త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Irrigation DEE | ఆదాయానికి మించిన ఆస్తులు.. ఇరిగేష‌న్ డీఈఈ స‌త్య‌నారాయ‌ణ అరెస్ట్‌.. 14 రోజులు రిమాండ్‌

Irrigation DEE | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (Irrigation DEE) రాగిరి సత్యనారాయణ గౌడ్‌ను (Satyanarayana Goud) అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్ట్ చేశారు.

G

Telangana | Published On Nov 13, 2026, 9.48 am IST

Irrigation DEE | ఆదాయానికి మించిన ఆస్తులు.. ఇరిగేష‌న్ డీఈఈ స‌త్య‌నారాయ‌ణ అరెస్ట్‌.. 14 రోజులు రిమాండ్‌
Advertisement

Irrigation DEE | త్రినేత్ర న్యూస్‌: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (Irrigation DEE) రాగిరి సత్యనారాయణ గౌడ్‌ను (Satyanarayana Goud) అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం హైద‌రాబాద్‌తోపాటు నాగ‌ర్‌క‌ర్నూల్‌లోని ఆయ‌న నివాసంతోపాటు ఆఫీసు, బంధువుల ఇండ్ల‌లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో భారీగా అక్ర‌మాస్తుల‌ను గుర్తించారు. దీంతో ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు.. శుక్రవారం (నవంబర్ 13) న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఈ నెల 27 వరకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ( Judicial Remand) విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.

2005లో నీటిపారుద‌ల శాఖ‌లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా చేరిన సత్యనారాయణ.. ప్రస్తుతం నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లా నీటిపారుద‌ల‌, ఆయ‌క‌ట్టు అభివృద్ధి (ICAD) డీఈఈగా పనిచేస్తున్నారు. కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పనుల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయంటూ టోల్‌ ఫ్రీ నంబర్‌కు 1064కు ఫిర్యాదులు రావడంతో రెండు నెలలుగా ఆయనపై ఏసీబీ నిఘా పెట్టింది.

భారీగా ఆస్తులు..

గురువారం ఉదయం సెర్చ్‌ వారెంట్లతో రంగంలోకి దిగిన అధికారులు హైదరాబాద్‌ (Hyderabad) కర్మన్‌ఘాట్‌లోని సత్యనారాయణ నివాసంతోపాటు నాగర్‌కర్నూల్‌లోని కార్యాలయం, నాగర్‌కర్నూల్‌ జిల్లా షాపూర్‌లోని స్వగృహం, ఆయన సోదరుడు శ్రీశైలంగౌడ్‌ ఇల్లు, ఫామ్‌హౌస్‌లు.. మొత్తం 10 చోట్ల సోదాలు చేపట్టారు. రాత్రి పొద్దుపోయే వరకు ఈ తనిఖీలు కొనసాగాయి. సోదాలు ముగిసిన త‌ర్వాత ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. సత్యనారాయణగౌడ్‌ తండ్రి మన్యంగౌడ్‌ ఆస్తుల వివరాలపైనా అధికారులు ఆరా తీస్తున్నారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం అక్రమాస్తుల విలువ సుమారు రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు ఉండగా, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.70 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సోదాల సంద‌ర్భంగా స‌త్య‌నారాయ‌ణ నివాసంలో 50 తులాల బంగారు ఆభ‌ర‌ణాలు, నాలుగు కార్లు, ఒక ట్రాక్ట‌ర్‌తోపాటు ఎల్ఐసీ బాండ్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక తుక్కుగూడ‌లో ఒక ఖ‌రీదైన విల్లా, వ‌న‌ప‌ర్తిలో 25 ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమి, హైద‌రాబాద్‌లో రెండు ఫ్లాట్లు, ఐదు ఓపెన్ ప్లాట్లు ఉన్న‌ట్లు గుర్తించారు. బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో దాదాపు రూ.20 లక్షల పెట్టుబడులు గుర్తించారు.

Advertisement
Advertisement