త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apple iPad | కంటెంట్ క్రియేట‌ర్ల కోసం ఏ ఐప్యాడ్ సెట్ అవుతుంది.. ఫీచ‌ర్లు ఎలా ఉండాలి..?

Apple iPad | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ ప్ర‌తి ఏడాది కొత్త ఐప్యాడ్ మోడ‌ల్స్‌ను విడుద‌ల చేస్తుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ నేప‌థ్యంలో స‌రైన మోడ‌ల్‌ను ఎంచుకోవ‌డం చాలా మందికి అయోమ‌యంగా అనిపిస్తుంది. ఎందుకంటే కొత్త మోడ‌ల్స్ అన్నింటిలోనూ దాదాపు ఒకేలాంటి ఫీచ‌ర్ల‌ను కాస్త తేడాల‌తో ఇస్తారు.

S

Technology | Published On Jul 18, 2026, 3.24 pm IST

Apple iPad | కంటెంట్ క్రియేట‌ర్ల కోసం ఏ ఐప్యాడ్ సెట్ అవుతుంది.. ఫీచ‌ర్లు ఎలా ఉండాలి..?
Advertisement

Apple iPad | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ ప్ర‌తి ఏడాది కొత్త ఐప్యాడ్ మోడ‌ల్స్‌ను విడుద‌ల చేస్తుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ నేప‌థ్యంలో స‌రైన మోడ‌ల్‌ను ఎంచుకోవ‌డం చాలా మందికి అయోమ‌యంగా అనిపిస్తుంది. ఎందుకంటే కొత్త మోడ‌ల్స్ అన్నింటిలోనూ దాదాపు ఒకేలాంటి ఫీచ‌ర్ల‌ను కాస్త తేడాల‌తో ఇస్తారు. అందువ‌ల్ల ఏ ఐప్యాడ్ సెట్ అవుతుంది..? అని ఆలోచించుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. స‌రైన మోడ‌ల్‌ను ఎంపిక చేయ‌క‌పోతే అవ‌స‌రానికి మించి అయినా ఖర్చు చేస్తారు లేదా అనుకున్న ఫీచ‌ర్లు క‌లిగిన మోడ‌ల్‌ను కొన‌లేక‌పోతారు. అందువ‌ల్ల డివైస్‌ను ఎంచుకునే ముందు ప్ర‌తి ఫీచ‌ర్‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించాల్సి ఉంటుంది. ముఖ్యంగా డిస్‌ప్లే సైజు, రిజ‌ల్యూష‌న్‌, ప్రాసెస‌ర్‌, స్టోరేజ్, ర్యామ్‌, సాఫ్ట్ వేర్ ఆప్ష‌న్లు, బ్యాట‌రీ, వ్య‌క్తిగ‌త అవ‌స‌రాలు వంటి అన్ని విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఆ త‌రువాతే స‌రైన ఐప్యాడ్ మోడ‌ల్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

సౌక‌ర్య‌వంతంగా ప‌నిచేసేందుకు ఐప్యాడ్‌..

ఐప్యాడ్‌ను కంటెంట్ క్రియేష‌న్ కోసం గ‌న‌క వాడాల‌ని భావిస్తే అప్పుడు నిర్ణ‌యం తీసుకోవ‌డం తేలిక‌వుతుంది. వీడియో ఎడిటింగ్‌, సోష‌ల్ మీడియా కంటెంట్ క్రియేష‌న్‌, డిజైన్ స్కెచ్‌లు లేదా ప్ర‌యాణాల్లో ల్యాప్‌టాప్‌కు ప్ర‌త్యామ్నాయంగా ఐప్యాడ్ ఎంతో మేలు చేస్తుంది. చాలా సౌక‌ర్య‌వంతంగా ఉప‌యోగించ‌వ‌చ్చు. పైగా బ్యాట‌రీ కూడా ఎక్కువ బ్యాక‌ప్ ఇస్తుంది. అందువ‌ల్ల ఎక్కువ‌గా ప్ర‌యాణాలు చేసే కంటెంట్ క్రియేట‌ర్ల‌కు ఐప్యాడ్ ఉత్త‌మ ఎంపిక‌గా నిలుస్తుంది. ముఖ్యంగా ఐప్యాడ్ ప్రొ మోడ‌ల్ ను తీసుకుంటే ఎక్కువ ఉప‌యోగక‌రంగా ఉంటుంది. ఇందులో వీడియో ఎడిటింగ్‌, సోష‌ల్ మీడియా మేనేజ్‌మెంట్ వంటి పనుల‌ను సుల‌భంగా చేయ‌వ‌చ్చు. కీబోర్డు, మౌస్ కూడా క‌నెక్ట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది క‌నుక ప‌ని సుల‌భ‌త‌రం అవుతుంది. బ్యాట‌రీ బ్యాక‌ప్ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. అలాగే డిస్‌ప్లే సైజ్ కూడా ముఖ్యమే. క‌నీసం 11 నుంచి 13 ఇంచుల డిస్‌ప్లే సైజ్ క‌లిగిన ఐప్యాడ్ అయితే ఉత్త‌మంగా ప‌నిచేస్తుంది. దీంతో వీడియో టైమ్‌లైమ్‌ల‌ను ఎడిట్ చేయ‌డం, మ‌ల్టిపుల్ లేయ‌ర్ల‌ను వాడ‌డం వంటి ప‌ని సుల‌భ‌త‌రం అవుతుంది. ఫొటోషాప్ వంటి యాప్‌ల‌లో ఫొటోల‌ను తేలిగ్గా ఎడిట్ చేయ‌వ‌చ్చు.

యాక్స‌స‌రీల స‌పోర్ట్‌..

యాపిల్ త‌న ఐప్యాడ్‌, మాక్ మోడ‌ల్స్‌కు మ్యాజిక్ కీబోర్డు, మౌస్‌ల‌ను అందిస్తుంది. అందువ‌ల్ల వాటిని ఉప‌యోగిస్తే ప‌ని మ‌రింత సుల‌భ‌త‌రం అవుతుంది. ఇక డిజైన‌ర్లు అయితే యాపిల్ పెన్సిల్ ఉప‌యోగ‌ప‌డుతుంది. యాపిల్‌లో ఎం సిరీస్ చిప్‌సెట్ క‌లిగిన ఐప్యాడ్‌ల‌ను వాడితే మేలు. ఇవి వేగ‌వంత‌మైన వీడియో రెండ‌రింగ్ ను అందించ‌డంతోపాటు భారీ ప్రాజెక్టుల‌ను సైతం త‌ట్టుకుంటాయి. ముఖ్యంగా ఫైన‌ల్ క‌ట్ ప్రొ వంటి యాప్‌ల‌ను వాడేట‌ప్పుడు ఎం సిరీస్ చిప్‌సెట్‌లు అద్భుతంగా ప‌నిచేస్తాయి. ఫైల్స్‌ను మాక్‌కు మార్చి అందులో ఎడిట్ చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. నేరుగా ఐప్యాడ్ లోనే ఎడిటింగ్ చేయ‌వ‌చ్చు. అయితే కంటెంట్ క్రియేష‌న్‌ను పూర్తి స్థాయిలో వృత్తిగా స్వీక‌రించ‌బోయేవారు లేదా ఇప్ప‌టికే ప‌నిచేస్తున్న‌వారు ఐప్యాడ్ ప్రొ మోడ‌ల్స్‌ను వాడితే ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

ప్రీమియం డివైస్ గా చూడ‌కూడ‌దు..

ఐప్యాడ్ ప్రొ అంటే ప్ర‌తి ఒక్క‌రికీ బ‌డ్జెట్‌లో ఉండ‌దు. కానీ ప్రీమియం డివైస్ క‌నుక దీన్ని బిజినెస్‌కు ఒక పెట్టుబ‌డిగా భావించాలి. కంటెంట్ క్రియేష‌న్ అంటే సాధార‌ణంగా అంతిమ ల‌క్ష్యం పాపుల‌ర్ అవ‌డంతోపాటు డ‌బ్బు సంపాద‌న కూడా. అందువ‌ల్ల ధ‌ర‌కు ఆందోళ‌న‌కు గుర‌వ‌కుంగా వ‌న్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ గా దీన్ని భావించాలి. ఇక ఐప్యాడ్ ప్రొలో సాధార‌ణ ఐప్యాడ్ క‌న్నా డిస్‌ప్లే మ‌రింత మెరుగ్గా ఉంటుంది. అద్భుత‌మైన రంగుల క‌లయిక ఉంటుంది. అందువ‌ల్ల వీడియో, ఫొటో ఎడిటింగ్‌ల‌లో ఫైల్స్ మ‌రింత నాణ్యంగా అవుట్‌పుట్ లో వ‌స్తాయి. అలాగే సాధార‌ణ లేదా ప్రీమియం కాకుండా మ‌ధ్య‌స్థ ర‌కంగా ఉండే ఐప్యాడ్ కావాలంటే ఐప్యాడ్ ఎయిర్ మోడ‌ల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా ఎడిటింగ్ కోసం మెరుగైన ప‌నితీరును అందిస్తాయి. చాలా వ‌ర‌కు ఐప్యాడ్ మోడ‌ల్స్ 4కె వీడియో ఎడిటింగ్‌, గ్రాఫిక్ డిజైన్‌, మల్టీ టాస్కింగ్ వంటి నప‌నుల‌కు సైతం సుల‌భంగా స‌పోర్ట్‌ను అందిస్తాయి. అయితే యాపిల్‌కు చెందిన ఎ సిరీస్ ప్రాసెస‌ర్ కాకుండా ఎం సిరీస్ ప్రాసెస‌ర్ ఉండే ఐప్యాడ్ మోడ‌ల్స్ అయితే మంచిది. అవి మ‌ల్టీ టాస్కింగ్‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తాయి.

ఎవ‌రికి ఏది సెట్ అవుతుంది..?

యాపిల్ పెన్సిల్‌, మ్యాజిక్ కీబోర్డు, ఇత‌ర యాక్సెస‌రీల‌కు కూడా ఐప్యాడ్‌లు స‌పోర్ట్‌ను ఇస్తాయి. విద్యార్థులు అయితే సాధార‌ణ ఐప్యాడ్ స‌రిపోతుంది. ప్రొఫెష‌న‌ల్స్ ఐప్యాడ్ ఎయిర్ కొనుగోలు చేయ‌వ‌చ్చు. గ్రాఫిక్ డిజైన్‌, కంటెంట్ క్రియేట‌ర్లు, ఎడిట‌ర్ల‌కు యాపిల్ ఐప్యాడ్ ప్రొ సెట్ అవుతుంది. వీటిల్లో వైఫై, సెల్యులార్ మోడ‌ల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్యూలార్ అవ‌స‌రం లేద‌నుకుంటే కాస్త త‌క్కువ ధ‌ర‌కు వైఫై మోడ‌ల్స్ ల‌భిస్తాయి. ఇక వివిధ ర‌కాల స్టోరేజ్ వేరియెంట్ల‌ను సైతం వీటిల్లో అందిస్తున్నారు. సాధార‌ణ ప‌నుల కోసం తీసుకునే ఐప్యాడ్‌కు బేసిక్ స్టోరేజ్ మోడ‌ల్ స‌రిపోతుంది. గ్రాఫిక‌ల్ వ‌ర్క్ అయితే కాస్త స్టోరేజ్ ఎక్కువ‌గా ఉన్న మోడ‌ల్‌నే ఎంపిక చేసుకోవాలి. వ్య‌క్తిగ‌త అవ‌స‌రాలకు అనుగుణంగా ఐప్యాడ్‌ల‌ను తీసుకుంటే వాటితో మెరుగైన ప‌నితీరును పొంద‌వ‌చ్చు. ఐప్యాడ్‌ల‌ను అధిక ధ‌ర క‌లిగిన ప్రీమియం మోడ‌ల్స్‌గా కాకుండా బిజినెస్ ప‌రంగా వ‌న్ టైమ్ పెట్టుబ‌డిగా భావిస్తే దాంతో ఎంతో ఉత్పాద‌క‌త రాబ‌ట్ట‌వ‌చ్చు.

Advertisement
Advertisement