha | త్రినేత్ర న్యూస్‌: ఇంటర్ బోర్డును (Inter Board) ఏకపక్షంగా పాఠ‌శాల విద్య‌లో విలీనం చేస్తామంటే అంగీకరించేది లేద‌ని తెలంగాణ రక్షణ సేన (TRS) ఆధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తల్లితండ్రులు, జూనియర్ కాలేజీలు, స్కూల్ యాజమాన్యాలు, విద్యావేత్తలతో మాట్లాడిన త‌ర్వాతే నిర్ణయం తీసుకోవాల‌ని చెప్పారు. ఇంటర్ బోర్డు విలీనంపై ఉన్న అన్ని సందేహాలను నివృత్తి చేయాల‌ని డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లో క‌విత మీడియాతో మాట్లాడారు. ఇంటర్ విద్యను స్కూల్ విద్యలో (School Education) విలీనం చేస్తామనే నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నామ‌న్నారు. పాఠ‌శాల‌ విద్యలో ఇంటర్‌ను కలుపుతారా? ఇంటర్ విద్యలో స్కూల్ విద్యను కలుపుతారా? స్పష్టత ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ల్యాబ్‌లు, మౌలిక వసతులు, భోదన సిబ్బంది గురించి కూడా క్లారిటీ ఇవ్వాల‌న్నారు.

ఇప్పటికే ఇంటర్ విద్య కోసం తల్లితండ్రులు మూడు, నాలుగు లక్షలు ఖర్చు చేస్తున్నార‌ని చెప్పారు. 9, 10, 11, 12 తరగతుల కారణంగా తల్లితండ్రులపై మరింత ఫీజుల భారం ప‌డుతుంద‌ని తెలిపారు. ఇప్పుడున్న ప్రభుత్వ విద్యను సమాంతరంగా ప్రోత్సహిస్తారా?, కార్పొరేట్ ఫీజుల నియంత్రణ చేస్తారా? అనే దాని గురించి ప్రభుత్వం చెప్ప‌డం లేద‌ని వెల్ల‌డించారు. ఇష్టానుసారంగా ఇంటర్ బోర్డును స్కూల్ విద్యలో విలీనం చేస్తామంటే తాము అంగీక‌రించేది లేద‌ని, ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ఖండిస్తున్నామ‌ని చెప్పారు.

నిజామాబాద్ జిల్లాలో 18 మండలాలను మాత్రమే కరువు మండలాలు గుర్తించార‌ని, చాలా మండలాల్లో కరువు ఛాయలు ఉన్నాయన్నారు. జిల్లాలో (Nizamabad) 18 కరువు మండలాలను గుర్తించామని చెబుతున్నార‌ని, కానీ ఆ మండలాలకు ఏం ఇస్తారో, ఎలాంటి సాయం చేస్తారో స్పష్టత ఇవ్వటం లేద‌ని విమ‌ర్శించారు. ఆ 18 మండలాల్లో మాత్రమే కాకుండా మిగిలిన మండలాల్లో కూడా తాగునీటి ఇబ్బంది ఉందని చెప్పారు. అందువ‌ల్ల ప్రభుత్వం మరొకసారి రీ సర్వే చేయాల‌న్నారు. కరువు మండలాల జాబితాను మ‌రోసారి ప్రకటించాల‌ని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని కరువు బారి నుంచి బయటపడేసేందుకు కేంద్రం సాయం చేయాల‌ని డిమాండ్ చేశారు.

కరువును (Drought) దృష్టిలో పెట్టుకొని రైతులకు ప్ర‌భుత్వం సరైన ప్రణాళిక ఇవ్వాల‌న్నారు. అరుతడి పంటలు వేయాలని చెబుతున్న ప్రభుత్వం ఏ పంటలు వేయాలో చెప్పడం లేదని విమ‌ర్శించారు. రైతులు అరుతడి పంటలు వేస్తే ఏ ధరకు కొంటారో కూడా చెప్పడం లేద‌ని మండిప‌డ్డారు. రైతులకు సబ్సిడీ, యూరియా విషయంలో కూడా స్పష్టత లేద‌న్నారు. ఇష్టానుసారంగా కరెంట్ కోతలు విధిస్తున్నార‌ని, ఈ కరెంట్ కోతలను (Power Cut) నమ్ముకొని రైతులు పంటలు వేసే పరిస్థితి లేదని చెప్పారు. వ్య‌వ‌సాయ‌ అధికారులు, నాయకులను సమన్వయం చేసుకొని రైతులకు ప్రభుత్వ ఒక‌ స్పష్టత ఇవ్వాల‌న్నారు. ఈ కరువు పరిస్థితుల్లో రైతులను ఎక్కువగా ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేన‌ని చెప్పారు. కానీ బీజేపీ ఎంపీలు దీనిపై ఒక్కమాట మాట్లాడటం లేదని మండిప‌డ్డారు. ఒక్క‌ పైసా కూడా కేంద్రం నుంచి తేవటం లేదని విమ‌ర్శించారు. 16 వ ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా రాకపోవ‌డంతో సర్పంచులు ఇబ్బందులు పడుతున్నార‌ని విమ‌ర్శించారు.

అటు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్లు పాదయాత్రలు చేస్తుంటే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్లు మీటింగ్‌లు పెడుతున్నార‌ని ఎద్దేవాచేశారు. స్వడబ్బ, పరడబ్బ, పరస్పర డబ్బా అన్నట్లు వాళ్లకు వాళ్లే పొడుగుకుంటున్నారని మండిప‌డ్డారు. కానీ ప్రజలను పట్టించుకోవటం లేదని విమ‌ర్శించారు. ముందు క్షేత్రస్థాయిలోకి వచ్చి ప్రజల సమస్యలు పట్టించుకోవాలని ఆయా పార్టీలను కోరారు.

Advertisement
Advertisement