త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KUDA | ‘కుడా’లో రూ. 70 కోట్ల అవినీతి.. టెండ‌ర్లు ర‌ద్దు చేయాల్సిందే

KUDA | రాష్ట్రంలో స్ట్రీట్ లెవ‌ల్ నుంచి స్టేట్ లెవ‌ల్ వ‌ర‌కు అవినీతి జ‌రుగుతుంద‌ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం విన‌య్ భాస్క‌ర్ ఆరోపించారు. కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ(KUDA)లో రూ. 70 కోట్ల అవినీతి జ‌రిగింద‌ని ఆయ‌న తెలిపారు.

S

Telangana | Published On Jul 7, 2026, 2.08 pm IST

KUDA | ‘కుడా’లో రూ. 70 కోట్ల అవినీతి.. టెండ‌ర్లు ర‌ద్దు చేయాల్సిందే
Advertisement

KUDA | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో స్ట్రీట్ లెవ‌ల్ నుంచి స్టేట్ లెవ‌ల్ వ‌ర‌కు అవినీతి జ‌రుగుతుంద‌ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం విన‌య్ భాస్క‌ర్ ఆరోపించారు. కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ(KUDA)లో రూ. 70 కోట్ల అవినీతి జ‌రిగింద‌ని ఆయ‌న తెలిపారు. దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని విన‌య్ భాస్క‌ర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో దాస్యం విన‌య్ భాస్క‌ర్ మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్ నగరం తర్వాత వరంగల్ నగరాన్ని కేసీఆర్ అభివృద్ధి చేశారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు హౌలే మాటలు మాట్లాడుతూ చూతే పనులు చేస్తున్నారు. తోడు దొంగలు రాజేందర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి క‌లిసి కుడాలో అవినీతికి పాల్పడుతున్నారు. కుడా స్థలాలను అప్పనంగా పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు రూ. 70 కోట్ల అవినీతి కుడాలో జరిగింది. దేవుడి భూమి 5 ఎకరాల స్థలాన్ని స్టార్ హోటల్‌కు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కుడా ఆధ్వర్యంలో కుంటలను కబ్జాలు చేసి బిల్డర్లకు కట్టబెడుతున్నారని విన‌య్ భాస్క‌ర్ మండిప‌డ్డారు.

వెంకట్రామిరెడ్డి భుజంపై తుపాకీ పెట్టి రాజేందర్ రెడ్డి కాలుస్తున్నారు

హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివర్సిటీలో ఏ విధంగా చేశారో వరంగల్‌లో అదే విధంగా చేస్తున్నారు. వెంకట్రామిరెడ్డి భుజంపై తుపాకీ పెట్టి రాజేందర్ రెడ్డి కాలుస్తున్నారు. రాజేందర్ రెడ్డి నాలుగు ఫీట్లు ఉంటారు. కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కుడా టెండర్లను సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేయాలి. మేము తెలంగాణ ఉద్యమంలో ఉంటే రాజేందర్ రెడ్డి గూండాలతో మాపై దాడి చేసే ప్రయత్నం చేశారని వినయ్ భాస్క‌ర్ గుర్తు చేశారు.

రూ. 100 కోట్ల ఆదాయానికి వ‌చ్చింది రూ. 49 కోట్లే..

అనంత‌రం కుడా మాజీ చైర్మ‌న్ మ‌ర్రి యాద‌వ్ రెడ్డి మాట్లాడుతూ.. కుడా స్థలాలను వేలం పెట్టి విలువైన భూములను తమ వారికి ఇప్పించుకున్నారు. రెండున్నర ఎకరాల ప్రైమ్ ల్యాండ్ అప్పటి కలెక్టర్ ఆమ్రపాలి కుడాకు అప్పగించారు. ఇప్పుడు ఆ స్థలాన్ని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ 8 ప్లాట్లుగా చేసి వేలం పెట్టారు. గ‌జం రూ. 65 వేలకు ఫిక్స్ చేశారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సిండికేట్ ఏర్పాటు చేసి అదనంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 6,697 గజాలను వేలంలో పెట్టారు. రూ. 100 కోట్ల ఆదాయం కుడాకు రావాలి. కానీ రూ. 49 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. నర్సంపేట రోడ్డులో కమర్షియల్ ఫ్లాట్‌కు గజం రూ. 85 వేలు ఫిక్స్ చేశారు. కుడాకు రూ. 70 కోట్ల నష్టం చేశారు. కుడా చైర్మన్‌గా నేను ఉన్నప్పుడు ఒక్క గజం తక్కువ రేటుకు అమ్మలేదు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు తోడేళ్ల మాదిరి దోచుకుంటున్నారు. కుడా వేలాన్ని రద్దు చేసి ఆన్ లైన్ టెండర్ల ద్వారా వేలం ప్రక్రియ నిర్వహించాలి. గజం రూ. 70 వేలు ఇవ్వడానికి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఎవరు..? కుడా ఏమైనా రాజేందర్ రెడ్డి స్వంత ప్రాపర్టీనా..? కుడాపై రాజేందర్ రెడ్డికి ఏం అధికారం ఉంది. ఇష్టం వచ్చినట్లు ఎమ్మెల్యే బిఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత వరంగల్ వెస్ట్‌లో ఒక్క ఇంచు అభివృద్ధి జరగలేదు. బిఆర్ఎస్ హయాంలో జరిగిన కుడా అభివృద్ధిపై చర్చకు సిద్దం. రాజేందర్ రెడ్డి జాగ్రత్తగా మాట్లాడాలి అని మ‌ర్రి యాద‌వ రెడ్డి హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement