త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

X | త‌ప్పైంది.. క్ష‌మించండి.. ఇక‌పై అలా జ‌ర‌గ‌కుండా చూస్తాం: ఎక్స్

X | సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ త‌న త‌ప్పును ఒప్పుకుంది. ఇందుకు గాను క్ష‌మాప‌ణ‌లు అడుగుతున్న‌ట్లు తెలిపింది. ఇక‌పై అలా జ‌ర‌గ‌కుండా చూసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది. భార‌త చట్టాలు, నియ‌మ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని, ఇకపై అశ్లీల కంటెంట్ త‌మ ప్లాట్‌ఫామ్‌లో రాకుండా చూసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది.

S

Technology | Published On Jan 11, 2026, 12.40 pm IST

X | త‌ప్పైంది.. క్ష‌మించండి.. ఇక‌పై అలా జ‌ర‌గ‌కుండా చూస్తాం: ఎక్స్
Advertisement

X | సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ త‌న త‌ప్పును ఒప్పుకుంది. ఇందుకు గాను క్ష‌మాప‌ణ‌లు అడుగుతున్న‌ట్లు తెలిపింది. ఇక‌పై అలా జ‌ర‌గ‌కుండా చూసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది. భార‌త చట్టాలు, నియ‌మ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని, ఇకపై అశ్లీల కంటెంట్ త‌మ ప్లాట్‌ఫామ్‌లో రాకుండా చూసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఎక్స్ (X) ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. కాగా ఎక్స్ (X) లో అందుబాటులో ఉన్న గ్రోక్ (Grok) అనే ఏఐ ప్లాట్‌ఫామ్ ద్వారా కొంద‌రు వ్య‌క్తులు మ‌హిళ‌ల‌కు చెందిన ఫొటోలను అశ్లీక‌ర‌మైన ప‌ద్ధ‌తిలో మార్ఫింగ్ చేస్తున్నార‌ని, కొన్ని సంద‌ర్భాల్లో అస‌లు దుస్తులు లేకుండా పూర్తి న‌గ్నంగా మార్చేలా ఆ ఏఐ (AI) టూల్ ప‌నిచేస్తుంద‌ని, దానిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే సంబంధిత మంత్రిత్వ శాఖ ఎక్స్‌ను వివ‌ర‌ణ కోర‌గా ఆ సంస్థ పైవిధంగా స్పందించింది.

600 అకౌంట్లు డిలీట్‌..

ఎక్స్‌లో ఉన్న గ్రోక్ చేస్తున్న ఈ చ‌ట్ట విరుద్ధ‌మైన ప‌నికి ఆ ప్లాట్‌ఫామ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ ఇటీవ‌లే రాజ్య‌స‌భ ఎంపీ ప్రియాంక చ‌తుర్వేది సైతం కేంద్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు ఆమె ఓ లేఖ కూడా రాశారు. అలాగే గ్రోక్ పాల్ప‌డుతున్న ఈ అరాచ‌కాన్ని అడ్డుకోవాలంటూ చాలా మంది మ‌హిళ‌లు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కేంద్ర ఎల‌క్ట్రానిక్స్‌, ఐటీ (MeitY) మంత్రిత్వ శాఖ ఎక్స్‌ను ఈ విష‌యంపై వివ‌ర‌ణ కోరుతూ 72 గంట‌లు స‌మ‌యం ఇచ్చింది. స్పందించ‌క‌పోతే ఎక్స్ సేవ‌ల‌ను భార‌త్‌లో నిలిపివేస్తామ‌ని కూడా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. దీంతో ఎక్స్ ఈ విష‌యంపై స్పందించి ఎట్ట‌కేల‌కు దిగి వ‌చ్చింది. జ‌రిగిన విష‌యంపై క్ష‌మాప‌ణ చెబుతున్నామ‌ని, నిజంగా తాము చేసింది త‌ప్పేన‌ని వ్యాఖ్యానించింది. ఈ క్ర‌మంలోనే గ్రోక్ ప్లాట్‌ఫామ్‌ను అస‌భ్య‌క‌ర‌మైన చిత్రాలు, వీడియోల కోసం వాడుతున్న 600 అకౌంట్ల‌ను డిలీట్ చేశామని, అలాంటి అస‌భ్య‌క‌ర‌మైన కంటెంట్‌ను కూడా తొల‌గించామ‌ని, సుమారుగా 3500 అస‌భ్య‌క‌ర ఫొటోలు, వీడియోల‌ను బ్లాక్ చేశామ‌ని తెలిపింది. ఇక‌పై ఇలా జ‌ర‌గ‌కుండా చూసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది.

డ‌బ్బుల కోసమే ఎక్స్ ఆ ప‌ని..

కాగా ఎక్స్‌లో పెయిడ్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే గ్రోక్ ద్వారా అలాంటి కంటెంట్ ను క్రియేట్ చేసేందుకు అవ‌కాశం ఉంద‌ని ఎంపీ చ‌తుర్వేది తెలిపారు. ఎక్స్ సంస్థ డ‌బ్బుల కోస‌మే పెయిడ్ యూజర్ల‌కు ఇలాంటి సేవ‌ల‌ను అందిస్తుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎక్స్‌కు కేవ‌లం డ‌బ్బు మాత్రమే కావాలి, అందుక‌నే పెయిడ్ యూజర్ల‌ కోసం గ్రోక్‌లో ఇలాంటి అస‌భ్య‌క‌ర‌మైన కంటెంట్‌ను క్రియేట్ చేసుకునేందుకు వీలు క‌ల్పించారు, మ‌హిళ‌లు, చిన్నారులు ఏమైపోతే వారికేంటి, వారికి డ‌బ్బులు వ‌స్తే చాలు క‌దా.. అని చ‌తుర్వేది ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఎక్స్‌లో ఉన్న గ్రోక్ ద్వారా ఏఐ రూపంలో మ‌హిళ‌ల ఫొటోల‌ను క్రియేట్ చేయ‌డ‌మే కాకుండా, వాటిని అస‌భ్య‌రంగా జ‌న‌రేట్ చేస్తున్నార‌ని ఆమె తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న యువ‌తులు, మ‌హిళ‌ల ఫొటోల‌ను సేక‌రించి కూడా కొంద‌రు వ్య‌క్తులు గ్రోక్ ద్వారా అస‌భ్య‌క‌ర‌మైన కంటెంట్‌ను క్రియేట్ చేస్తున్నార‌ని తెలిపారు. ఇలాంటి చ‌ర్య‌ల‌ను స‌హించేది లేద‌ని, ఏఐ ప్లాట్‌ఫామ్‌ల‌పై క‌చ్చితంగా దృష్టి సారించాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement